పద్యానవనం: ఎక్కడ్నుంచి వచ్చామో తెలిస్తే గమ్యం చేరడం తేలిక!
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినుర వేమ!
పున్నామనరకం నుంచి విముక్తి కలిగించేవాడు పుత్రుడు అంటారు. పైనుండే పున్నామ నరకాన్ని తప్పించడం సంగతేమో కాని, ఈ భూమ్మీదే నరకం చూపకుంటే చాలు, అనుకునే తల్లిదండ్రులెందరో! తల్లిదండ్రుల్ని క్షోభకు గురిచేసే వారి సంతానం గురించి విన్నప్పుడు మనసు కలుక్కుమంటుంది. అంత క్రూరంగా ఎలా ఉండగలుగుతారో! అని సందేహమూ కలుగుతుంది. కారణాలేవైనా, అలా చేయడం సరికాదు, ఎవరూ సమర్థించరు. కడకు వారైనా, విధిలేని పరిస్థితుల్లోనే అలా వ్యవహరించాల్సి వస్తోందని సమర్థించుకో జూస్తారు. కానీ, అలా జరక్కుండా చిత్తశుద్ధి కనబర్చడం పిల్లలుగా వారి కర్తవ్యం. తలిదండ్రులకన్నా ఈ భూప్రపంచంలో ముఖ్యమైన వారెవరుంటారు!
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో తల్లిదండ్రులకు ఎనలేని గౌరవముంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ సేవలందించిన శ్రవణకుమారుని కథ ఓ గొప్ప ప్రేరణ. మహాత్ముడు బాపూజీని కూడా ప్రభావితం చేసిందా కథ. మన వేదాలు, పురాణేతిహాసాల్లో అటువంటి కథలు ఎన్నో! జన్మనిచ్చిన తల్లి, అందుకు కారకుడైన తండ్రి ప్రతి వ్యక్తికీ ముఖ్యులు కనుకనే ‘మాతృదేవోభవ, పితృదేవోభవ...’ అన్నారు.
కనిపించే దేవతలు అయినందున వారికి అగ్రతాంబూలం. అందుకేనేమో, వారు కూడా తమ సంతానానికి అవ్యాజమైన ప్రేమను పంచుతూ, అనురాగం ఆప్యాయతల్ని రంగరించి పిల్లల్ని వృద్ధిలోకి తెస్తారు. అందుకోసం ఎంత వ్యయప్రయాసలకైనా వెనుకాడరు. వివిధ దశల్లో పిల్లల సౌఖ్యం, సౌభాగ్యం కోసం తమవైన జీవన సౌఖ్యాల్ని వదులుకొని పిల్లల కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం త్యాగనిరతితో జీవనం సాగించే తల్లిదండ్రులు ఇక్కడున్నట్టు ప్రపంచంలో మరెక్కడా ఉండరని ఒక ప్రతీతి. ఆ ఔన్నత్యాన్ని గుర్తించే కావచ్చు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ దేశాన్ని కీర్తించారు. ఈ విశ్వానికి భారత్ చేసిన గొప్ప మేలు, విలువలతో కూడిన జీవన విధానాన్ని నేర్పడమని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు.
అక్షరం ముక్క రాకపోయినా, బతుకు బండి భారంగా ఈడ్చినప్పటి అనుభవాల్ని జీర్ణించుకున్న పెద్ద మనసుతో పిల్లల్ని బాగా చదివిస్తారు పేద తల్లిదండ్రులు కూడా. ‘అమృతం తాగినవాళ్లు దేవుళ్లు, దేవతలు, అది కన్నబిడ్డలకు పంచిన వాళ్లు అమ్మానాన్నలు...’ అంటాడు ఓ సినీగీతంలో ఆచార్య ఆత్రేయ. కానీ, ఏ మేరకు రుణం తీర్చుకుంటున్నాం? జీవన పోరాటంలో, ఉద్యోగాన్వేషణల్లో ఎక్కడెక్కడో దూరతీరాలకు వెళుతూ బతుకు సమరంలో అలిసిపోయే నేటి తరం, తెలిసీ తెలియక తలిదండ్రుల్ని అలక్ష్యం చేస్తోందేమో! డాలర్ మోజులో పునాదులు మరచి.... ‘వృద్దాశ్రమంలో చేర్చి ఇంతింత కడుతున్నాంగా, ఇంకేం చేయాలి?’ అనే వారికి ఏం చెప్పగలం!
కర్తవ్యం, బాధ్యతల సంగతలా ఉంచితే, దయ అనేదానికీ తావు లేదే? ఓ జీవిత కాలం పయనించి, బతుకు మలి సంధ్యలో... అనురాగపు అనునయింపు కోసం, ఆత్మీయస్పర్శ కోసం అలమటించే ఆ పండుటాకులకు అసరా కావాలనే స్పృహ అవసరం. పుట్టలో చెదల్లాగ పుట్టి, గిట్టేట్టయితే మనిషి పుట్టుక పుట్టి ఏం ప్రయోజనం! వేమన అడిగాడని కాదు గానీ, ఎవరకు వారం, మనకు మనం ప్రశ్నించుకోవాలి.
- దిలీప్‌రెడ్డి