పద్యానవనం : లక్ష్యం ఎరుగని పోరు, సదా... వృథా! | we need target in our life | Sakshi
Sakshi News home page

పద్యానవనం : లక్ష్యం ఎరుగని పోరు, సదా... వృథా!

Published Sun, Mar 16 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

పద్యానవనం : లక్ష్యం ఎరుగని పోరు, సదా... వృథా!

పద్యానవనం : లక్ష్యం ఎరుగని పోరు, సదా... వృథా!

 ఏ పరంజ్యోతినో వెల్గి ఈ ప్రపంచ విధిని నెరవేర్చుచున్న దివ్వెలము మనము దీపికా! నిన్ను నన్నొక వాపిముంచు అంధకారము పై దండయాత్ర మనది!
 
 ‘‘జిందగీ హర్ కదమ్ ఏక్ నయా జంగ్ హై......’’ (జీవితపు ప్రతి అడుగూ ఒక కొత్త పోరాటమే!) అన్న హిందీ సినీ గీతం ఎంత నిజమో అనిపిస్తుంది చాలా సార్లు. కానీ, అందరికీ అన్ని వేళలా అలా ఏం కాదు. జీవితమన్నాక వెలుగున్నట్టే చీకటీ ఉంటుంది. చీకటి తొలగినప్పుడల్లా వెలుతురు వస్తూనే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. నిజానికి మనమే శాశ్వతం కాదు. ఈ అశాశ్వతమైన జీవితంలో అలుపెరుగని పోరాటాలు ఎన్నెన్ని చేస్తున్నామో? కొన్ని తెలిసి, మరికొన్ని తెలియక. అందుకే ఎరుక గొప్పదని ఆధ్యాత్మిక చింతనులు ఎప్పుడూ చెబుతుంటారు. ఏది చేసినా ఎరుకతో చేయాలంటారు. ప్రజ్ఞతో జీవించాలనేది అంతరార్ధం.
 
 గతం చెల్లని చెక్కు, భవిష్యత్తు అంకెలు వేయని, సంతకం చేయని ఖాళీ చెక్కు. ఇక మనకున్నది వర్తమానమే! అందుకని, తడుముకుంటూ కూర్చోవడం కాకుండా గతాన్ని అనుభవంగా మలచుకోవాలి. కలలే కనొద్దని కాదు, వెర్రి పగటి కలలు కనడం కాక భవిష్యత్తుపై ఒక నిర్మాణాత్మక దృక్పథంతో ఉండాలి. ఆ రెంటినీ కలబోసి అలా వర్తమానాన్ని చక్కగా చెక్కుకున్నవాడే విజయవంతమైన జీవనశిల్పి. ‘పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అన్న మాట అనేక పోరాటాలకు, విప్లవాలకు, తత్ఫలితంగా సమాజగతి పరివర్తనకు దారితీసిన స్పూర్తి వాక్యం అనటంలో సందేహం లేదు. కానీ, దేని మీద పోరాటం? ఎందుకు పోరాటం? ఏ లక్ష్యంతో సాగించే పోరాటం.... ? ఇవన్నీ తెలిసి చేస్తేనే సదరు పోరాటానికి అర్థం, ఆ పై ఎంతోకొంత ఫలితముంటుంది. ఎవరి చేతిలోనో కీలుబొమ్మలుగా సాగించే పోరాటాలు, అద్దె భావజాలంతో సాగించి-అర్ధాంతంగా ఆపే పోరాటాలు, తాత్కాలిక ప్రయోజనాల్ని ఆశించి విశాల సమాజహితానికి వ్యతిరేకంగా చేసే పోరాటాలు.... ఇలా లెక్కా పత్రం లేకుండా చేసే పోరాటాలన్నీ శ్రమ దండగ. ఇక కొంతమంది, దుర్యోచనతో సాగించే వ్యక్తిగత, వ్యక్తి లక్ష్యంగా సాగించే పోరాటాలూ ఉంటాయి. సుదీర్ఘకాలం పాటు పోరు సాగించి, డబ్బు, శ్రమ, సమయం... అన్నీ హారతికర్పూరంలా హరించుకుపోయిన తర్వాతగానీ తెలిసిరాదు తన పోరాటం వృధా అని. అందుకే, సద్యోచనతో ఉండాలంటారు.
 
 ‘యద్భావం తద్భవతిః’ మనం ఎలా ఆలోచిస్తే ఫలితాలూ అలాగే ఉంటాయి. ఒకోసారి చిన్నగా మొదలయ్యే పోరాటాలు కూడా, విషయ ప్రాధాన్యతను బట్టి  దావానలంలా వ్యాపించి సత్వర ఫలితాలు సాధించి పెడతాయి. కొన్ని పోరాటాలు అంశ బలం, సహేతుకత, జనామోదం లేక రావణకాష్టంలా రగులుతూనే ఉంటాయి. ఎక్కడో అమెరికాలో, ఓ మూలన విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పుకునే ఒక రాజనీతి శాస్త్ర ఆచార్యుడు ‘జెనె షార్ప్’ రాసిన ఓ పుస్తకం ఆధునిక సమాజంలో ఒక విప్లవాన్ని రగిల్చింది. ఈజిప్టు వంటి దేశాల్లో పెల్లుబుకిన స్వేచ్ఛా-స్వాతంత్య్ర భావనలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఊపిరిపోసిందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘డిక్టేటర్‌షిప్ టు డెమాక్రసీ’ అని ఆయన రాసిన అరవై పేజీలు మించని ఈ పుస్తకం ప్రపంచంలోని దాదాపు అన్ని  ప్రధాన భాషల్లోకి తర్జుమా అయి, అంతర్జాలంలో విస్తారంగా వినియోగంలోకి వచ్చి, చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు పురుడు పోసిందంటే... పోరాటాలకు స్పూర్తి ఎక్కడ్నుంచైనా రావచ్చని మరోమారు ధృవపడింది.
 
 ఆదివేదమైన రుగ్వేదం చెప్పినట్టు ‘‘జ్ఞానమనే వెలుగును అన్ని దిశల నుంచీ రానీయా’’లి. అందుకేనేమో,ఇరవయ్యో శతాబ్దిలో వాదవివాదాల జోలికి పోకుండా తనదైన కవిత్వాన్ని పండించిన సాహితీ కృషీవలులలో అగ్రగణ్యుడు బోయి భీమన్న ఈ చిన్న పద్యంలో అనంతార్ధాన్ని ఇమిడ్చారు. జ్యోతి మరో జ్యోతిని వెలిగించడాన్ని నేపధ్యంగా ఉంచి, ఏ పరంజ్యోతితోనో వెలిగిన దివ్వెలం మనం అంటున్నాడు సాటి మానవుడితో.  పైగా, మనం ఊరకే పుట్టలేదు, ప్రపంచ విధిని నెరవేర్చడానికి పుట్టామని గుర్తు చేస్తున్నాడు. చిన్న దీపకలికలమే అయినా మనకో లక్ష్యం ఉందని గుర్తు చేస్తున్నాడు. నిన్నూ, నన్నూ కూడా ముంచేసే అంధకారం మీద మనది ఉమ్మడి దండయాత్ర అని ఉద్భోదిస్తున్నాడు. ఎంత గొప్ప భావన. భావన కన్నా కూడా, ఓ గొప్ప ప్రేరణ. అది ఎటువంటి అంధకారమైనా కావచ్చు! మతఛాందసవాదనల అంధకారమో! కులవివక్షలతో పుట్టిన అంధకారమో! జాతి విధ్వేషాలతో రగిలే అంధకారమో! నిరక్షరాస్యతా అంధకారమో! ఆర్థిక అసమానతల నడుమ కనలే అంధకారమో!  రా, దీపికా మన దండయాత్ర ఈ చీకటి వ్యతిరేకంగా సాగిద్దాం, వెలుగుల వైపు పయనిద్దాం అంటున్నాడు. తమసోమా జ్యోతిర్గమయా!
 - దిలీప్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement