మూడు వరాలు | Three gifts to god | Sakshi
Sakshi News home page

మూడు వరాలు

Published Sat, Apr 22 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

మూడు వరాలు

మూడు వరాలు

పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య కురూపి. తన పేదరికం కన్నా భార్య కురూపిత్వమే అతన్ని అమితంగా బాధించేది. ఒక రోజు అతను నదికి వెళ్లి స్నానం చేసి, సూర్యనమస్కారాలు చేశాడు. ఆ తర్వాత అక్కడే కూర్చుని సూర్యుని వైపు చూస్తూ నిన్నందరూ లోకబాంధవుడనీ, భక్త సులభుడనీ అంటారు కదా! నాకు మాత్రం వరాలనెందుకు ఇవ్వవు? అంటూ ప్రార్థించాడు.

 అది చూసి జాలిపడ్డ సూర్యుడు ఒక వృద్ధబ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. అతనికి మూడు కొబ్బరికాయలిస్తూ, ‘‘నీకు మూడు వరాలిస్తున్నాను. నీకు ఏది కావలిస్తే అది కోరుకుని కొబ్బరికాయ కొట్టు. వెంటనే అది ఫలిస్తుంది. అలాగని అన్నీ ఒక్కసారే కోరుకోనక్కరలేదు. నీకు కావలసినప్పుడు కోరుకోవచ్చు’’ అని చెప్పాడు.
అతను పరమానందంతో ఆ కొబ్బరికాయలనందుకున్నాడో లేదో, ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు.

అతనికి దూరంగా భార్య నీళ్లబిందెతో కనిపించింది. ఎండపొడ ఆమె మీద పడుతోంది. భార్య మరీ అనాకారిగా కనిపించింది. దాంతో ఇక ఉండబట్టలేక, తన భార్య అతిలోక సుందరిగా మారిపోవాలంటూ, ఒక కొబ్బరికాయ కొట్టాడు. అంతే! ఆమె అద్భుత సౌందర్యరాశిగా మారిపోయింది. సరిగ్గా, అదే సమయంలో రాజుగారు రథం మీద వెళుతూ, ఆమెను చూశాడు. ఇంతటి అందగత్తె తన అంతఃపురంలో ఉంటే బాగుండుననిపించి, ఆమెను చెయ్యి పట్టుకుని రథంలో కూర్చుండబెట్టుకుని, అక్కడినుంచి వేగంగా వెళ్లిపోసాగాడు. అది చూసిన బ్రాహ్మణుడు తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటిలా మారిపోవాలనుకుంటూ, మరో కొబ్బరికాయ కొట్టాడు. రథంలో ఉన్న ఆమె ఎలుగుబంటిగా మారిపోవడంతో రాజుకు మతిపోయింది. కొంపదీసి ఈమె ఏమయినా మంత్రగత్తె ఏమో అనుకుంటూ, రథం మీదినుంచి ఒక్క తోపు తోసేసి, వేగంగా వెళ్లిపోయాడు.

ఆ భల్లూకం బ్రాహ్మణుడి మీదికి రాసాగింది. దాంతో దిక్కుతోచని బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న చివరి కొబ్బరికాయ కూడా కొట్టి, ఆమె తిరిగి ఎప్పటిలా మారిపోవాలని కోరుకున్నాడు. వెంటనే అతని భార్య తిరిగి మామూలుగా కురూపిలా మారిపోయింది. భగవంతుడే కనికరించి, మూడు వరాలనిచ్చినా, ఆ మూడు వరాలూ అతని పాలిట నిష్ఫలంగా మారిపోయాయి. అతను బీదవాడిగా, ఆమె అనాకారిలా మిగిలిపోయారు. ఏమైనా, సద్వినియోగం చేసుకునే నేర్పు మనలో లేనప్పుడు, ఎన్ని వరాలనిచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పడానికి ఇది ఉదాహరణ. అతను తెలివితేటలను, వివేకాన్ని ఉపయోగించి ఉంటే తన జీవితాన్ని మార్చి వేసే వరాలను కోరుకుని ఉండేవాడు. అందుకే మనిషికి విద్య, వివేకం, వివేచన ముఖ్యమని చెప్పారు పెద్దలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement