పద్యానవనం: పాములూ, నిచ్చెనలూ!
పచ్చిగ పావులం గదిపి పందెములం దలక్రిందు చేసి యీ
నిచ్చెన లెక్కినా ననుచు నిక్కకు; పక్కకు జూడు మల్లదే!
విచ్చిన నోటితో బుసలు వెట్టెడు ఆ పెనుబాము నోటిలో
జొచ్చిన-చచ్చినట్లు తొలిచోటుకు జఱ్ఱున జారకుందువే?
మంచి జరిగితే అది తమ వల్లేననీ, చెడు జరిగితే మాత్రం ఇతరుల వల్ల అనీ బల్లగుద్ది చెప్పే వారుంటారు. అందుకోసం, వారు తొలి నుంచి పథకం ప్రకారమే వ్యవహరిస్తారు. అంటే, మాంచి ఫ్లాట్ గీస్తారన్న మాట. ఎందుకైనా మంచిదని కాస్త వ్యూహాత్మకంగా నడుచుకుంటూ అవసరానికి మించి నాలుగు ఎక్కువ మాటలు ముందుగానే చెప్పిపెడతారు. అలా చెప్పే మాటలు రెండు రకాలుగానూ ఉంటాయి. ఎటయినా అన్వయించడానికి వీలుగా, గోడమీద పిల్లి వాటంగా అన్నమాట! అంతా జరిగాక, ‘‘చూశారా! నే ముందే చెప్పాను, నాకెందుకో మొదట్నుంచీ తెలుస్తూనే ఉంది, నే గెలుస్తాను, గెలిచి తీరుతానని’’ అంటారు. ‘‘అబ్బో, ఇలా గెలవడానికి నేనెంతగా కష్టపడ్డానో, ఏమేం చేశానో.....!’’ అంటూ పెద్ద చాంతాడంత జాబితా మీ ముందు పెట్టినా ఆశ్చర్యం లేదు. అదే ఓడిపోతేనో? అమాంతం నింద ఇతరులపై వేసేయడమే! ‘‘నే మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాను, నే గెలవడానికి ఇన్నేసి యత్నాలు చేస్తున్నప్పటికీ, వారంతా కలిసి దెబ్బ కొడతారనీ, నన్ను గెలవనీకుండా మాయోపాయం చేస్తారనీ తెలుసు, కడకు అదే జరిగింది’’ అంటూ, నిష్ఠూరాలాడుతారు. ఇదీ, ద్వంద్వ వైఖరి. నిజానికి అవే కారణాలు కావచ్చు, కాకా పోవచ్చు. జరిగిన పరిణామాల్లో తమ పాత్ర ఉన్నట్టో, లేనట్టో ఆపాదించేందుకు చేసే అనవసర ప్రయాస వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది.
మన ఎన్నికల తర్వాత ఫలితాలు చూసి గర్వించే-గర్హించే వారి స్పందనలు కూడా, అచ్చు ఇలానే ఉంటాయి. అందుకే గీతాకారుడైన కృష్ణుడు చెబుతాడు, ‘గెలుపు నందు ఉప్పొంగక, ఓటముల యందు కృంగిపోక... గెలుపోటముల యందు సమస్థితి కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు’ అని. అంత బరువైన డైలాగుల సంగతెలా ఉన్నా, మనం కొంచెం, వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే ఎదురయ్యే ఇబ్బంది తక్కువ. గెలుపయితే మన వల్ల, ఓటమైతే ఇతరుల వల్ల అనే ముందస్తు భావన లేకుండా, నిజాయితీగా ఆ గెలుపోటములకు గల కారణాల్ని విశ్లేషించగలిగితే, అవసరానికి మించి ఉప్పొంగడమో, అనవసరంగా కృంగిపోవడమో ఉండదు. ఆ సృ్పహ ఉంటే చాలు, ఫలితమేదయినా మనసుకు హాయిగా ఉంటుంది. ఇది, చెప్పినంత తేలికేం కాదు, కానీ, అసాధ్యం కూడా కాదు.
భగవద్గీతలో చెప్పినట్టు, ఫలితమాశించకుండా నిష్కామ కర్మ ఆచరించడం అంటే ఇదేనేమో! అందుకే, ఉమర్ ఖయ్యామ్ చెబుతున్నాడు, వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కి ఎంతో పైకి వచ్చానని నిక్కకు, నీల్గకు, నిగ్రహంతో ఉండూ అని. అది నీ ప్రతిభ వల్లా జరిగి ఉండవచ్చు, లేదా ఇంకోలా ఫక్తు యాదృచ్ఛికమైందీ కావచ్చు. నిజానికి ఈ పచ్చీసు ఆటలో ప్రతిభ కన్నా, అదృష్టంపై ఆధారపడి జరిగేదే ఎక్కువ. అదే ఆట క్రమంలో, అంతే యాదృచ్ఛికంగా ఏ పాము నోటనో పడితే.... మళ్లీ కిందకు దిగి రాక తప్పదు! నీ ప్రతిభాపాటవాలతో నిమిత్తం లేకుండానే అలా జరగొచ్చు! అదీ అట్టడుగున, ఆట ఆరంభించిన తొలి గడిలోకయినా జారవచ్చు! అలా జరిగినందుకు మనమే కారణమని చింతిస్తూ అక్కడే కూర్చుంటే ముందుకు సాగడం కూడా కష్టమౌతుంది. ఆటల్లోనూ, జీవితంలోనూ గెలుపోటములు శీతోష్ణములు. ఒకటి వెనుక ఒకటి.
అమెరికా దివంగత నేత అబ్రహాం లింకన్, తన తనయుడికి చదువు చెప్పే ఉపాధ్యాయుడికి రాసిన లేఖలో ఇదే విషయం చెబుతాడు, ‘...గెలుపే కాదు, ఓటమిని జీర్ణించుకోవడమెలాగో నేర్పండి నా కుమారునికి’. మన పాత్ర-ప్రమేయం ఉన్నా లేకున్నా ఓటమి ఎదురయినా, అయితే అవనిగాక! అది ఒక ఆటలోనే కాదు మరెక్కడయినా! ప్రతి ఓటమి, తదుపరి విజయానికి గుణపాఠం కావాలి. కనీసం ఓ చక్కని అనుభవమైనా కావాలి. ఆట మాత్రమే కాదు, జీవితం కూడా ఇంతే అన్న సారాన్ని దట్టించాడీ పద్యంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలతి అలతి పదాలతో అనంతార్థాన్ని విడమర్చే ఆయన సామర్థ్యానికి మచ్ఛుతునక ‘అమర్ ఖయామ్’ లోని ఈ పద్యం.
- దిలీప్‌రెడ్డి