టీటీడీకి ఎనభై వసంతాలు (1933 - 2013) | Tirumal Piligrim has 80th anniversary | Sakshi
Sakshi News home page

టీటీడీకి ఎనభై వసంతాలు (1933 - 2013)

Published Sun, Oct 6 2013 2:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

టీటీడీకి ఎనభై వసంతాలు (1933 - 2013)

టీటీడీకి ఎనభై వసంతాలు (1933 - 2013)

కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే శ్రీవేంకటేశ్వరుడుగా అవతరించాడు. కోట్లాది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి కరుణా కటాక్షాలను అందుకోవడానికి భక్తులను ఆహ్వానిస్తూ, ఎనభై వసంతాలుగా తన ఘనతను చాటుతోంది తిరుమలక్షేత్రం. 1933లో టీటీడీ ఏర్పడిన నాటి నుండి ఈ ఎనభయ్యేళ్లలో తిరుమల క్షేత్రం ఎన్నో మార్పులను సంతరించు కుంది. వాటిని ఓసారి అవలోకనం చేసుకుందాం...
 
 పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అనీ అనేవారు. పల్లవులు, చోళులు, పాండ్యులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు, తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు తిరుమలేశుని సేవించి, భక్తులకు తమవంతు సేవలు అందించారు. ఇక ఆదిశంకరాచార్యులు, వైష్ణవ భక్తాగ్రేసరుడు రామానుజాచార్యులు, తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, పరమ భక్తుడు పురంధరదాసు, స్వామే సర్వస్వం అని భక్తితో పరితపించిన తరిగొండ వెంగమాంబ వంటి మహనీయులెందరో ఈ క్షేత్ర మహిమను ఇనుమడింపజేశారు.
 
 అభివృద్ధికి పునాదులు ఘాట్ రోడ్లే!
 1944 ఏప్రిల్ 10న ప్రారంభమైన  మొదటి ఘాట్‌రోడ్డు, 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్‌రోడ్డు తిరుమల అభివృద్ధిలో మైలురాళ్లు. మద్రాసు ఉమ్మడి రాష్ర్ట బ్రిటిషు గవర్నర్ సర్ ఆర్థర్ హూప్ నేతృత్వంలో భారతీయ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి ఘాట్‌రోడ్డుకు రూపకల్పన చేశారు. తర్వాత రెండవ ఘాట్‌రోడ్డును కూడా నిర్మించడంతో తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు వేర్వేరుగా వెళ్లే అవకాశం కలిగింది. 1975లో రవాణా బాధ్యతలు ఆర్టీసీ చేతికి వెళ్లాయి. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు 3,200 ట్రిప్పులు సాగిస్తున్నాయి.
 
 నాడు  పది నిమిషాల్లోనే దర్శనం...
 1970కి ముందు భక్తులు పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. ఘాట్ రోడ్డులు వచ్చాక రోజుకు దర్శనానికి వచ్చే సంఖ్య రెండు వేలు అయితే, 2012 వచ్చేసరికి ఆ సంఖ్య  లక్షల్లోకి మారింది. దాంతో దర్శనం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రద్దీని తట్టుకోవడానికి పాత పుష్కరిణి కాంప్లెక్స్ (పీపీసీ) పేరుతో  నాలుగు షెడ్లు నిర్మించారు. 1980 నాటికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆలయానికి దక్షిణ దిశలో సాథూరాం మఠం, పూటకూళ్ల మిట్ట వంటి స్థానిక నివాసాలు తొలగించి, అక్కడే ఉన్న గజేంద్రమోక్షం పుష్కరిణిని పూడ్చివేసి 1983లో మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మాణం పనులు చేపట్టారు. 1985లో 31 కంపార్ట్‌మెంట్లతో భారీ క్యూకాంప్లెక్స్‌ని కట్టారు. దీంతో 20 వేల మంది భక్తులకు అన్ని మౌలిక వసతుల మధ్య స్వామి దర్శనం కోసం నిరీక్షించే సౌకర్యం కలిగింది. మరోవైపు తిరుమలలో సత్రాలు, కాటేజీలు, అద్దె వసతి సముదాయాలను వేగంగా నిర్మించింది టీటీడీ. 1998 నుంచి 2003వ సంవత్సరం మధ్య రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను నిర్మించారు. కానీ ఇప్పుడు ఇవి కూడా చాలటం లేదు.
 
 పది రకాలకుపైగా దర్శనాలు
 2000 సంవత్సరం ముందు వరకు సర్వదర్శనం, రూ.50 టికెట్ల దర్శనం,  ఆర్జిత సేవల దర్శనాలే ఉండేవి. తర్వాత పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా సుదర్శనం కంకణ విధానం, ఆన్‌లైన్ రిజర్వేషన్‌ను రూపొందించారు. దేశ వ్యాప్తంగా ఈ-దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్లు కేటాయించే పద్ధతిని చేపట్టారు. అన్ని తరగతులకు చెందిన భక్తులకు పది రకాలకుపైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది.
 
 శ్రీవారి కునుకూ కుదింపు
 మహంతుల కాలం (1843 నుంచి 1933)లో స్వామి నిదురకు గంటల సమయం ఉండేది. కానీ ఇప్పుడు పదినిమిషాలు కూడా విశ్రాంతి లభించట్లేదు. తప్పని పరిస్థితుల్లో అన్ని కైంకర్యాలనూ కుదించేశారు. 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామి కైంకర్యాలకు వినియోగిస్తూ, 20 గంటలపాటు భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.
 
 ఆదాయంతోపాటే పైబడినవ్యయాలు
 టీటీడీ ఏర్పడినప్పుడు పది లక్షలుగా ఉన్న బడ్జెట్ ప్రస్తుతం రూ.2248 కోట్లకు చేరింది. అప్పట్లో లక్షల్లో ఉన్న ఖర్చు నేడు  రూ.1600 కోట్లు దాటుతోంది. తిరుమల శ్రీవారి పేరుతో మూలనిధి/ పెట్టుబడుల (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) రూపంలో బ్యాంకుల్లో సుమారు రూ. 9 వేల కోట్లు ఉన్నట్టు అంచనా. వీటిపై వడ్డీ రూపంలో వడ్డీకాసులవాడికి ఏడాదికి రూ.555 కోట్ల మేర అందుతోంది. శ్రీవారి స్థిర చరాస్థులు లక్షన్నర కోట్లు పైబడ్డాయి.
 
 సవాళ్లపై టీటీడీ సవారీ
 రోజూ లక్షల్లో వచ్చే భక్తులందరికీ వసతి సౌకర్యాలు, తాగునీటి సరఫరా, భక్తులతోపాటు ఆలయ భద్రత వంటివన్నీ టీటీడీకి భారంగా మారాయి. అడవిని నరికి కాటేజీలు, సత్రాలు నిర్మించకూడ దని, పెరిగిన వాహన కాలుష్యం కారణంగా తిరుమలలో కొత్తగా నిర్మాణాలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 

దాంతో భక్తులందరికీ వసతి కల్పించటం కష్టమవుతోంది. భక్తులతోపాటు ఆలయానికి భద్రత కల్పించటం కూడా టీటీడీకి పెద్ద సవాలే. ఇప్పటికే  నాలుగంచెల భద్రతైపై దృష్టిసారించారు. అధునాతన స్కానర్లు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి భక్తులను అనుమతిస్తున్నారు. పురవీధుల్లోకి ముష్కరులు రాకుండా ఉండేలా ఇనుప కంచె (ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్) నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఆర్మ్‌డ్ కమాండోలు, ఎస్‌పీఎఫ్ కమాండో సిబ్బంది, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, సీసీ కెమెరా  వ్యవస్థలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి సుమారు 100 కోట్లు టీటీడీ ఖర్చుచేస్తోంది.
 
 చైనా టూ తిరుమల
 తిరుమలపుణ్యక్షేత్రంలో కొలువైన స్వామి చిత్ర పటాలను చైనా తయారు చేస్తోంది. వీటితోపాటు అనేక ఉత్పత్తులు మనదేశానికి ఎగుమతి చేస్తోంది. చెక్క బొమ్మలు, ఫైబర్, ప్లాస్టిక్ బొమ్మలు, టోపీలు, మహిళలు వినియోగించే పర్సులు, బ్యాగులు, అలంకరణ ఫ్యాన్సీ వస్తువులు, డిజైన్ గాజులు, కీ చెయిన్లు, కుబేరుని బొమ్మలు, ఫొటోలకు వినియోగించే సింథటిక్ ఫ్రేములు, దేవతల త్రీడీ చిత్రాలు వంటివన్నీ చైనా నుంచి తిరుమలకు దిగుమతి అవుతున్నాయి. అమెరికా, ఈజిప్టు తదితర విదేశాల నుంచి, దేశంలోని ముంబై, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, బెంగళూరు, చెన్నయ్, వారణాశి, కలకత్తా వంటి నగరాల నుంచి కూడా వందలాది రకాల సరుకులు తిరుమలకు చేరుతున్నాయి.  
 
 షికారీలు చేసే దిష్టిబొమ్మలు  విదేశాలకు...
 తిరుమలలో నిత్యం జరిగే వ్యాపార వ్యవహారాల్లో షికారీలది (నక్కల జాతికి చెందిన గిరిజన కుటుంబాలు) ప్రత్యేక పాత్ర. వీరు తయారు చేసే దిష్టిబొమ్మలకు విదేశాల్లో గిరాకీ అధికంగా ఉంది. ఖాళీ  కొబ్బరిచిప్పలు, మారేడు కాయ, శంఖు, పసుపుదారం, నల్లటి  దిష్టిదారం, రాక్షసుని దిిష్టి ప్రతిమతో కూడిన ఈ దిష్టిబొమ్మలను అన్ని పుణ్యక్షేత్రాలు, ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టోకుగా కొనుగోలు చేస్తున్నారు. డిమాండును బట్టి నేపాల్, శ్రీలంక, మలేషియా, మారిషస్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఈ బొమ్మల కొనుగోలులో భక్తులు లక్షలాది రూపాయల నగదు వ్యవహారాలు సాగిస్తున్నారు.
 
 ఊరూరా ధర్మప్రచారం
 తిరుమల ఆలయానికే పరిమితమైన శ్రీవారి కల్యాణోత్సవాలను గ్రామస్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు, ధనిక, పాశ్చాత్య దేశాల్లోని భక్తులు ... ఇలా అన్ని వర్గాల వారిని దగ్గర చేసుకునేందుకు టీటీడీ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘భక్తుల వద్దకే భగవంతుడు’ అంటూ పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో శ్రీవారి వైభవ ప్రాశ స్త్యాన్ని చాటుతోంది. అటవీప్రాంతాల్లోని  గిరిజన లోగిళ్లలో గోవింద కల్యాణాలు, పట్టణ, నగర, ఇతర దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు, ఊరారా ‘భక్తి చైతన్య రథ’ యాత్రల పేరుతో భక్తులకు దర్శన భాగ్యాలు కల్పిస్తోంది. ‘మన గుడి’ పేరుతో సుమారు 50 వేల ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించింది. ‘శుభప్రదం’ పేరుతో యువతలో మానవ వికాసం, నైతిక విలువలతో కూడిన బోధనతో ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. దళితులు, మత్స్యకారులు, గిరిజనలు, తండావాసులకు పూజావిధానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దీనికోసం టీటీడీకి  ఏడాదికి 150 కోట్ల దాకా ఖర్చవుతోంది.
 
 మానవ సేవలో మాధవుడు
 తిరుమలకొండకు వచ్చే ప్రతి భక్తుడికీ ఉచిత అన్నదానం, నిరుపేద రోగుల కోసం ప్రాణదానం, కన్నవారి ఆదరణకు నోచుకోని అనాథ పిల్లల కోసం బాలమందిరం, వృద్ధుల పునరావాసం కోసం కరుణాధామం, చెవిటి చిన్నారుల కోసం శ్రవణం ప్రాజెక్టుల ద్వారా ఆపన్న హస్తం అందిస్తోంది టీటీడీ. అనేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నెలకొల్పి విద్యాదానం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement