గల్ఫ్‌లో ఘనత చాటిన భారతీయుడు | Success Story of Dr Ravi Pillai | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో ఘనత చాటిన భారతీయుడు

Published Sun, Dec 11 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

గల్ఫ్‌లో ఘనత చాటిన  భారతీయుడు

గల్ఫ్‌లో ఘనత చాటిన భారతీయుడు

 కేరళలోని కొల్లాయం సమీపంలోని చావరా పట్టణంలో 1953 సెప్టెంబర్ 2న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు బి.రవిపిళ్లై. వ్యవసాయ నేపథ్యంలో పుట్టిపెరిగినా, రవి పిళ్లైకి చిన్నప్పటి నుంచి వ్యాపారంపైనే మక్కువ ఉండేది. కొచ్చిన్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న కాలంలోనే చిట్‌ఫండ్ వ్యాపారాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ రంగంలో భవిష్యత్తు బాగుంటుందనే అంచనాతో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వ్యాపారంలోకి దిగారు. ఎరువులు, రసాయన పరిశ్రమలో దిగ్గజాలైన ట్రావెన్‌కోర్ లిమిటెడ్, కొచ్చిన్ రిఫైనరీస్ వంటి సంస్థల కాంట్రాక్టులు నిర్వహించేవారు. రవి పిళ్లై వ్యాపార ప్రస్థానం వేగం పుంజుకున్న దశలో అనుకోని అవాంతరం. కార్మికుల నిరవధిక సమ్మెతో ఆయన రోడ్డున పడ్డారు. కొంత దిగులు చెందినా, త్వరలోనే తేరుకున్నారు. ఏదైనా సాధించాలనే తపనతో 1978లో సౌదీ అరేబియాలో అడుగుపెట్టారు.
 
 భారతీయ కార్మికశక్తి...ఆయన ఆస్తి
 సౌదీలో రవి పిళ్లై తొలుత చిన్నా చితక వ్యాపారాలు చేశారు. రెండేళ్ల తర్వాత నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. అల్ హజ్రీ అనే వ్యాపారితో కలిసి 120 మంది కార్మికులతో నసీర్ అలీ హజ్రీ కార్పొరేషన్‌ను స్థాపించారు. కంపెనీకి కావలసిన కార్మికులను రవి తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి తీసుకెళ్లారు. 1983 కల్లా వ్యాపారం గాడిలోపడింది.  ఫ్రెంచ్ కంపెనీ నుంచి విమానాల అండర్ గ్రై ండ్ పార్కింగ్ ప్రాజెక్ట్‌ను సబ్ కాంట్రాక్ట్‌కు తీసుకోని విజయం సాధించటంతో  రవి పేరు అక్కడి వ్యాపార వర్గాల్లో మార్మోగింది. అదే సమయంలో గల్ఫ్ ప్రభుత్వాలు పారిశ్రామికీకరణ వేగం పెంచటం రవికి కలిసొచ్చింది. అప్పట్లో అక్కడ కొరియన్ కంపెనీలదే హవా. ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్‌ప్లాంట్లు నిర్మాణం భారతీయుల వల్ల కాని పని అనేవారు.
 
 రవి మాత్రం అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ తన తెలివితేటలతో అందిపుచ్చుకున్న ప్రతి ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఒప్పందానికన్నా తక్కువ ఖర్చులో నాణ్యతలో రాజీ పడకుండా పని పూర్తి చేయటం ఆయన ప్రతిష్టను పెంచింది. దీనికోసం భారతీయ కార్మికుల శ్రమ శక్తి, నైపుణ్యాలను సమర్థంగా వాడుకొని విజయబావుటా ఎగురవేశారు. ప్రస్తుతం ఆర్పీ గ్రూప్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 70 వేలయితే అందులో 50 వేల మంది భారతీయులే. వారి యోగక్షేమాల పట్ల ఆయనకు అపారమైన శ్రద్ధ. కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ప్రతినెలా ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అంతేకాదు, ఆర్పీ గ్రూప్‌లో కార్మికుల కోసం 24 గంటలూ నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచుతారు.
 
 దుబాయ్‌లో స్థిరాస్థి వ్యాపారం...
 నసీర్ అల్‌హజ్రీ కార్పొరేషన్ అనతి కాలంలోనే రవి హస్తగతమై, ఆర్పీగ్రూప్‌గా మారింది. పిళై ్ల 60వ పడిలోకి ప్రవేశించినా తన ప్రయాణానికి విరామం ఇవ్వలేదు. 2006 నాటికి ఆర్పీ గ్రూప్‌ను అనేక వ్యాపారాలకు విస్తరించింది. ఆయన ఆస్తుల విలువ రూ.18 వేల కోట్లకుపైనే. ఫోర్బ్స్ భారత సంపన్నుల్లో 38వస్థానంలో నిలిచారు. విద్య, ఆతిథ్య, సిమెంట్, స్టీల్, ఆయిల్, గ్యాస్, పర్యాటకం పరిశ్రమల్లోను అడుగుపెట్టారు. ఖతార్, బహ్రెయిన్, ఇండియా, ఆఫ్రికా దేశాలకు వ్యాపారాన్ని విస్తరించారు. స్వరాష్ట్రం కేరళలో ఆతిథ్య, వైద్య వ్యాపారాల్లో  రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు.
 
 సేవా కార్యక్రమాలు...
 పిళ్లైని ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. సేవారంగంపై మక్కువతో ఆయన ఆర్పీ ఫౌండేషన్ స్థాపించి విద్యా, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృద్ధాశ్రమాలు, శిశుసంరక్షణ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టిటళ్లు నిర్వహిస్తున్నారు. పేదలకు సామూహిక వివాహాలు జరిపించి. ప్రతి జంటకు రూ. 1.5 లక్షలు ఇస్తారు. దంపతులు నిరుద్యోగులయితే తమ గ్రూప్‌లోనే వారి అర్హతకు తగిన ఉద్యోగం ఇస్తున్నారు.
 - దండేల కృష్ణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement