మూడుకోట్ల జనం పేరు | Tanguturi prakasam pantulu special | Sakshi
Sakshi News home page

మూడుకోట్ల జనం పేరు

Published Sun, Aug 19 2018 12:34 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

Tanguturi prakasam pantulu special - Sakshi

ఆయన గుండెల మీద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడింది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ ప్రయత్నమే చేసింది. అయినా నమ్మినదే చేశారాయన. కుమిలిపోలేదు. విశ్వసించినదానినే గౌరవించారు. వైరాగ్యాన్ని దరి చేరనీయలేదు. తుది పైసా కూడా జాతి స్వేచ్ఛ కోసం అర్పించారు. తన కడుపులో పేగులు ఆకలితో గాండ్రిస్తున్నా వినిపించుకోకుండా, ప్రజల క్షుద్బాధనే పట్టించుకున్నారాయన. అందుకు, ఆయన ‘ఆంధ్రకేసరి’. కానీ, ఆయన అణువణువూ సింహమే, అన్నారు రాజాజీ. ఆయన ఏం చేసినా ఆంధ్రుల అభ్యుదయం కోసమే అన్నారు జవహర్‌లాల్‌. నిజమే, చరిత్రలో ఎక్కడో గాని తారసపడని ఓ కచ్చితమైన ప్రజల మనిషి. ఆయన– టంగుటూరి ప్రకాశంపంతులు.  ఆంధ్రకేసరి జీవిత చరిత్ర మీద సింహావలోకనం చేసినా రోమాంచితం చేసే ఘట్టాలు కనిపిస్తాయి, అడుగడుగునా. ప్రకాశం (ఆగస్టు 23, 1872 – మే 20, 1957) చరిత్ర అంటే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రే అనకపోవచ్చు. టంగుటూరి ఉద్యమం అంటే ఆంధ్రుల ఉద్యమ చరిత్ర అని కూడా అనకపోవచ్చు. కానీ ప్రకాశం అంటే... దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టు ‘మూడుకోట్ల జనం పేరు’. అంటే నాటి ముక్కోటి ఆంధ్రుల హృదయ స్పందన.  ఒంగోలు సమీపంలోని కనపర్తి అనే గ్రామంలో మేనమామల ఇంట ప్రకాశం పుట్టారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మగారు. పూర్వీకులది టంగుటూరు. తరువాత ప్రకాశం గారి తాతగారు వల్లూరు వచ్చేశారు. కాబట్టి మాది వల్లూరే అని ప్రకాశం గారు రాసుకున్నారు. అద్దంకి, వినోదరాయుడిపాలెం, నాయుడుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరాలలో ప్రకాశం బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య కూడా ఆ ప్రాంతాలలోనే జరిగింది. 

ప్రకాశం గారి జీవితంలో ఒంగోలు ప్రయాణం, అక్కడ నుంచి గోదావరి గట్టున రాజమహేంద్రవరానికి చేరుకోవడం ఆకస్మికంగా, నాటకీయంగా జరిగాయి. అవే ప్రకాశాన్ని తీర్చిదిద్దాయి. 1884లో గోపాలకృష్ణయ్య హఠాత్తుగా కన్నుమూశారు. దీనితో సుబ్బమ్మగారు ఒంగోలు చేరుకుని చిన్న భోజనశాలను ఏర్పాటు చేసింది. గోపాలకృష్ణయ్య మరణించేనాటికి సుబ్బమ్మగారు గర్భిణి. తండ్రి పోయిన తరువాత ఈ భూమ్మీద పడినవాడే జానకిరామయ్య. ప్రకాశం తమ్ముడు. ఆ నాలుగు మాసాల పురిటికందుతోనే, పచ్చి బాలింతగానే ఆమె ఒంగోలు వచ్చి దారుణమైన శ్రమకోర్చి ఆ చిన్న భోజనశాల నిర్వహించారు.అప్పటికి ప్రకాశం వయసు పన్నెండేళ్లు. ఒంగోలు పాఠశాలలో ఆనాటి ప్రధానోపాధ్యాయుడు బాగా చదివే పిల్లలను ఇంటికి రప్పించుకుని మరీ చదువు చెప్పేవారు. అలాంటి అవకాశం ప్రకాశంగారికి కూడా దక్కింది. అలా అని ప్రకాశం బుద్ధిమంతుడైన విద్యార్థి మాత్రం కాదు. ఒకవైపు పోకిరి పిల్లలతో కలసి అల్లరి. ఇంకోవైపు నాటకాలు. చిలిపి అల్లరి కాస్తా నేరాల స్థాయికి పోకుండా తనను కాపాడినవి నాటకాలేనని ప్రకాశంగారు భావించారు. నాటక పరిచయం ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ప్రకాశం నిజ జీవితంలోకి ఒక గొప్ప పాత్రను ప్రవేశపెట్టింది రంగస్థలం. ఆయన మిడిల్‌ స్కూల్‌లో లెక్కల మాస్టారు.ఇంగ్లిష్, ఇంగ్లిష్‌ గ్రామర్‌ కూడా బాగా చెప్పేవారని ప్రతీతి. పేరు ఇమ్మానేని హనుమంతరావునాయుడు గారు. రాజమహేంద్రవరంలో మరో అంకం సాగడానికి కారకుడు కూడా నాయుడుగారే. నాయుడుగారు ముప్పయ్‌ రూపాయల జీతంతో పనిచేసే బతకలేని బడిపంతులే. ఆయనా, ప్రకాశం ఏ క్షణంలో కలుసుకున్నారో గాని, మానవ సంబంధాలలోనే అదొక మంచి ముహూర్తంగా చెప్పాలి. ఆయన శిష్యరికంలోనే ప్రకాశం మిడిల్‌ స్కూల్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కానీ ఆ పరీక్షకు మూడు రూపాయల రుసుము చెల్లించాలి. ఇందుకోసం ఒంగోలుకి పాతికమైళ్ల దూరంలో ఉన్న బావగారింటికి నడిచి వెళ్లారు ప్రకాశం. కానీ బావ కూడా డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. చివరికి సుబ్బమ్మగారే తన పట్టుబట్టను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కొడుక్కి ఇచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక కొత్త సమస్య వచ్చింది. మిడిల్‌ స్కూల్‌ పరీక్ష ఉత్తీర్ణత మెట్రిక్‌తో సమానం. అందుకే, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది. అలా సుబ్బమ్మగారిని భోజనశాల పని నుంచి తప్పించాలన్నదే వారందరి కోరిక. కానీ ప్రకాశం జీవితాశయం న్యాయవాది కావడం. అదే చెప్పారు. ఆ తల్లి కూడా అందుకే మొగ్గారు. చదువు కొనసాగింది.

ఆ సమయంలోనే హనుమంతరావునాయుడు తన భార్య కోరిన మీదట రాజమండ్రి యాత్రకు బయలుదేరారు. వారి వెంటే ప్రకాశం రాజమండ్రి వెళ్లారు. ఒంగోలు నుంచి బెజవాడ. అక్కడ నుంచి విజ్జేశ్వరానికి ఎడ్ల బండి. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవర పట్టణ ప్రవేశం. మొత్తం పదిరోజులు.  అనుకోకుండా నాయుడుగారు, ప్రకాశం గారు కూడా అక్కడ పాఠశాలలోనే చేరారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారితో పరిచయం ఆ గోదావరి తీరంలోనే జరిగింది. గయోపాఖ్యానం, పారిజాతాపహరణ నాటకాలు నాయుడుగారు, ప్రకాశం గారి కోసమే చిలకమర్తి రాశారు. గయోపాఖ్యానంలో గయుని పాత్ర నాయుడుగారిది.గయుని భార్యగా ప్రకాశం నటించారు. కానీ నాటకాలతో ప్రకాశం చదువుకు మంగళం పాడకుండా అందుకయ్యే ఖర్చంతా నాయుడుగారే భరించేవారు. మెట్రిక్యులేషన్‌ ఇక్కడే పూర్తి చేశారు.అప్పుడే రాజమండ్రి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో చిన్న గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ప్రకాశం. జీతం నెలకి పద్నాలుగు రూపాయలు. అంత చిన్న వయసులోనే ప్రకాశం గారి తల వంచని తత్వం ఎంతటిదో బయటపడింది.  ఆ చిన్న కొలువుకీ అర్హత పరీక్ష అన్నారు. మెట్రిక్యులేషన్‌ సర్టిఫికెట్‌ ఉండగా మళ్లీ పరీక్ష ఏమిటి, ఈ ఉద్యోగం నాకు అక్కరలేదంటూ ప్రకాశం ఆ ఆఫీసుకి ఉత్తరం రాసి పడేశారు.అందుకే కాబోలు నాయుడుగారు ప్రకాశం గారిని రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో ఎఫ్‌ఎలో చేర్పించారు. నాటక ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రౌడీ గ్యాంగ్‌లతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆయన తొడగొట్టి అవతలి వాళ్లని చావగొట్టిన సంఘటనలు, వాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్న దుర్ఘటనలు కూడా జరిగిపోతున్నాయి. తన కంటూ ఒక గుంపును నిలబెట్టుకునే పనిలో బెస్తవాడలకి వెళ్లడం, వాళ్లు కల్లు తాగుతూ ఉంటే పక్కనే నిలబడడం వంటివి కూడా జరిగాయి. అవన్నీ ఎలా ఉన్నా తన ఆశయం – న్యాయవాది కావడం– గురించి ప్రకాశం మరచిపోలేదు. మద్రాస్‌ వెళ్లారు అందుకు. ఇదొక కొత్త అంకం. దీనికి తెర లేపిన వారు కూడా నాయుడుగారే. కొణితివాడ జమిందారు దగ్గర 90 రూపాయలు అప్పు చేసి శిష్యుడికి ఇచ్చారాయన. 1894 సంవత్సరంలో ప్రకాశం గారు రాజమండ్రి తిరిగి వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. మంచి పేరొచ్చింది. ఆ వెనుకే  డబ్బు కూడా ఉరుకుతూ వచ్చింది. 1901లో రాజమండ్రి మున్సిపల్‌ చైర్మన్‌ కూడా అయ్యారాయన. కానీ మళ్లీ కొత్త కోరిక. చిన్న కోర్టులలో కాదు, పెద్ద కోర్టులలో, పెద్ద పెద్ద కేసులు వాదించాలి. అందుకు బారెట్లా అవ్వాలి. చాలా ప్రతిఘటనల మధ్య ఇంగ్లండ్‌ వెళ్లారు ప్రకాశం. 

లండన్‌ జీవితం, బారెట్లా చదువు ప్రకాశం గారికి ఒక కొత్త ఉషోదయాన్ని చూపించాయి. అంతవరకు ఆయన జీవిత గమనంలో కానరాని కొత్త కోణమది. ఈ పురాతన దేశం తనకు పడిన సంకెళ్ల బరువు, అవి తెచ్చిపెట్టిన న్యూనత ఎంత హీనమో, ఎంత అమానుషమో ఎలుగెత్తి ఘోషిçస్తున్న క్షణాలవి. జాతిలోని ఆ ఆక్రోశానికి పోరాట రూపం ఇస్తున్న స్వాతంత్య్రోద్యమ రూపశిల్పులతో యువ ప్రకాశానికి పరిచయం కలిగింది, అక్కడే.›అప్పుడే దాదాభాయ్‌ నౌరోజీ బ్రిటిష్‌ పార్లమెంట్‌కి పోటీ చేశారు. ప్రకాశం కూడా ప్రచారంలోకి దిగారు. ఇండియా సొసైటీతో పరిచయం ఏర్పడింది. భారత స్వాతంత్య్రోద్యమానికి విదేశాల నుంచి సాయం చేయడం, ఒక తరహా పోరాటాన్ని సమన్వయం చేయడం ఈ సొసైటీ ఉద్దేశం. అదే ‘ఇండియా’ పత్రికను కూడా వెలువరించేంది. సొసైటీ తరఫున గోపాలకృష్ణ గోఖలేని పిలిచి ఉపన్యాసం ఇప్పించారు.లాలా లజపతిరాయ్‌ని కూడా ప్రకాశం అక్కడే కలుసుకున్నారు. అందుకు వేదిక అయినది – శ్యాంజీ కృష్ణవర్మ నివాసం. ఈయన గదర్‌ వీరుడు. రమేశ్‌చంద్ర దత్తు, ఉమేశ్‌ చంద్ర బెనర్జీలు కూడా ప్రకాశం గారికి అక్కడే పరిచయమయ్యారు.

 బారెట్లా పూర్తి చేసిన తరువాత ఆయన మద్రాస్‌ హైకోర్టులో చేరారు. అక్కడ వద్దని ఎందరో నిరుత్సాహపరిచినా లెక్కచేయలేదు. పని చేసే చోటుతో కాదు, ఆ పని పట్ల  ఉండే విశ్వాసం, అసలు మనిషికి ఉండవలసిన ఆత్మ విశ్వాసం విజయానికి సోపానాలవుతాయని ప్రకాశం భావించారు. అదే నిరూపించారు కూడా. న్యాయవాదిగా ఆయన ఎన్నోసార్లు న్యాయమూర్తులతో సంఘర్షణకు దిగారు. న్యాయమూర్తుల అవాంఛనీయ ధోరణులను విమర్శించడానికి ఆయన ‘లా టైమ్స్‌’ అన్న పత్రికను కూడా వెలువరించారు. భారతదేశంలో చిత్తరంజన్‌దాస్‌కు ఆరోజులలో యువతలో విశేషమైన ఆకర్షణ ఉండేది. ప్రకాశం కూడా ఆయనను ఎంతో అభిమానించారు. దగ్గరయ్యారు. ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. ఒకసారి ఒక లక్షాధికారి కేసు కోసం బొంబాయి వెళ్లినప్పుడు పూనా కూడా Ðð ళ్లి బాలగంగాధర తిలక్‌ను ‘దర్శించుకుని’ వచ్చారు. అప్పుడే గోపాలకృష్ణ గోఖలే అతివాదిగా పేరొందిన తిలక్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయినా గోఖలే పట్ల తిలక్‌ చూపుతున్న మర్యాద ప్రకాశాన్ని పరవశుడిని చేసింది. అందుకు గోఖలే స్పందన ఏవగింపు కలిగించింది. తన జీవితంలో అన్నీ ఆకస్మిక ఘటనలే అని రాసుకున్నారు ప్రకాశం. 1907లో బిపిన్‌ చంద్రపాల్‌ మద్రాస్‌ వచ్చారు. తెలుగునాట కాకినాడ మొదలుకొని మద్రాసు వరకు ఆయన సాగించిన ప్రయాణం జాతీయవాద జైత్రయాత్రగా మారిపోయింది.  మెరీనా బీచ్‌లో ఆయన సభకు అధ్యక్షత వహించడానికి అంతా భయపడుతున్న సమయంలో అప్పుడే ప్రాక్టీస్‌ ప్రారంభించిన ప్రకాశం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కడు సాహసంతో ముందుకు వచ్చారు. తరువాత హోంరూల్‌ ఉద్యమంలో అనిబిసెంట్‌ వెంట నడిచారు. 1917 నాటి కలకత్తా సభలకు గాంధీతో పాటు ప్రకాశం కూడా పాల్గొన్నారు. అప్పటికి ఆయన ఏ మాత్రం వక్త కాదని తేల్చారు ప్రకాశం. కానీ జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన కార్యక్రమాలను ప్రచురించడానికి హిందూతో సహా పత్రికలన్నీ సహకరించలేకపోయేవి. అందుకే 1921లో ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించారు. 

1927లో సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు జరిగిన ఘట్టం ప్రకాశం అంటే ఏమిటో భారతదేశానికి తెలిసే అవకాశం ఇచ్చింది. మద్రాస్‌ నగరంలోని పారిస్‌ కార్నర్‌ దగ్గర సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమకారుల మీద కాల్పులు జరిగాయి. ఒక భారీకాయుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. అప్పుడే ప్రకాశం తెగించి ముందుకు వెళ్లారు. ‘మీరు బలవంతంగా వెళ్లదలిస్తే మేం కాల్చవలసి వస్తుంది’ అన్నాడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌. అయితే అక్కడి గుంపులో ఉన్న ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి, ‘ధైర్యం ఉంటే కాల్చు,  మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం.ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది.’ అన్నాడు. అక్కడితో ఆ ఆఫీసర్‌ జులం తగ్గింది. ప్రకాశం ఆ యోధుడి భౌతికకాయాన్ని చూసి, సమీపంలోనే ఉన్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ చీఫ్‌ మేజిస్ట్రేట్‌ను చూడ్డానికి వెళ్లారు. తరువాత గాంధీ పిలుపుననుసరించి (చాలా విషయాల్లో ఆయనతో విభేదించినా) లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ప్రకాశం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.అంతకు ముందే సెంట్రల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కి ఎన్నికయ్యారు. ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యారు. మద్రాస్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ మత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయనే. కానీ అప్పటికే ఆయన తాను ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్య్రం నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న రీతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిద్య్రాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చినిగిన దుస్తుల్లో, చిల్లులు పడ్డ శాలువతో, తిండిలేక డస్సిపోయిన ముఖంతో విజయవాడ వీధులలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఆ దృశ్యాలను ఎప్పటికి మరచిపోలేకపోయారు.

తల్లి సుబ్బమ్మగారు అంతిమక్షణాలలో కొడుకును పిలిచింది. ఒక చిన్న మూటను అప్పగించింది. ఎనిమిది వందల రూపాయలున్నాయి అందులో. ఆమె కష్టార్జితం. ‘తన అంత్యక్రియలకి’ అని చెప్పారావిడ. కన్నతల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా నాకు మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారాయన.   అయినా, దేశమాత రుణాన్ని ప్రకాశం గారు తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం.    
- డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement