టారో : 10 సెప్టెంబర్ నుంచి 16 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడమన్నదే మీ ఉన్నతికి అడ్డుపడుతున్నదని గ్రహించండి. ప్రతికూల ఆలోచనలను పూర్తిగా దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. చెడు వ్యసనాలకు దూరం అయ్యేందుకు ఇదే సరైన సమయం. చేసే పని మీద శ్రద్ధ పెడితే విజయం మీవైపే ఉంటుంది. ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
కలిసివచ్చే రంగు : బూడిద
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
కొత్తగా మొదలుపెట్టిన మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసమే మీ పెట్టుబడి అని నమ్మండి. వృత్తి రీత్యా పెద్ద పదవిని అలంకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పదవిని ధైర్యంగా స్వీకరించి మీదైన ముద్ర వేయండి. కొన్ని ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. సవాళ్లకు భయపడకుండా వాటిని ఎదుర్కొండి.
కలిసివచ్చే రంగు : నీలం
మిథునం (మే 21 – జూన్ 20)
కొద్దికాలంగా అభద్రతతో కష్టంగా జీవితం వెళ్లదీస్తున్న మీకు ఇకపై వచ్చేదంతా మంచి కాలమే! మీ శక్తులేంటో, మీరు చేయగలిగింది ఏంటో సమీక్షించుకోండి. స్థిమితమైన ఆలోచనలు వచ్చేవరకూ ఏ కొత్త నిర్ణయాన్నీ తీసుకోకండి. ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ముందు భయాలన్నింటినీ దూరం చేసుకోండి. మీరు ప్రేమించిన వ్యక్తి మీకు మరింత దగ్గరవుతారు. వారి రాకతో మీ జీవితం కొత్త వెలుగులు నింపుకుంటుంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
మీ జీవితాన్ని మలుపు తిప్పే విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విజయం మీకు త్వరలోనే వస్తుంది. నిరాశ చెందకుండా పనిచేస్తూ ఉండండి. మీ నమ్మకమే మీకు ఆయుధం. వృత్తిరీత్యా కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. అది మీ మంచికే అని నమ్మండి. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పట్నుంచో కారు కొనాలని భావిస్తున్నట్లైతే వెంటనే వెళ్లి కొనేయండి. ఇదే సరైన సమయం.
కలిసివచ్చే రంగు : ఎరుపు
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
ప్రేమ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. మీరిప్పుడు ఇదే విషయం గురించే ఆలోచించకపోయినా మీ జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ ఇష్టాలేంటో జాగ్రత్తగా గుర్తించండి. ఎందుకంటే ఆ నిర్ణయం మీ జీవితం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుంది. వృత్తిరీత్యా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పు మీకు మంచే చేస్తుందని విశ్వసించండి.
కలిసివచ్చే రంగు : నారింజ
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
ఇప్పటివరకూ కష్టంగా చేస్తూ వస్తోన్న పనికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఇది. కొన్ని ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఆ అవకాశాలను నిర్లక్ష్యంతో దూరం చేసుకోకండి. మీరు కోల్పోయిన ఉత్సాహమంతా తిరిగి వస్తుంది. అదే ఉత్సాహంతో పనిచేయండి. విజయాన్ని త్వరలోనే ఆస్వాదిస్తారు. పనులన్నీ చకచకా జరిగిపోతాయి.
కలిసివచ్చే రంగు : పసుపు
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
ఏ పనీ సరిగ్గా జరగడం లేదని చింతిస్తూ కూర్చోకండి. ఇదంతా తాత్కాలికమేనని, ముందున్నది అంతా మంచి కాలమే అని నమ్మండి. ఎవరికోసమో, దేన్నో త్యాగం చేస్తూ కూర్చోకుండా మీ ఉన్నతికి తోడ్పడే పనులను మీదైన శైలిలో చేస్తూ వెళ్లండి. అంతా గందరగోళంగా తయారైనట్లు కనిపిస్తే, భయపడిపోకండి. అన్నీ క్రమంగా సర్దుకొని జీవితమంతా సాఫీగా సాగుతుంది.
కలిసివచ్చే రంగు : గులాబి
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
ప్రేమ జీవితంలో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న పరిణామానికి ఇదే సమయం. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో, ఏ పని చేసినా విజయం సాధించగలమన్న ధీమాతో ముందుకు వెళ్లండి. వృత్తి పరంగా మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త పనిలో ఉత్సాహంగా ఉంటారు. మీరు పనిచేసే చోట ఎనిమిది నారింజ పండ్లు ఉంచుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : నారింజ
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
ఒంటరితనాన్ని కొద్దికాలంగా బాగా ఇష్టపడుతూ వస్తున్నారు. జీవితం ఏ వైపు వెళుతుందోనన్న అనుమానం మిమ్మల్ని అలాగే వెంటాడుతుంది. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా చూసుకోండి. కొంత విశ్రాంతి తీసుకోండి. అంతా చక్కబడుతుంది. అనాలోచితంగా ఏ నిర్ణయమూ తీసుకోకండి. ఒత్తిడికి లోనుకాకండి. ఏదైనా విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. మీకు విశ్రాంతి ఎంతో అవసరం.
కలిసివచ్చే రంగు : లేత గోధుమ
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. అనాలోచితంగా తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. మీ అనుభవాన్ని సరిగ్గా వాడుకోండి. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. పరిస్థితుల నుంచి తప్పించుకోకుండా మీదైన శైలిలో ధైర్యంగా ఎదుర్కోండి. ఎక్కువ శ్రమ పడకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లండి.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఏదో చెడు జరగబోతోందని మిమ్మల్ని మీరే నిరుత్సాహపరచుకోకండి. ప్రస్తుతానికి మీరు కోరుకున్నట్లుగా పనులేవీ జరగకున్నా, తాత్కాలికమేనని గ్రహించండి. కొన్ని రోజులు ఓపిక పడితే ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. భయపడకుండా మీ పని మీరు చేస్తూ వెళ్లండి. దీన్నే అలవాటుగా మార్చుకుంటే కోరుకున్నవన్నీ క్రమక్రమంగా జరుగుతాయి.
కలిసివచ్చే రంగు : గులాబి
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఎన్ని అవాంతరాలు ఎదురైనా నమ్మకమే మీ ఆయుధం. ఆ నమ్మకంతోనే పనిచేయండి. ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగం మారాలనో, మీకిష్టమైన రంగం వైపుకు వెళ్లాలనో... ఇలా మీ ఆలోచనల్లో ఏ కొత్త విషయం కోరుకుంటున్నా ఆ వైపు నిస్సంకోచంగా అడుగులు వేయండి. కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.
కలిసివచ్చే రంగు : పసుపు