వాడే వీడా? | whos he? | Sakshi
Sakshi News home page

వాడే వీడా?

Published Sun, Jul 10 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

వాడే వీడా?

వాడే వీడా?

పట్టుకోండి చూద్దాం
ఎప్పుడూ హుషారుగా ఉంటూ అందరినీ నవ్వించే డేవిడ్ ఆరోజు కంటికి మింటిగా ధారగా ఏడుస్తున్నాడు. చుట్టు పక్కల వాళ్లు రకరకాలుగా ఓదారుస్తున్నారు. ‘‘భార్యను ఎంత బాగా చూసుకునే వాడో...’’ అని ఒకరంటే... ‘‘భార్యా భర్తలిద్దరూ  ఎప్పుడూ చిన్న గొడవ పడలేదు’’ అని మరొకరు అన్నారు. ఇది ఒక్క రోజు దృశ్యం కాదు. గత వారం రోజులుగా కనిపిస్తున్న దృశ్యం. అందరినీ కదలిస్తున్న దృశ్యం. వేసవి సెలవుల్లో భార్య రమ్యతో కలిసి  డేవిడ్ బెంగళూరు వెళ్లాడు. బెంగళూరు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు డేవిడ్.
 
అది ఇప్పుడు నెరవేరింది. లాల్‌బాగ్, జె.పి బయోడైవర్సిటీ పార్క్, బెంగళూరు ఫోర్ట్, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, విధాన సౌధ, గవర్నమెంట్ మ్యూజియం... ఇలా ఎన్నో చూశారు శరత్, రమ్యాలు. ఇద్దరికీ బెంగళూరు తెగనచ్చేసింది.
   
‘‘సర్... నా పేరు డేవిడ్... నా భార్య కనిపించడం లేదు...’’ అని ఇన్‌స్పెక్టర్‌తో చెబుతున్నాడు డేవిడ్. అతని నుదిటికి చెమట పట్టింది. చేతులు ఒణుకుతున్నాయి.
 ‘‘అసలేం జరిగింది?’’ ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్ మంజప్ప.
 ‘‘మేము హైదరాబాద్‌లో ఉంటామండీ... బెంగళూరు చూడడానికి వచ్చాం. గాంధీ బజార్‌లో ఉన్నప్పుడు... ఐస్‌క్రీం కావాలని అడిగింది నా భార్య రమ్య. నువ్వు ఇక్కడే నిల్చొని ఉండు... నేను పట్టుకొస్తానని ఐస్‌క్రీం పార్లర్‌ను వెదుకుతూ బయలుదేరాను. తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు.

చుట్టుపక్కల వాళ్లను అడిగాను. తలా ఒక్క సమాధానం చెప్పారు. ‘ఆమె దగ్గరికి ఒక వైట్ కలర్ వ్యాన్ వచ్చి ఆగింది, ఆ వ్యాన్‌లో ఉన్నవాళ్లు ఆమెతో ఏదో మాట్లాడారు, ఆ తరువాత ఆమె వ్యాన్‌లో కూర్చొని వెళ్లింది’ అని ఒకరు చెప్పారు.
  ‘ఇక్కడే ఏదో ఆటోలో వెళ్లింది’ అని మరోవ్యక్తి చెప్పాడు. ‘ఎవరో కుర్రాడు ఆ అమ్మాయితో చాలాసేపు మాట్లాడాడు... ఆ తరువాత వాళ్లిద్దరూ కనిపించలేదు’ అని ఇంకో వ్యక్తి చెప్పాడు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. మీరే నన్ను కాపాడాలి సార్’’ అని ఇన్‌స్పెక్టర్ మంజప్పను వేడుకున్నాడు డేవిడ్.
 
‘‘ముగ్గురూ మూడు రకాలుగా చెప్పి ఉండొచ్చుగాక... వీటిలో ఎవరు చెప్పినదాన్ని  నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావు?’’ అడిగాడు మంజప్ప. ‘‘అక్కడ టీ కొట్టులో పని చేసే నల్ల కుర్రాడు చెప్పిన విషయాన్ని ఎక్కువగా నమ్ముతున్నాను’’ అన్నాడు డేవిడ్.
 ‘‘ఎందుకని?’’ ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్ మంజప్ప. ‘‘ఆటోలో వెళ్లాల్సిన అవసరం రమ్యకు ఏముంది? ఇక్కడ ఆమెకు బంధువులు ఎవరూ లేరు. అలాగే... ఎవరో కుర్రాడితో మాట్లాడింది అనే విషయాన్ని కూడా నేను నమ్మడం లేదు. ఆమెకు ఇక్కడ పరిచయస్తులు ఎవరూ లేరనే విషయం నాకు తెలుసు.

ఆ వ్యాన్‌లో వచ్చిన వాళ్లు రమ్యకు ఏవో మాయమాటలు చెప్పి, వ్యాన్‌లో తీసుకొని వెళ్లి ఉండొచ్చు’’ అని వివరించాడు డేవిడ్.
 ‘‘మీరు ధైర్యంగా ఉండాలి. మీ భార్యకు ఏమీ కాదు....’’ ధైర్యం చెప్పి రంగంలోకి దిగాడు ఇన్‌స్పెక్టర్ మంజప్ప.
 ఒకటో రోజు... రెండో రోజు... మూడో రోజు.... ఇన్‌స్పెక్టర్ శ్రమ ఫలించలేదు.
 రమ్య కేసు మిస్టరీగా మారింది.
   
హైదరాబాద్‌లో... డేవిడ్‌ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ. ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్లను కూడా ఎంక్వైరీ  చేశాడు. అప్పుడు పూర్తిగా స్పష్టత వచ్చింది.
 ‘‘నీ భార్య కనిపించకపోవడానికి కారణం నువ్వే... నిజం చెప్పు’’ అని గట్టిగా గద్దించడంతో డేవిడ్ వణికిపోయాడు. ఇక తన పప్పులు ఉడకవని నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి.... డేవిడ్ హంతకుడు అని ఇన్‌స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు?
 
బెంగళూరుకు వెళ్లడానికి, తిరిగి రావడానికి తనకు రెండు బస్సు టికెట్లు తీసుకున్న డేవిడ్... రమ్యకు మాత్రం ఒకే టికెట్ తీసుకున్నాడు. వచ్చేటప్పుడు తాను ఒక్కడినే వస్తాననే నమ్మకానికి కారణం ఏమిటి? రమ్య ఎలాగూ తిరిగిరాదని  ముందస్తు ప్లాన్ ప్రకారమే... ఆమెకు ఒకే టికెట్ తీసుకున్నాడు. ఇదే అతన్ని పట్టించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement