రైతు చెమటకు కన్నీరు తోడై నేల తడపరాదు!
పద్యానవనం
నీ జాతివారలు రాజులై యుండియు
కనజాలరైరి నీ కష్టమెల్ల
నీ కొలమందు జన్మించిన యాజమిం
దారులు గనరు నీ తాపమెల్ల
నీ శాఖలో ధననిలయులౌ కొందరు
పరికింపలేరు నీ బాధలెల్ల
నీ తెగలో విద్యనేర్చిన బియ్యేలు
లిఖించరైరి నీ లేములెల్ల
గీ॥న్యాయవాదులు నీవార లడుగరైరి
న్యాయమూర్తులు నీవార లరయరైరి
ఇంక పెఱవారి ముచ్చట లెందుకయ్య
కర్షకా! నీదు కష్టముల్ గాంతురెవరు?
అందరూ నీ వారే అయినా, ఎవరికి పట్టాయి నీ కష్టాలు రైతుబిడ్డా! అంటున్నాడు ఓ కవి. ఇది సుమారు వంద సంవత్సరాల కిందటి మాట! ఈ నూరేళ్లలో పరిస్థితి పెద్దగా మారలేదు సరికదా, రైతు స్థితి మరింత దిగజారింది. దేశానికి రైతే వెన్నెముక అని చెబుతారు తప్ప, రైతును ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రారు. రైతు ఏయే కష్ట-నష్టాల్ని ఎదుర్కొంటున్నాడు? ఏ విపత్కర పరిస్థితులకు ఎదురీదుతున్నాడు? ఏం చేస్తే ఆతని ఈతి బాధలు తగ్గించవచ్చు?
ఆహారోత్పత్తికి మూలకణం, గ్రామీణ ఆర్థిక వికాసానికి కేంద్రబిందువైన రైతాంగం దేశంలో, రాష్ట్రంలో పాలకుల ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడో అట్టడుగునే ఉంటారు. దేశానికి అన్నం పెట్టే పనిలో నిమగ్నమై తన బతుకంతా ధారపోసే రైతు కనీస జీవనానికి నోచుకోక కడకు ఆత్మహత్యతో తనువు చాలిస్తున్నాడు. తిండిబెట్టే ఇంటి పెద్దదిక్కును కోల్పోయి, అప్పటిదాకా పరువుగా బతికిన రైతు కుటుంబాలు కకావికలై వీధిన పడుతున్నాయి. దశాబ్దాల తరబడి ఈ దుస్థితి కొనసాగుతున్నా, పరిస్థితిని మార్చే విప్లవాత్మకమైన చర్యలకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో కృషి చేయట్లేదు. ఏ రైతు కష్టాల్ని దగ్గరగా చూస్తున్నారో, ఆయా వర్గాలు కూడా సదరు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని అదుకునే చొరవ చూపడం లేదు. ఇదే మాట చెబుతున్నాడీ పద్యంలో గంగుల శాయిరెడ్డి అనే గ్రామీణ కవి.
రైతు కులానికే చెందిన వారు పెద్ద పెద్ద జమిందారులుగా ఉంటారు, అయినా రైతాంగం ఇబ్బందుల్ని వారు పరిగణనలోకే తీసుకోరు. రైతు వర్గీయులే మహా ధనికులై ఉండి కూడా సాటి కర్షకులెదుర్కొనే బాధల్ని లెక్కచేయరు. రైతు కుటుంబాల నుంచే వచ్చి పెద్ద చదువులు చదివిన వారు కూడా రైతుల లోటుపాట్లేంటో తెలుసుకొని పై వారికి రాయరు. నీ వారే అయినా న్యాయవాదులు అడుగరు, నీ వారై కూడా న్యాయమూర్తులు తెలుసుకోరు. అయినవాళ్లే ఇలా ఉంటే, ఇక పరాయివారెలా ఉంటారో మాట్లాడటం అనవసరం. మరి రైతు కష్టాల్ని పట్టించుకునేదెవరు? అన్నది అంతిమంగా కవి ప్రశ్న.
బమ్మెర పోతన స్వయంగా రైతు కాగా రైతాంగం శ్రమదమాదుల మీద, కష్టనష్టాల మీద ఎందరెందరో సాహితీ సృజన చేశారు. మంచన, శ్రీనాథుడు, దువ్వూరి రామిరెడ్డి, గుఱ్ఱం జాషువా, కరుణశ్రీ, శ్రీశ్రీ, దాశరథి, కుందుర్తి... ఎందరెందరో తమ కలంలో సిరాతోపాటు రైతు స్వేదాన్నీ మిళితం చేసి కవిత్వం పలికించారు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన ఈ పద్యానికి సేద్యపు స్వేదమే కాకుండా వైవిధ్యపు నేపథ్యమూ ఉంది.
‘నిజాం రాజ్యంలో ఆంధ్ర కవులు పూజ్యం’ అని ముడుంబ వేంకట రాఘవాచార్య చేసిన ప్రకటనకు జవాబుగా వచ్చిన ‘గోలకొండ కవుల సంచిక’లో ‘కర్షకా!’ అన్న శీర్షికన ప్రచురితమైందీ పద్యం. ‘...ఇచటి పరిస్థితులు తెలియక, తెలుసుకొను తగు అవకాశములు లేక వెల్లడించినారు తప్ప ద్వేషబుద్ధిచే కాదనుట నిశ్చయము’ అంటూ గొప్ప సంయమనంతో అప్పటి గోలకొండ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి... నిజాం రాజ్యం పరిధిలోని 354 మంది కవుల కవితలతో ఈ ప్రత్యేక సంచికను వెలువరించారు. అందులోని ఈ పద్యం రైతు చెమటకు ప్రతిరూపం. దీని కవి గంగుల శాయిరెడ్డి అప్పటి నల్గొండ జిల్లా, జన్గాం తాలూకా, జీడికల్లు గ్రామానికి చెందిన నలభై ఏళ్ల రైతుబిడ్డ. మానవజాతి మనుగడకు జీవం పోసే రైతు అకాల మరణాలు ఏ ప్రమాణాలతోనూ క్షంతవ్యం కాదు. కర్షకుని చెమట బిందువులకు కన్నీటి చుక్కలు తోడై నిరంతరం మట్టిని తడుపుతూ ఉండటం ఏ జాతికీ శ్రేయస్కరం కాదు.
- దిలీప్‌రెడ్డి