ఈ సంవత్సరం రాజు, మంత్రి కూడా చంద్రుడే కావడం శుభప్రదం. నవనాయకుల్లో నలుగురు శుభులు కాగా, ఐదుగురు పాపులు. 21మంది ఉపనాయకుల్లో 13మంది శుభులు, ఎనిమిది మంది పాపులు. వర్షలగ్నం ధనుస్సు కావడం, లగ్నాన్ని గురుడు వీక్షించడం శుభకరం. తూర్పు, ఉత్తర ప్రాంతాలలో సుభిక్షం, మధ్యప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు. వర్షలగ్నంలో లగ్న, చతుర్థాధిపతి గురుడు సప్తమస్థితి, ద్వితీయ, తృతీయాధిపతి శని రాహువుతో కలసి లాభస్థితి, పంచమ, వ్యయస్థానాధిపతి కుజునికి రాజ్యస్థితి, షష్టమ, లాభస్థానాధిపతి శుక్రుడు సప్తమ, రాజ్యస్థానాధిపతి బుధునితో కూడి తృతీయ స్థితి. అష్టమ స్థానాధిపతి, రాజైన చంద్రుడు చతుర్ధస్థానంలో భాగ్యస్థానాధిపతి అయిన రవితో కలయిక.
రాజైన చంద్రునిపై కుజదృష్టి వల్ల రాజకీయ, ఆర్థికరంగాల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం. దేశంలో అలజడులు, ప్రజల మధ్య వైషమ్యాలు ప్రబలినా గురు ప్రభావం వల్ల తీవ్రత తగ్గి శాంతి నెలకొంటుంది. ఇరుగుపొరుగు దేశాలతో సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాం.
ఇక జగర్లగ్నం వృషభం అయినది. లగ్న, షష్టమాధిపతి శుక్రుడు రాజ్యస్థితి, ద్వితీయ, పంచమాధిపతి బుధునికి లాభస్థితి. తృతీయాధిపతి చంద్రుడు పంచమంలో సప్తమ, వ్యయాధిపతి కుజునితో చేరిక, చతుర్ధాధిపతి రవి కేతువుతో కలిసి వ్యయంలో ఉచ్ఛస్థితి.
అష్టమ, లాభాధిపతి గురునికి ద్వితీయస్థితి కలిగింది. వర్ష, జగర్లగ్నాల రీత్యా పరిశీలిస్తే రాజు,మంత్రి చంద్రుడు కావడం శుభకరమైనా ఆర్థిక సంక్షోభాలు తప్పకపోవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. తెల్లటి పంటలు, వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగవచ్చు. భూముల ధరలు ఆకాశాన్నంటుతాయి. సేనాధిపతి రవి అష్టమాధిపతి చంద్రునితో కలయిక వల్ల పాలకులు, రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొంటాయి. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారే అవకాశం. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పాలకులు ఇబ్బందులు అధిగమించి ప్రజారంజక పాలనతో ప్రజలను ఆకట్టుకుంటారు.
అయితే కొన్ని పార్టీల ఉనికి ప్రశ్నార్థకం కాగల అవకాశాలున్నాయి. సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు కావడం వల్ల పంటల దిగుబడి బాగుంటుంది. వ్యవసాయదారులకు అనుకూల కాలం. తూర్పు, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో అధిక వర్షాలు, మధ్యప్రాంతంలో కరువుకాటకాలు. నవంబర్ నుంచి శని వృశ్చిక రాశిలో సంచారంతో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల జన,ఆస్తి, పంటనష్టాలు సంభవించవచ్చు. మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పరిశోధకులకు విశేషంగా కలిసివస్తుంది.
క్రీడాకారులకు మంచి గుర్తింపు. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు దక్కుతాయి. కళాకారులు, పత్రికా రంగం వారు ఈ ఏడాది కొత్త అవకాశాలతో బిజీగా మారతారు. వైద్యులు, న్యాయవాద వృత్తుల్లోని వారు నైపుణ్యాన్ని చాటుకుని గుర్తింపు పొందుతారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు మరింత అభివృద్ధి సాధిస్తాయి. పారిశ్రామికరంగం కొంత ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ కుజుడు తులారాశిలో శనితో కలయిక వల్ల ఉగ్రవాదుల చర్యలు, భూకంపాది ప్రమాదాలు, విచిత్రమైన వ్యాధులు ప్రబలే అవకాశం. మొత్తం మీద గత ఏడాది కంటే అనుకూలమనే చెప్పాలి. గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితి పొందడం వల్ల శ్రావణ మాసం నుంచి సస్యానుకూలత, సుభిక్షం, రాజకీయ సుస్థిరత ఉంటాయి.
22.06.14తేదీ జ్యేష్ట బహుళ దశమి తత్కాల ఏకాదశి ఆదివారం సా.6.22గంటలకు అశ్వని నక్షత్రం, అతిగండ యోగం, వణజి కరణం, ధనుర్లగ్నంలో రవి ఆరుద్రా నక్షత్ర ప్రవేశం. దీనివల్ల పంటలు అధికంగా ఉంటాయి. సుభిక్షం, పశువులకు కొంతవరకూ హాని, యుద్ధభయాలు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల పశువృద్ధి. పాడిపరిశ్రమకు మంచిరోజులు. అయితే సంరక్షకుడు యముడు కావడం వల్ల కొంత నష్టంతో పాటు, పాడిపంటల ధరలు మధ్యమంగా ఉంటాయి.
ఈ ఏడాది ఉగాది నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ వృద్ధగోపపాలకుని చేతిలోనూ, తదుపరి బాలగోపపాలకుని చేతిలోనూ అఢకం(వర్షకుంచం) ఉంటుంది. దీనివల్ల సుభిక్షం, తగినంతగా వర్షాలు, సస్యానుకూలం.
జ్యేష్ట బహుళ సప్తమి, గురువారం అనగా 19.06.14వ తేదీ ఉ.8.52 గంటలకు గురుడు కర్కాటక రాశిలో ప్రవేశం. ఈరోజు నుంచి 30.06.14తేదీ వరకూ యమునానదీ పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నదిలో స్నానాదులు, పిండప్రదానం, దానధర్మాలు నిర్వహించడం మంచిది. ఈ సంవత్సరం రాష్ట్రంలో కనిపించే గ్రహణాలు లేవు.
నవనాయకుల ఫలితాలు...
రాజు - చంద్రుడు... పరిపాలన సాఫీగా సాగుతుంది. గోధుమలు, వరి,చెరకు పంటలు బాగా పండుతాయి. పాడిపంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. తెల్లటి వస్తువులకు గిరాకీ పెరుగుతుంది.
మంత్రి - చంద్రుడు... రాజకీయ రంగంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రజలు, పాలకులు పరస్పరం సహకారంతో మెలుగుతారు. నిత్యావసర వస్తువులు, భూముల ధరలు పెరుగుతాయి.
సేనాధిపతి - రవి... రాష్ట్రాల మధ్య పరస్పర వివాదాలు. పొరుగుదేశాల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. సైన్యానికి ప్రాధాన్యం పెరుగుతుంది.
సస్యాధిపతి - గురుడు... గోధుమలు, సెనగ పంట బాగా పండుతుంది. వీటి తో పాటు, బంగారం, పసుపు పంటలకు గిరాకీ పెరుగుతుంది. తగినంతగా వర్షాలు కురిసి పంటలకు ఉపయోగకరంగా ఉంటాయి.
ధాన్యాధిపతి - కుజుడు... ఎరుపు భూములు ఫలవంతమవుతాయి. కందులు, బొబ్బర్లు, మిర్చి పంటలకు గిరాకీ పెరుగుతుంది. వీటితో పాటు, బెల్లం, నెయ్యి, పంచదార ధరలు పెరుగుతాయి.
ఆర్ఘాధిపతి - రవి... పాలకులమధ్య కలహాలు, ప్రజల్లో అభద్రతాభావం. యుద్ధభయాలు, రోగభయాలు. మిరియాలు, మిర్చి, ఎరుపు వస్తువులకు గిరాకీ పెరుగుతుంది.
మేఘాధిపతి - రవి... ఎర్ర ని పంటలు బాగా పండుతాయి. ప్రజల మధ్య కలహాలు. వర్షాలు కొన్నిచోట్ల అధికం. మొత్తం మీద పంటలకు ఉపకరించే రీతిలో వర్షాలు కురుస్తాయి.
రసాధిపతి - శని... నూనెలు,నువ్వులు, ఉలవలు, నల్లనిధాన్యాలకుకొంతవరకూ గిరాకీ పెరుగుతుంది. నవ ంబర్ నుంచి ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడతారు.
నీరసాధిపతి - బుధుడు... కళాకారులు, వృత్తిదారులు, వైద్యులకు అనుకూలం. సుగంధ ద్రవ్యాలు, ఆకుపచ్చని పంటల దిగుబడితో పాటు, గిరాకీ పెరుగుతుంది.
శ్రీ జయ నామ సంవత్సరం - ఫలితాలు
Published Sat, Mar 29 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM
Advertisement
Advertisement