padyanavanam
-
పోతన పోతబోసిన పద్యచిత్రమిదిగో!
అహములు సన్నములయ్యె దహనము హితమయ్యే దీర్ఘదశలయ్యె నిశల్, బహు శీతోపేతంబై ‘యుహు హుహు’ అని వడకె లోకముర్వీనాథా! పద్యానవనం మల్టీ మీడియా లేని రోజుల్లోనూ భావ వ్యక్తీకరణకు భాషను అద్భుత సాధనంగా వాడుకున్నారు ఒకప్పటి కవులు. అది కూడా, చంధోబద్దమైన పద్య రూపంలో అరమరికలు లేకుండా అటువంటి వ్యక్తీకరణ జరపడం విశేషం. తెలుగు భాషపై వారి సాధికారతకదొక చిహ్నం. భాషను ఉపకరణంగా వాడిని కవులంతా అంతటి ప్రతిభావంతులని చెప్పలేమేమో కాని, కొందరు మాత్రం భాషతో ఆడుకున్నారంటే అతిశయోక్తి కాదు. చంధస్సు, వ్యాకరణ నియమాలేవీ వారి వ్యక్తీకరణకు ప్రతిబంధకాలు కాలేదు. ఒక సన్నివేశాన్ని, ఓ సందర్భాన్ని, ఓ పరిస్థితిని యథాతథంగా కళ్లకు కట్టినట్టు వివరించడంలో దిట్ట బమ్మెర పోతన. అది కూడా అలతి అలతి పదాలతో, అతి తక్కువ మాటల్లో ఎంతో భావాన్ని నింపి పద్య విన్యాసం చేయించగలిగారాయన. శబ్ద పరంగా, అర్థపరంగా భాషపై సాధికారతే కాకుండా భావంపైన పూర్తి నియంత్రణ సాధించిన మహాకవి పోతన. ‘పలికెడిది భాగవతమట, పలికించెడు విభుడు రామభద్రుండట, పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా?’ అన్న పద్యం నుంచి మొదలెడితే, శ్రీమద్భాగవతంలో ఆయన చెక్కిన అద్భుత పద్యశిల్పాలెన్నో! అయిదు వందల సంవత్సరాల తర్వాత నేటికి కూడా చెవుల్లో రింగుమనే, కంగుమనిపించే, గిలిగింతలు పెట్టే అత్యద్భుత పద్యరత్నాలకు లెక్కేలేదు. భక్తి, ఆధ్యాత్మిక భావనల్ని ప్రేరేపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా! ఆబాలగోపాలాన్నీ రంజింపజేసిన యశోదకృష్ణం, రుక్మిణీకళ్యాణం, గజేంద్రమోక్షం, భక్తప్రహ్లాదం... ఇలా చెప్పుకుంటూ పోతే భాగవతమంతా చెప్పాల్సిందే! అతిశయోక్తులు కూడా అతికినట్టు నిజమని భ్రమ కల్పించేంతటి సహజకవి పోతన. పోతన కావ్య సౌందర్య గొప్పదనాన్ని వర్ణిస్తూ డా.సి.నారాయణరెడ్డి ఒక అతిశయోక్తి చెప్పినా ‘నిజమా!’ అన్న భ్రాంతి కలుగుతుందే తప్ప శంకించబుద్ధికాదు. సినారె రాసిన ‘మందారమకరందాలు’ విమర్శ వ్యాసంలో, పోతనకు ఇంగ్లిష్ వచ్చేమో? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. గజేంద్ర మోక్ష ఘట్టంలో, ఎన్నో జన్మలనుంచి పూజిస్తున్న తాను, కష్టకాలమొచ్చి ఎంత మొరపెట్టుకున్నా విష్ణువు రాకపోతే, ‘లా(ఔఅగి)ఒక్కింతయు లేదు...’ అని గజేంద్రుడు విష్ణుమూర్తిని నిలదీశాడని పోతన రాశాడేమో? అన్న చమత్కార అన్వయం చెప్పారు. ఇప్పుడంటే మల్టీమీడియా వచ్చింది. శబ్దం, దృశ్యం కలగలిసి ఏకకాలంలో వినగలిగి, చూడగలిగే అంటే చూపగలిగే మాద్యమాలొచ్చాయి. అప్పుడు లేవు. ఏం చెప్పినా, ఏం చూపించినా, ఏం వినిపించినా.... అన్నీ అక్షరాల్లోనే, ఆ తాటాకులపైనే! చెప్పదలచుకున్న వాడెవడూ వినదలచుకున్న, చదువదలచుకున్న వాడి దగ్గర అన్ని వేళలా ఉండడు, అదొక అసౌకర్యం. ఒకోసారి అది తరాల అంతరాల వ్యవహారం. దాన్ని అధిగమించడానికి పద్యంలోనే వర్ణచిత్రాల్ని శబ్దాలతో సహా ఆవిష్కరించాలి. పోతన అదే చేశాడు. చలి కాలాన్ని ముచ్చటగా చెప్పాడు. పగటి సమయాలు నిడివి తగ్గి పొట్టిగా అయ్యాయట. రాత్రి సమయాలు సుదీర్ఘంగా సాగాయట. మంట కాచుకోవడం జనాలకి చాలా ప్రీతిపాత్రమయిందట. చలి చాలా తీవ్రమైపోయి లోకమంతా వణుకుతోందట. ఎలా వణుకుతోంది? గజగజమని చెప్పటం సహజం. కానీ ఇక్కడ పోతన, ఓ రాజా, లోకమంతా ‘యుహు హుహు’ అని వణుకుతోందని చెబుతాడు. చలికాలం రాగానే, వయసులతో నిమిత్తం లేకుండా దవడలు కదిలిస్తూ, యుహు హుహు అని శబ్దం చేస్తూ వణకని వారుండరేమో? మనం కొంచెం విశ్లేషిస్తే నాటి కవుల గొప్పదనం తేటతెల్లమవుతుంది. లోతుగా పరిశీలిస్తే మన తెలుగు గొప్పతనమది. తెలుగు భాషామతల్లీ! పది కాలాలు వర్ధిల్లు! - దిలీప్‌రెడ్డి -
తల్లీ ! నీ త్యాగం నేర్పిన పాఠాలు...
పద్యానవనం చీపురు నొక్క చేత, ఒక చేతను చింపిరి గంప బూని, యీ పాపపు గుప్పలూడ్చెదవు బాలిక! చీదర లేదె సుంత? నీ యోపిక చూచి మెచ్చి తలయూచు జగత్పిత కన్నుగొల్కులన్ తేవకు తేవకున్ బయలు దేఱు నవే నులివెచ్చ బాష్పముల్! అసహ్యమని చీదరించుకోకుండా ఓపిగ్గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న పాకీపిల్ల (స్కావెంజర్)ను సంభోదిస్తూ చెబుతున్నాడు కవి! ‘ఎంత ఓపిక తల్లీ! ఓ చేత చీపురు మరో చేత చిరిగిన గంప/బుట్ట ధరించి ఈ భూమ్మీద సాటి మనుషులు వదిలిన మలినాల చెత్త కుప్పలనూడ్చే పనిలో నిమగ్నమయ్యావు’ అని! తర్వాత్తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనిషి విసర్జించే మాలిన్యాల్ని మనుషులు ఎత్తిపోసే పారిశుధ్యపు పనుల్ని అధికారికంగా నిషేధించాయి. యాంత్రిక నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు, భూగర్భమురుగు కాల్వల వ్యవస్థ వంటివి పూర్తిస్థాయిలో తీసుకువచ్చే కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. కానీ, అక్కడక్కడ ఇప్పటికీ ఆ పనిని మనుషులే నిర్వర్తించడం మన వ్యవస్థలో కొనసాగుతున్న దురవస్థ. కడు పేదరికం వల్ల, పొట్టపోసుకునే ఇతర పనులు దొరక్క, వృత్తి ధర్మాన్నే నమ్ముకొని, తరతరాలుగా ఈ పనిలో నిమగ్నమైన వారున్నారు. చీదరించుకోకుండా ఈ మాలిన్యాల్ని తొలగించే పాకీ వృత్తిలో ఉన్నవారి సేవల్ని చూసి, సృష్టికర్తయే చలించిపోతున్నాడనీ, తడవ తడవకు కంటతడి పెడుతున్నాడనీ కవి భావన! కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘ఉదయశ్రీ’లో పాకీపిల్ల శీర్షికన రాసిన ఖండిక లోనిదీ పద్యం. ఈ రోజున ‘స్వచ్ఛ భారత్’ పేరిట స్పృహను రగిల్చే రకరకాల కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఉద్దేశం మంచిదే! పని కన్నా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విచారకరం. ఎవరి పనులు వారు చేసుకోవడాన్నే గొప్పకార్యంగా భావించే పరిస్థితులు దాపురించాయి. మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకునే మనం విశాల సమాజహితంలో జరిపే కార్యక్రమాల విషయంలో ఇంకా ఎంతో పరిణతి సాధించాల్సి ఉంది. ‘స్వచ్ఛభారత్’ను ఆవిష్కరించడానికి ముందు మనం కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పారిశుధ్యం విషయంలో ఎవరి పనులు వారు చేసుకోవడంలోనే గొప్పతనం ఉందని ప్రపంచమంతా గ్రహించింది. ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని తీసుకున్నా, ఆయా దేశాల్లో ఎన్ని అభివృద్ధి చెందిన కుటుంబాల్ని తీసుకున్నా శుభ్రతకు వారిచ్చే ప్రాధాన్యత ఆశ్చర్యం కలిగిస్తుంది. మన సమాజంలో అది లేకపోగా, విధి లేక అటువంటి విధుల్లో ఉన్నవారి పట్ల చిన్న చూపు, తూష్ణీభావం నెలకొని ఉన్నాయి. శ్రమను గౌరవించే సంస్కృతి మన దగ్గర మరుగున పడి, ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో ఆదరణ పొందడాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరు, ఎటునుంచి ఎటు పయనిస్తున్నారో శ్రద్ధగా గ్రహించాలి. అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే మనం పారిశుధ్యం విషయంలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలిస్తే గుండె జారిపోతుంది. పొరుగునున్న అభివృద్ధి చెందని దేశం బంగ్లాదేశ్ కంటే కూడా మనమీ విషయంలో వెనుకబడి ఉన్నామంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నేటికీ పెద్ద సంఖ్యలో కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం లేక బహిర్భూమినే నమ్ముకోవాల్సిన దురవస్థ నెలకొని ఉంది. పట్టణ ప్రాంతాల్లో మరింత దయనీయ స్థితి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు పాలకులు చిత్తశుద్ధితో చేసిన యత్నాలు తక్కువ. ఇప్పటికైనా ఏలినవారు నిర్దిష్ట ప్రణాళికలు రచించి ‘స్వచ్ఛ భారత్’ను ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు, దేశంలోని ప్రతి మనిషి కూడా, మహాత్ముడు బాపూజీ చెప్పినట్టు తానాశించిన మార్పు తన నుంచే మొదలుకావాలనే స్ఫూర్తిని అందుకోవాలి. ‘‘ఒక్క రోజీవు వీథుల నూడ్వకున్న తేలిపోవును మా పట్టణాల సొగసు: బయటపడునమ్మ బాబుల బ్రతుకులెల్ల ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప’’ అన్న కరుణశ్రీ మాటలు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ... ఎవరికి వారం ‘స్వచ్ఛ భారత్’ ఆవిష్కరణలో ఆచరణాత్మక పాత్ర పోషించడమే మనందరి ముందున్న కర్తవ్యం! -
రైతు చెమటకు కన్నీరు తోడై నేల తడపరాదు!
పద్యానవనం నీ జాతివారలు రాజులై యుండియు కనజాలరైరి నీ కష్టమెల్ల నీ కొలమందు జన్మించిన యాజమిం దారులు గనరు నీ తాపమెల్ల నీ శాఖలో ధననిలయులౌ కొందరు పరికింపలేరు నీ బాధలెల్ల నీ తెగలో విద్యనేర్చిన బియ్యేలు లిఖించరైరి నీ లేములెల్ల గీ॥న్యాయవాదులు నీవార లడుగరైరి న్యాయమూర్తులు నీవార లరయరైరి ఇంక పెఱవారి ముచ్చట లెందుకయ్య కర్షకా! నీదు కష్టముల్ గాంతురెవరు? అందరూ నీ వారే అయినా, ఎవరికి పట్టాయి నీ కష్టాలు రైతుబిడ్డా! అంటున్నాడు ఓ కవి. ఇది సుమారు వంద సంవత్సరాల కిందటి మాట! ఈ నూరేళ్లలో పరిస్థితి పెద్దగా మారలేదు సరికదా, రైతు స్థితి మరింత దిగజారింది. దేశానికి రైతే వెన్నెముక అని చెబుతారు తప్ప, రైతును ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రారు. రైతు ఏయే కష్ట-నష్టాల్ని ఎదుర్కొంటున్నాడు? ఏ విపత్కర పరిస్థితులకు ఎదురీదుతున్నాడు? ఏం చేస్తే ఆతని ఈతి బాధలు తగ్గించవచ్చు? ఆహారోత్పత్తికి మూలకణం, గ్రామీణ ఆర్థిక వికాసానికి కేంద్రబిందువైన రైతాంగం దేశంలో, రాష్ట్రంలో పాలకుల ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడో అట్టడుగునే ఉంటారు. దేశానికి అన్నం పెట్టే పనిలో నిమగ్నమై తన బతుకంతా ధారపోసే రైతు కనీస జీవనానికి నోచుకోక కడకు ఆత్మహత్యతో తనువు చాలిస్తున్నాడు. తిండిబెట్టే ఇంటి పెద్దదిక్కును కోల్పోయి, అప్పటిదాకా పరువుగా బతికిన రైతు కుటుంబాలు కకావికలై వీధిన పడుతున్నాయి. దశాబ్దాల తరబడి ఈ దుస్థితి కొనసాగుతున్నా, పరిస్థితిని మార్చే విప్లవాత్మకమైన చర్యలకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో కృషి చేయట్లేదు. ఏ రైతు కష్టాల్ని దగ్గరగా చూస్తున్నారో, ఆయా వర్గాలు కూడా సదరు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని అదుకునే చొరవ చూపడం లేదు. ఇదే మాట చెబుతున్నాడీ పద్యంలో గంగుల శాయిరెడ్డి అనే గ్రామీణ కవి. రైతు కులానికే చెందిన వారు పెద్ద పెద్ద జమిందారులుగా ఉంటారు, అయినా రైతాంగం ఇబ్బందుల్ని వారు పరిగణనలోకే తీసుకోరు. రైతు వర్గీయులే మహా ధనికులై ఉండి కూడా సాటి కర్షకులెదుర్కొనే బాధల్ని లెక్కచేయరు. రైతు కుటుంబాల నుంచే వచ్చి పెద్ద చదువులు చదివిన వారు కూడా రైతుల లోటుపాట్లేంటో తెలుసుకొని పై వారికి రాయరు. నీ వారే అయినా న్యాయవాదులు అడుగరు, నీ వారై కూడా న్యాయమూర్తులు తెలుసుకోరు. అయినవాళ్లే ఇలా ఉంటే, ఇక పరాయివారెలా ఉంటారో మాట్లాడటం అనవసరం. మరి రైతు కష్టాల్ని పట్టించుకునేదెవరు? అన్నది అంతిమంగా కవి ప్రశ్న. బమ్మెర పోతన స్వయంగా రైతు కాగా రైతాంగం శ్రమదమాదుల మీద, కష్టనష్టాల మీద ఎందరెందరో సాహితీ సృజన చేశారు. మంచన, శ్రీనాథుడు, దువ్వూరి రామిరెడ్డి, గుఱ్ఱం జాషువా, కరుణశ్రీ, శ్రీశ్రీ, దాశరథి, కుందుర్తి... ఎందరెందరో తమ కలంలో సిరాతోపాటు రైతు స్వేదాన్నీ మిళితం చేసి కవిత్వం పలికించారు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన ఈ పద్యానికి సేద్యపు స్వేదమే కాకుండా వైవిధ్యపు నేపథ్యమూ ఉంది. ‘నిజాం రాజ్యంలో ఆంధ్ర కవులు పూజ్యం’ అని ముడుంబ వేంకట రాఘవాచార్య చేసిన ప్రకటనకు జవాబుగా వచ్చిన ‘గోలకొండ కవుల సంచిక’లో ‘కర్షకా!’ అన్న శీర్షికన ప్రచురితమైందీ పద్యం. ‘...ఇచటి పరిస్థితులు తెలియక, తెలుసుకొను తగు అవకాశములు లేక వెల్లడించినారు తప్ప ద్వేషబుద్ధిచే కాదనుట నిశ్చయము’ అంటూ గొప్ప సంయమనంతో అప్పటి గోలకొండ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి... నిజాం రాజ్యం పరిధిలోని 354 మంది కవుల కవితలతో ఈ ప్రత్యేక సంచికను వెలువరించారు. అందులోని ఈ పద్యం రైతు చెమటకు ప్రతిరూపం. దీని కవి గంగుల శాయిరెడ్డి అప్పటి నల్గొండ జిల్లా, జన్గాం తాలూకా, జీడికల్లు గ్రామానికి చెందిన నలభై ఏళ్ల రైతుబిడ్డ. మానవజాతి మనుగడకు జీవం పోసే రైతు అకాల మరణాలు ఏ ప్రమాణాలతోనూ క్షంతవ్యం కాదు. కర్షకుని చెమట బిందువులకు కన్నీటి చుక్కలు తోడై నిరంతరం మట్టిని తడుపుతూ ఉండటం ఏ జాతికీ శ్రేయస్కరం కాదు. - దిలీప్‌రెడ్డి -
కాలం కత్తుల వంతెనపై త్యాగాల నడక
పద్యానవనం త్యాగము నిశ్చయముగ నొక యాగంబీ జగతియం దనాదిగ గానన్ త్యాగము కల్గిన జనులకు కాగలవు శుభంబులెల్ల కర్మల నార్యా! ‘కుచ్ పానేకే లియె కుచ్ కోనా జరూరీ!’ అనే మాట హిందీలో ఉంది. ఏదైనా పొందాలంటే, ఇంకేదైనా కోల్పోవాల్సిందే అని. వస్తువుకు మరొక వస్తువే అన్నట్టుగా ఇది వస్తుమార్పిడి విధానం కాకపోవచ్చు! ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక రూపంలో మనం లబ్ది పొందడానికి మరో రూపంలో ఏదైనా త్యజించడమో, త్యాగం చేయాల్సిన పరిస్థితో అన్న మాట! ‘ఎంతో కొంత త్యాగానికి సిద్ధపడకుండా నాయకులు కాలేరు’ అంటారు. కొందరు ఐహిక సుఖాలను త్యజించమంటారు. ఇంకొందరు, కేవలం మిథ్య కనుక ఆముష్మిక సుఖాలపై ఆశను వదిలేయమంటారు. గౌతమ బుద్ధుడు కోర్కెలని త్యజిస్తే జీవితం అనందమయమన్నాడు. నిజమే, ఏదో త్యజించడం త్యాగం. త్యాగం అనేది లోకంలో ఒక యాగమే, అంటే యజ్ఞమే అంటాడు ఈ పద్యం రాసిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. నూరుకు పైగా పుస్తకాలు రాసిన లింగమూర్తి నిరంతర పరిశోధకుడు. తెలుగువిశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించిన ఆయనకు ఇటీవలే వట్టికోట ఆళ్వార్‌స్వామి పురస్కారం లభించింది. తేలికైన మాటలతో జీవన సత్యాల్ని వివరిస్తూ ఆర్యశతకం రాశారు. యజ్ఞంలో త్యాగం అంటే వితరణమే ప్రధానం. ఏదైనా ఇచ్చుకోవడం. వితరణలేని యజ్ఞం ఎంత గొప్పగా చేసినా అది ఫలాన్నివ్వదంటారు. త్యాగం అనే పదం పలికేప్పుడు కాస్త గంభీరంగా కనిపించినా, సౌమ్యంగా ఆలోచించి సరళంగా చూస్తే క్షమాగుణంలో ఉంటుంది. ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న సులభ సమీకరణంలోనూ ఉంటుంది అంతర్లీనంగా. ప్రపంచంలో ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చునంటారు ప్రజాస్వామ్యవాదులు. ఎలా సాధ్యమౌతుంది? అంటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్లే. పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నపుడు ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఒకడుగు వెనక్కి తగ్గి అంగీకారానికి రావడం, అది చూసి అవతలి వాళ్లు కూడా అంతకన్నా ఎక్కువో, అంతేనో, అంతకు తక్కువో... తామూ వెనక్కి తగ్గడం, ఇలా సయోధ్యకు దారి ఏర్పడుతుంది. సమస్యకు పరిష్కారమూ లభిస్తుంది. ఇందులో త్యాగం ఇరువైపుల నుంచీ ఉన్నట్టే! త్యాగాలకు సిద్ధపడ్డవారి కర్మలకు సాఫల్యం ఉంటుంది. ఒకరి త్యాగాల వల్ల ఎదుటి వారికి తక్షణ ప్రయోజనం కనిపించినా, దీర్ఘకాలంలో అది త్యాగం చేసిన వారికిగానీ, విశాల సమాజ హితంలో గానీ కచ్చితమైన ప్రయోజనం కలిగిస్తుందని చరిత్ర నిరూపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు... ఇలా మన ప్రాచీన సాహిత్యమంతా త్యాగనిరతి ఔన్నత్యాన్ని కీర్తించడమే కాకుండా సదరు సత్ఫలితాలను సాపేక్షంగా, సోదాహరణంగా వివరించాయి. శిబి, బలి, దదీచుడు, కర్ణుడు, సోక్రటీస్, జీసస్, గాంధీ వంటి మహనీయుల త్యాగాలు మానవేతిహాస గమనాన్ని ఉద్విగ్నభరితం చేశాయి. మత్స్యగంధితో పెళ్లి జరిపి తండ్రి శంతనుడి ఇచ్ఛ తీర్చడానికి గాంగేయుడు (భీష్ముడు) పలు త్యాగాలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామమే, అంటే త్యాగాలతో కూడిన భీష్మ ప్రతిజ్ఞ, దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులే మహాభారత కథా గమనాన్ని మలుపులు తిప్పాయి. కైకేయి కోర్కెల ఫలితంగా తలెత్తిన పరిస్థితుల్లో దశరథుడు, కౌసల్య, రామ-సీత-లక్ష్మణుల త్యాగాలు రామాయణాన్నే రసవత్తరంగా నడిపాయి. కడకవి దుష్ట శిక్ష-శిష్ఠ రక్షణకు కారణమయ్యాయి. సమసమాజం కోసం, అస్తిత్వం కోసం, జాతుల మనుగడ కోసం... విశాల జనహితం కోరి జరిపే సాయుధపోరాటాల్లో ప్రాణాలర్పించే యోధుల త్యాగాలూ చరిత్ర పుటలే! కాలం కత్తుల వంతెనపై త్యాగాల నెత్తుటి నడకలెన్నో! సామ్రాజ్యవాదుల ఉక్కు సంకెలల నుంచి దేశాలకు విముక్తి లభించినా, వర్ణ-జాత్యాహంకారుల నుంచి విభిన్న జాతులకు స్వేచ్ఛావాయువులు దొరికినా... అది, ప్రాణాల్ని పణంగా పెట్టిన ఎందరెందరి త్యాగాల ఫలమో! పోరాటాలే కాదు క్షమలోనూ ఉంది ఔన్నత్యం. మనిషి లక్షణాల్లో అత్యంత ఉత్కృష్ఠమైనది క్షమాగుణం అంటారు. క్షమాగుణానికి త్యాగమే కన్నతల్లి. ప్రతి త్యాగాన్ని మనసారా ప్రశంసిద్దాం. మరిన్ని త్యాగాలకు మనమూ సిద్ధమౌదాం! - దిలీప్‌రెడ్డి -
పద్యానవనం: పాములూ, నిచ్చెనలూ!
పచ్చిగ పావులం గదిపి పందెములం దలక్రిందు చేసి యీ నిచ్చెన లెక్కినా ననుచు నిక్కకు; పక్కకు జూడు మల్లదే! విచ్చిన నోటితో బుసలు వెట్టెడు ఆ పెనుబాము నోటిలో జొచ్చిన-చచ్చినట్లు తొలిచోటుకు జఱ్ఱున జారకుందువే? మంచి జరిగితే అది తమ వల్లేననీ, చెడు జరిగితే మాత్రం ఇతరుల వల్ల అనీ బల్లగుద్ది చెప్పే వారుంటారు. అందుకోసం, వారు తొలి నుంచి పథకం ప్రకారమే వ్యవహరిస్తారు. అంటే, మాంచి ఫ్లాట్ గీస్తారన్న మాట. ఎందుకైనా మంచిదని కాస్త వ్యూహాత్మకంగా నడుచుకుంటూ అవసరానికి మించి నాలుగు ఎక్కువ మాటలు ముందుగానే చెప్పిపెడతారు. అలా చెప్పే మాటలు రెండు రకాలుగానూ ఉంటాయి. ఎటయినా అన్వయించడానికి వీలుగా, గోడమీద పిల్లి వాటంగా అన్నమాట! అంతా జరిగాక, ‘‘చూశారా! నే ముందే చెప్పాను, నాకెందుకో మొదట్నుంచీ తెలుస్తూనే ఉంది, నే గెలుస్తాను, గెలిచి తీరుతానని’’ అంటారు. ‘‘అబ్బో, ఇలా గెలవడానికి నేనెంతగా కష్టపడ్డానో, ఏమేం చేశానో.....!’’ అంటూ పెద్ద చాంతాడంత జాబితా మీ ముందు పెట్టినా ఆశ్చర్యం లేదు. అదే ఓడిపోతేనో? అమాంతం నింద ఇతరులపై వేసేయడమే! ‘‘నే మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాను, నే గెలవడానికి ఇన్నేసి యత్నాలు చేస్తున్నప్పటికీ, వారంతా కలిసి దెబ్బ కొడతారనీ, నన్ను గెలవనీకుండా మాయోపాయం చేస్తారనీ తెలుసు, కడకు అదే జరిగింది’’ అంటూ, నిష్ఠూరాలాడుతారు. ఇదీ, ద్వంద్వ వైఖరి. నిజానికి అవే కారణాలు కావచ్చు, కాకా పోవచ్చు. జరిగిన పరిణామాల్లో తమ పాత్ర ఉన్నట్టో, లేనట్టో ఆపాదించేందుకు చేసే అనవసర ప్రయాస వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. మన ఎన్నికల తర్వాత ఫలితాలు చూసి గర్వించే-గర్హించే వారి స్పందనలు కూడా, అచ్చు ఇలానే ఉంటాయి. అందుకే గీతాకారుడైన కృష్ణుడు చెబుతాడు, ‘గెలుపు నందు ఉప్పొంగక, ఓటముల యందు కృంగిపోక... గెలుపోటముల యందు సమస్థితి కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు’ అని. అంత బరువైన డైలాగుల సంగతెలా ఉన్నా, మనం కొంచెం, వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే ఎదురయ్యే ఇబ్బంది తక్కువ. గెలుపయితే మన వల్ల, ఓటమైతే ఇతరుల వల్ల అనే ముందస్తు భావన లేకుండా, నిజాయితీగా ఆ గెలుపోటములకు గల కారణాల్ని విశ్లేషించగలిగితే, అవసరానికి మించి ఉప్పొంగడమో, అనవసరంగా కృంగిపోవడమో ఉండదు. ఆ సృ్పహ ఉంటే చాలు, ఫలితమేదయినా మనసుకు హాయిగా ఉంటుంది. ఇది, చెప్పినంత తేలికేం కాదు, కానీ, అసాధ్యం కూడా కాదు. భగవద్గీతలో చెప్పినట్టు, ఫలితమాశించకుండా నిష్కామ కర్మ ఆచరించడం అంటే ఇదేనేమో! అందుకే, ఉమర్ ఖయ్యామ్ చెబుతున్నాడు, వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కి ఎంతో పైకి వచ్చానని నిక్కకు, నీల్గకు, నిగ్రహంతో ఉండూ అని. అది నీ ప్రతిభ వల్లా జరిగి ఉండవచ్చు, లేదా ఇంకోలా ఫక్తు యాదృచ్ఛికమైందీ కావచ్చు. నిజానికి ఈ పచ్చీసు ఆటలో ప్రతిభ కన్నా, అదృష్టంపై ఆధారపడి జరిగేదే ఎక్కువ. అదే ఆట క్రమంలో, అంతే యాదృచ్ఛికంగా ఏ పాము నోటనో పడితే.... మళ్లీ కిందకు దిగి రాక తప్పదు! నీ ప్రతిభాపాటవాలతో నిమిత్తం లేకుండానే అలా జరగొచ్చు! అదీ అట్టడుగున, ఆట ఆరంభించిన తొలి గడిలోకయినా జారవచ్చు! అలా జరిగినందుకు మనమే కారణమని చింతిస్తూ అక్కడే కూర్చుంటే ముందుకు సాగడం కూడా కష్టమౌతుంది. ఆటల్లోనూ, జీవితంలోనూ గెలుపోటములు శీతోష్ణములు. ఒకటి వెనుక ఒకటి. అమెరికా దివంగత నేత అబ్రహాం లింకన్, తన తనయుడికి చదువు చెప్పే ఉపాధ్యాయుడికి రాసిన లేఖలో ఇదే విషయం చెబుతాడు, ‘...గెలుపే కాదు, ఓటమిని జీర్ణించుకోవడమెలాగో నేర్పండి నా కుమారునికి’. మన పాత్ర-ప్రమేయం ఉన్నా లేకున్నా ఓటమి ఎదురయినా, అయితే అవనిగాక! అది ఒక ఆటలోనే కాదు మరెక్కడయినా! ప్రతి ఓటమి, తదుపరి విజయానికి గుణపాఠం కావాలి. కనీసం ఓ చక్కని అనుభవమైనా కావాలి. ఆట మాత్రమే కాదు, జీవితం కూడా ఇంతే అన్న సారాన్ని దట్టించాడీ పద్యంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలతి అలతి పదాలతో అనంతార్థాన్ని విడమర్చే ఆయన సామర్థ్యానికి మచ్ఛుతునక ‘అమర్ ఖయామ్’ లోని ఈ పద్యం. - దిలీప్‌రెడ్డి -
పద్యానవనం : లక్ష్యం ఎరుగని పోరు, సదా... వృథా!
ఏ పరంజ్యోతినో వెల్గి ఈ ప్రపంచ విధిని నెరవేర్చుచున్న దివ్వెలము మనము దీపికా! నిన్ను నన్నొక వాపిముంచు అంధకారము పై దండయాత్ర మనది! ‘‘జిందగీ హర్ కదమ్ ఏక్ నయా జంగ్ హై......’’ (జీవితపు ప్రతి అడుగూ ఒక కొత్త పోరాటమే!) అన్న హిందీ సినీ గీతం ఎంత నిజమో అనిపిస్తుంది చాలా సార్లు. కానీ, అందరికీ అన్ని వేళలా అలా ఏం కాదు. జీవితమన్నాక వెలుగున్నట్టే చీకటీ ఉంటుంది. చీకటి తొలగినప్పుడల్లా వెలుతురు వస్తూనే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. నిజానికి మనమే శాశ్వతం కాదు. ఈ అశాశ్వతమైన జీవితంలో అలుపెరుగని పోరాటాలు ఎన్నెన్ని చేస్తున్నామో? కొన్ని తెలిసి, మరికొన్ని తెలియక. అందుకే ఎరుక గొప్పదని ఆధ్యాత్మిక చింతనులు ఎప్పుడూ చెబుతుంటారు. ఏది చేసినా ఎరుకతో చేయాలంటారు. ప్రజ్ఞతో జీవించాలనేది అంతరార్ధం. గతం చెల్లని చెక్కు, భవిష్యత్తు అంకెలు వేయని, సంతకం చేయని ఖాళీ చెక్కు. ఇక మనకున్నది వర్తమానమే! అందుకని, తడుముకుంటూ కూర్చోవడం కాకుండా గతాన్ని అనుభవంగా మలచుకోవాలి. కలలే కనొద్దని కాదు, వెర్రి పగటి కలలు కనడం కాక భవిష్యత్తుపై ఒక నిర్మాణాత్మక దృక్పథంతో ఉండాలి. ఆ రెంటినీ కలబోసి అలా వర్తమానాన్ని చక్కగా చెక్కుకున్నవాడే విజయవంతమైన జీవనశిల్పి. ‘పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అన్న మాట అనేక పోరాటాలకు, విప్లవాలకు, తత్ఫలితంగా సమాజగతి పరివర్తనకు దారితీసిన స్పూర్తి వాక్యం అనటంలో సందేహం లేదు. కానీ, దేని మీద పోరాటం? ఎందుకు పోరాటం? ఏ లక్ష్యంతో సాగించే పోరాటం.... ? ఇవన్నీ తెలిసి చేస్తేనే సదరు పోరాటానికి అర్థం, ఆ పై ఎంతోకొంత ఫలితముంటుంది. ఎవరి చేతిలోనో కీలుబొమ్మలుగా సాగించే పోరాటాలు, అద్దె భావజాలంతో సాగించి-అర్ధాంతంగా ఆపే పోరాటాలు, తాత్కాలిక ప్రయోజనాల్ని ఆశించి విశాల సమాజహితానికి వ్యతిరేకంగా చేసే పోరాటాలు.... ఇలా లెక్కా పత్రం లేకుండా చేసే పోరాటాలన్నీ శ్రమ దండగ. ఇక కొంతమంది, దుర్యోచనతో సాగించే వ్యక్తిగత, వ్యక్తి లక్ష్యంగా సాగించే పోరాటాలూ ఉంటాయి. సుదీర్ఘకాలం పాటు పోరు సాగించి, డబ్బు, శ్రమ, సమయం... అన్నీ హారతికర్పూరంలా హరించుకుపోయిన తర్వాతగానీ తెలిసిరాదు తన పోరాటం వృధా అని. అందుకే, సద్యోచనతో ఉండాలంటారు. ‘యద్భావం తద్భవతిః’ మనం ఎలా ఆలోచిస్తే ఫలితాలూ అలాగే ఉంటాయి. ఒకోసారి చిన్నగా మొదలయ్యే పోరాటాలు కూడా, విషయ ప్రాధాన్యతను బట్టి దావానలంలా వ్యాపించి సత్వర ఫలితాలు సాధించి పెడతాయి. కొన్ని పోరాటాలు అంశ బలం, సహేతుకత, జనామోదం లేక రావణకాష్టంలా రగులుతూనే ఉంటాయి. ఎక్కడో అమెరికాలో, ఓ మూలన విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పుకునే ఒక రాజనీతి శాస్త్ర ఆచార్యుడు ‘జెనె షార్ప్’ రాసిన ఓ పుస్తకం ఆధునిక సమాజంలో ఒక విప్లవాన్ని రగిల్చింది. ఈజిప్టు వంటి దేశాల్లో పెల్లుబుకిన స్వేచ్ఛా-స్వాతంత్య్ర భావనలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఊపిరిపోసిందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘డిక్టేటర్షిప్ టు డెమాక్రసీ’ అని ఆయన రాసిన అరవై పేజీలు మించని ఈ పుస్తకం ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లోకి తర్జుమా అయి, అంతర్జాలంలో విస్తారంగా వినియోగంలోకి వచ్చి, చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు పురుడు పోసిందంటే... పోరాటాలకు స్పూర్తి ఎక్కడ్నుంచైనా రావచ్చని మరోమారు ధృవపడింది. ఆదివేదమైన రుగ్వేదం చెప్పినట్టు ‘‘జ్ఞానమనే వెలుగును అన్ని దిశల నుంచీ రానీయా’’లి. అందుకేనేమో,ఇరవయ్యో శతాబ్దిలో వాదవివాదాల జోలికి పోకుండా తనదైన కవిత్వాన్ని పండించిన సాహితీ కృషీవలులలో అగ్రగణ్యుడు బోయి భీమన్న ఈ చిన్న పద్యంలో అనంతార్ధాన్ని ఇమిడ్చారు. జ్యోతి మరో జ్యోతిని వెలిగించడాన్ని నేపధ్యంగా ఉంచి, ఏ పరంజ్యోతితోనో వెలిగిన దివ్వెలం మనం అంటున్నాడు సాటి మానవుడితో. పైగా, మనం ఊరకే పుట్టలేదు, ప్రపంచ విధిని నెరవేర్చడానికి పుట్టామని గుర్తు చేస్తున్నాడు. చిన్న దీపకలికలమే అయినా మనకో లక్ష్యం ఉందని గుర్తు చేస్తున్నాడు. నిన్నూ, నన్నూ కూడా ముంచేసే అంధకారం మీద మనది ఉమ్మడి దండయాత్ర అని ఉద్భోదిస్తున్నాడు. ఎంత గొప్ప భావన. భావన కన్నా కూడా, ఓ గొప్ప ప్రేరణ. అది ఎటువంటి అంధకారమైనా కావచ్చు! మతఛాందసవాదనల అంధకారమో! కులవివక్షలతో పుట్టిన అంధకారమో! జాతి విధ్వేషాలతో రగిలే అంధకారమో! నిరక్షరాస్యతా అంధకారమో! ఆర్థిక అసమానతల నడుమ కనలే అంధకారమో! రా, దీపికా మన దండయాత్ర ఈ చీకటి వ్యతిరేకంగా సాగిద్దాం, వెలుగుల వైపు పయనిద్దాం అంటున్నాడు. తమసోమా జ్యోతిర్గమయా! - దిలీప్‌రెడ్డి -
పద్యానవనం: ఏం చెప్పారన్నదే...
లోకములన్నియున్ గడియలోన జయించిన వాడ, వింద్రియా నీకము, చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దు జేయు నీ భీకర శత్రులార్వుర బ్రభిన్నుల జేసిన బ్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వరా! శత్రువులెవరు? మితృలెవరు? తేల్చుకోవడంలోనే విజ్ఞత ఉంటుంది. వెనకట ఎవరో ఒకావిడ పిల్లను చంకలో పెట్టుకొని ఊరంతా వెతికిందట! హిరణ్యకశ్యపుని స్థితి కూడా అలాగే ఉందన్నట్టు పరోక్షంగా తెలియజేస్తాడు ఆయన సుపుత్రుడు ప్రహ్లాదుడు. ఎక్కడో కనిపించని వారిని శత్రువుగా నీకు నీవే ఖరారు చేసుకొని, ఓడించి గెలుస్తానని వెతుకులాడుతావ్, నీలోనే దాగి వున్న అసలు శత్రువుల్ని గుర్తించవు, గెలిచేందుకు యత్నించవు అన్నది భావన. కొలవాల్సింది ఎవర్ని? గెలవాల్సింది ఎవర్ని? సర్వ శాస్త్ర పారంగతుడైన హిరణ్యకశ్యపునికే సూక్ష్మం చెబుతాడు బుడతడై ఉండి. గెలవాల్సిన వారినింకా తన తండ్రి గెలువనే లేదంటాడు. ఆ చెప్పడం, లేదా చెప్పించడం అనండి చాలా గొప్పగా ఉంటుంది పోతన శైలి. పదాలు కూడా సందర్భోచితంగా వాడతాడు. ఇక్కడ చూడండి, దానవేశ్వరా! అంటాడు. అంటే రాక్షసుల్లోనే అత్యున్నతుడివి. మరింకేముంది, గెలవాల్సిన వారిని గెలిచి ప్రాణికోటిలో ఇక విరోధులే లేకుండా చేసుకుంటే దేవతల్నీ అధిగమించగలవని గుర్తు చేయడం అన్నమాట. ఆయనేమో అది వినడాయె! తాను వినకపోగా, ప్రహ్లాదుణ్ని హరినామ స్మరణ చేయొద్దంటాడు. ప్రగాఢ శత్రువని తాను తలబోచే హరి, తనకు వెరచి ఎక్కడో దాక్కున్నాడని ఆయన కోసం లోకాలన్నీ వెతుకుతాడు. విసిగి వేసారి, ‘పోనీ భక్తుడవై కీర్తిస్తున్నావు కదా! ఎక్కడున్నాడో నీ హరిని చూపు?’ అని ప్రహ్లాదుణ్నే నిలదీస్తాడు. ‘‘ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటేన్’’ అంటాడు. ఇక్కడ కూడా పోతన పదప్రయోగం చూడండి, ఎన్నెన్నో పేర్లున్న విష్ణువును ఇక్కడ చక్రి అంటాడు, వలయాకృతిలో ఉన్న సృష్టి సమస్తం వ్యాపించి ఉన్నాడనే అర్థం స్పురింపజేయడానికి కావొచ్చు. ఇక్కడున్నాడు... అక్కడ లేడు అనే తేడాలు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నాడంటూనే, చివర్లో ప్రహ్లాదుని నోట ఒక మాట వాడాడు. ‘...వింటే’ అన్నాడు. అసలు వినాలి కదా! శ్రద్దగా జాగ్రత్తగా వినాలి, విశ్వాసంతో వినాలి. అప్పుడు విచక్షణ చేయాలి. అంతే గాని, మొండిగా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు వినడానికే సిద్దంగా లేకుంటే... కనిపించకుండానే విశ్వవ్యాప్తమై ఉన్న భవగవంతుడ్ని నిరూపించడమెలా? ఇంతకీ, హిరణ్యకశ్యపుని శత్రువులెవరు? ఎక్కడున్నారు? వారెందరు? ఏంజేస్తున్నారు? వారినెలా గెలవాలి? గెలిస్తే ఏంటి ప్రయోజనం? ఈ ఆరు ప్రశ్నలకూ సమాధానం ఉందీ పద్యంలో. తక్కువ సమయంలో లోకాలన్నింటినీ జయించిన పరాక్రమశాలివని గుర్తు చేస్తూనే... ఇంకా నీవు గెలవని, గెలవాల్సిన ఆర్గురు శత్రువులు ఎక్కడో కాదు నీలోనే ఉన్నారని చెబుతాడు ప్రహ్లాదుడు. ఇంద్రియ నిగ్రహం, మనసును అదుపులో పెట్టుకోవడం సాధించలేకపోతున్నావంటాడు. అంతశ్శత్రువుల్ని గెలవడానికి అవే నిజమైన ఆయుధ సంపత్తి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు అంతశ్శత్రువులు. అవి ఆయనలోనే ఉండి కట్టడి చేస్తున్నాయి. ఇంద్రియ నిగ్రహంతో మనసుపై నియంత్రణ సాధించి, ఆ ఆరింటి పీచమణచగలిగితే... సమస్త ప్రాణకోటిలో శత్రువులే ఉండరు. ఈ ఆర్గురు అంతశ్శత్రువులు హిరణ్యకశ్యపునికే కాదు మన అందరిలోనూ ఉంటారు. ఏ శత్రువును ఏ మేరకు గెలవగలిగామనే దాన్ని బట్టి మన వ్యక్తిత్వ వికాసం, పరిణతి, జీవన సాఫల్యం ఆధారపడి ఉంటాయి. - దిలీప్‌రెడ్డి -
పద్యానవనం: ఎక్కడ్నుంచి వచ్చామో తెలిస్తే గమ్యం చేరడం తేలిక!
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా? విశ్వదాభిరామ వినుర వేమ! పున్నామనరకం నుంచి విముక్తి కలిగించేవాడు పుత్రుడు అంటారు. పైనుండే పున్నామ నరకాన్ని తప్పించడం సంగతేమో కాని, ఈ భూమ్మీదే నరకం చూపకుంటే చాలు, అనుకునే తల్లిదండ్రులెందరో! తల్లిదండ్రుల్ని క్షోభకు గురిచేసే వారి సంతానం గురించి విన్నప్పుడు మనసు కలుక్కుమంటుంది. అంత క్రూరంగా ఎలా ఉండగలుగుతారో! అని సందేహమూ కలుగుతుంది. కారణాలేవైనా, అలా చేయడం సరికాదు, ఎవరూ సమర్థించరు. కడకు వారైనా, విధిలేని పరిస్థితుల్లోనే అలా వ్యవహరించాల్సి వస్తోందని సమర్థించుకో జూస్తారు. కానీ, అలా జరక్కుండా చిత్తశుద్ధి కనబర్చడం పిల్లలుగా వారి కర్తవ్యం. తలిదండ్రులకన్నా ఈ భూప్రపంచంలో ముఖ్యమైన వారెవరుంటారు! భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో తల్లిదండ్రులకు ఎనలేని గౌరవముంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ సేవలందించిన శ్రవణకుమారుని కథ ఓ గొప్ప ప్రేరణ. మహాత్ముడు బాపూజీని కూడా ప్రభావితం చేసిందా కథ. మన వేదాలు, పురాణేతిహాసాల్లో అటువంటి కథలు ఎన్నో! జన్మనిచ్చిన తల్లి, అందుకు కారకుడైన తండ్రి ప్రతి వ్యక్తికీ ముఖ్యులు కనుకనే ‘మాతృదేవోభవ, పితృదేవోభవ...’ అన్నారు. కనిపించే దేవతలు అయినందున వారికి అగ్రతాంబూలం. అందుకేనేమో, వారు కూడా తమ సంతానానికి అవ్యాజమైన ప్రేమను పంచుతూ, అనురాగం ఆప్యాయతల్ని రంగరించి పిల్లల్ని వృద్ధిలోకి తెస్తారు. అందుకోసం ఎంత వ్యయప్రయాసలకైనా వెనుకాడరు. వివిధ దశల్లో పిల్లల సౌఖ్యం, సౌభాగ్యం కోసం తమవైన జీవన సౌఖ్యాల్ని వదులుకొని పిల్లల కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం త్యాగనిరతితో జీవనం సాగించే తల్లిదండ్రులు ఇక్కడున్నట్టు ప్రపంచంలో మరెక్కడా ఉండరని ఒక ప్రతీతి. ఆ ఔన్నత్యాన్ని గుర్తించే కావచ్చు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ దేశాన్ని కీర్తించారు. ఈ విశ్వానికి భారత్ చేసిన గొప్ప మేలు, విలువలతో కూడిన జీవన విధానాన్ని నేర్పడమని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు. అక్షరం ముక్క రాకపోయినా, బతుకు బండి భారంగా ఈడ్చినప్పటి అనుభవాల్ని జీర్ణించుకున్న పెద్ద మనసుతో పిల్లల్ని బాగా చదివిస్తారు పేద తల్లిదండ్రులు కూడా. ‘అమృతం తాగినవాళ్లు దేవుళ్లు, దేవతలు, అది కన్నబిడ్డలకు పంచిన వాళ్లు అమ్మానాన్నలు...’ అంటాడు ఓ సినీగీతంలో ఆచార్య ఆత్రేయ. కానీ, ఏ మేరకు రుణం తీర్చుకుంటున్నాం? జీవన పోరాటంలో, ఉద్యోగాన్వేషణల్లో ఎక్కడెక్కడో దూరతీరాలకు వెళుతూ బతుకు సమరంలో అలిసిపోయే నేటి తరం, తెలిసీ తెలియక తలిదండ్రుల్ని అలక్ష్యం చేస్తోందేమో! డాలర్ మోజులో పునాదులు మరచి.... ‘వృద్దాశ్రమంలో చేర్చి ఇంతింత కడుతున్నాంగా, ఇంకేం చేయాలి?’ అనే వారికి ఏం చెప్పగలం! కర్తవ్యం, బాధ్యతల సంగతలా ఉంచితే, దయ అనేదానికీ తావు లేదే? ఓ జీవిత కాలం పయనించి, బతుకు మలి సంధ్యలో... అనురాగపు అనునయింపు కోసం, ఆత్మీయస్పర్శ కోసం అలమటించే ఆ పండుటాకులకు అసరా కావాలనే స్పృహ అవసరం. పుట్టలో చెదల్లాగ పుట్టి, గిట్టేట్టయితే మనిషి పుట్టుక పుట్టి ఏం ప్రయోజనం! వేమన అడిగాడని కాదు గానీ, ఎవరకు వారం, మనకు మనం ప్రశ్నించుకోవాలి. - దిలీప్‌రెడ్డి