సమకాలీనం
కొంత నమ్మకాన్ని నిలుపుతూ వస్తున్న న్యాయ వ్యవస్థ కూడా వివాదాస్పదమౌతోంది. సుప్రీంకోర్టులో కొన్ని వ్యవహారాలు సవ్యంగా లేవంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా మీడియాతో మాట్లాడటం పెను సంచలనమే అయింది. ఆ వ్యవహారమింకా ఓ కొలిక్కి రాలేదు. ప్రధాన న్యాయమూర్తి తన విచక్షణాధికారాల్ని దురుపయోగపరుస్తున్నారనే అభియోగం న్యాయవ్యవస్థకే కళంకం తెచ్చింది. లోగడ న్యాయమంత్రుల జోక్యం మితిమీరిందనే విమర్శలు వచ్చేవి.
‘‘ఆకస్మిక దాడి, హింసతో వశపరచుకునే సందర్భాల కన్నా, అధికారంలో ఉన్నవాళ్లు నిశ్శబ్దంగా క్రమేపి జరిపే దురాక్రమణల వల్లనే పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎక్కువమార్లు భంగపడ్డాయని నేను విశ్వసిస్తాను’’ – జేమ్స్ మాడిసన్ (1751–1836)
అమెరికా రాజ్యాంగ పితామహుడిగా పేరొందిన ఆ దేశ నాలుగో అధ్యక్షుడు జేమ్స్ మాడిసన్ అన్న ఆ మాటలు నేటికీ అక్షర సత్యాలు. మన చుట్టూ అలుముకుంటున్న వాతావరణం దీన్ని రుజువు చేస్తోంది. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థని, నిర్వాహకులే అందులోని వివిధ సంస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా బలహీన పరుస్తున్నారు. తద్వారా తాము గుత్తాధిపత్యం సాధించాలనుకోవడం నేటి పాలకులకు రివాజుగా మారింది. క్రమంగా ఒక్కో ప్రజాస్వామ్య వ్యవస్థనీ బలహీనపరుస్తున్న జాడలు కళ్లకు కడుతున్నాయి. వాటిని నామమాత్రం చేసి అచేతన పరుస్తున్నారు. ఫలితంగా, రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు అందించే ప్రయోజనాలు పౌరులకు పూర్తిస్థాయిలో లభించటం లేదు. పౌరులు పోరాడి సాధించుకునే దారుల్ని కూడా ఒకటొకటిగా మూసేస్తున్నారు.
నిరసన వేదికల్నే లేకుండా చేస్తున్నారు. విపక్ష రాజ కీయ పార్టీలను వీలయిన అన్ని పద్ధతుల్లో చీల్చి చెండాడుతూ పాలకపక్షాలు రాజకీయాలను ఏకస్వామ్యం వైపు నడుపుతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఎదురొచ్చే శక్తులు లేకుండా, నిలదీసే వ్యవస్థలు కనబడకుండా, ప్రశ్నించే గొంతులు పెగలకుండా చేస్తూ వ్యూహాత్మకంగా తమ దారి సుగమం చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ముమ్మర యత్నాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. దానికి మూల స్తంభాలయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సామాన్యుడికి బాసటగా ఉన్నామనే విశ్వాసం కలిగించలేక పోతున్నాయి. నాలుగో స్తంభంగా పేరున్న ప్రసార మాధ్యమ వ్యవస్థను కూడా నయానో, భయానో గుప్పిట పట్టే యత్నాలు సాగుతున్నాయి. అధికారాన్ని ఏకపక్షంగా కేంద్రీకృతం చేయడం, భావజాలపరమైన తమ ప్రోత్సాహక శక్తుల స్వేచ్ఛా వ్యవహారాలను అనుమతించడం సాధారణమైపోయింది. బయటున్న పేరంచు (ఫ్రింజ్) శక్తులే సమాజగతిని శాసించే దుస్థితులు దాపురిస్తున్నాయి.
వీలయిన అన్ని మార్గాల్లో....
అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్నాయి. అధికారమే పరమావధిగా రాజ్యం ఓ బలమైన శక్తిగా రూపు దిద్దుకుంటోంది. మరోవైపు రాజ్యాంగబద్ధంగానో, చట్టపరంగానో నడవాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలహీన పరుస్తూ నిర్వీర్యం చేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుంటున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వంటి పటిష్ట రాజ్యంగ వ్యవస్థలను కూడా పలచన చేస్తున్నారు. టీఎన్ శేషన్, లింగ్డో తదితర సమర్థులు నిర్వహణ పరంగా బలోపేతం చేస్తే వన్నెకెక్కిన సీఈసీ వంటి సంస్థలు ఇప్పుడు రాజకీయ, పౌర సంస్థల నుంచి ఘాటైన విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి.
పదవీ విరమణకి కొన్ని గంటల ముందు, రాజకీయ ప్రత్యర్థి ‘ఆప్’ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేసి పాలకపక్షం రుణం తీర్చుకున్నారనే విమర్శలెదుర్కోవాల్సి వచ్చింది. నిఘా, నియంత్రణ, విచారణ, దర్యాప్తు వంటి సంస్థల పూర్తిస్థాయి నిర్వహణపై శ్రద్ధ లేదు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు రాజకీయ క్రీడకు పనికొస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై ప్రతీకారం తీర్చుకునేందుకు, రాజకీయ లబ్ధి కోసమో, కక్ష సాధింపునకో కేసులు పెట్టేందుకు పనికొస్తున్నాయి తప్ప స్వతంత్రత కొరవడిందనే ఆరోపణలున్నాయి. సాక్ష్యాధారాలు చూపలేకపోయారంటూ 2జీ స్పెక్ట్రమ్ కేసు నిందితులందరినీ సర్వోన్నత న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడం అధికార కేంద్రానికీ–దర్యాప్తు సంస్థలకూ మధ్యనున్న అనుచిత బంధానికి మచ్చుతునక!
వ్యూహాత్మక ఎత్తుగడగా....
ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసి, దాని స్థానే నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని కార్యాలయానికి అదొక పొడిగింపుగా తయారయిం దనే విమర్శలున్నాయి. ఆ సంస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, దేశ ప్రగతిని నిర్దేశించే తనదైన ముద్ర వేసిన సందర్భమే లేదనే మేధావి వర్గం వాదనను కాదనలేము. పర్యావరణ పరమైన అనేక విషయాల్లో కంటగింపుగా మారిందనే తలంపుతోనేనేమో జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ)లో ఏర్పడుతున్న ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయటం లేదు. వివిధ బెంచ్‌లు అరకొర సంఖ్య నిపుణులతోనే నడుస్తున్నాయి. సత్వర పరిష్కారాలు లేక కేసులు పేరుకుపోతున్నాయి. ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ పదవీ విరమణ తర్వాత ఇంకా ఎవరినీ నియమించలేదు.
ఇన్‌చార్జీ ఛైర్మన్ (యూడీ సాల్వి)తో ప్రస్తుతానికి నడిపిస్తున్నారు. చెన్నైలో పనిచేస్తున్న బెంచ్‌లో ప్రస్తుతం కేసులు చూసే వారెవరూ లేరు. కేంద్ర సమాచార కమిషన్‌లో ముఖ్య సమాచార కమిషనర్ లేకుండా సుమారు ఓ ఏడాది కాలం గడిపి, ఆపై నియమించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొంత కాలం కొనసాగి, హైకోర్టు నిర్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గడువు లోపల కమిషన్ ఏర్పాటు చేసి ఇద్దరు కమిషనర్లను నియమించింది. ఏపీ ప్రభుత్వం పలు వాయిదాల తర్వాత ఇప్పుడు కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చినా ఇంకా కమిషనర్లను నియమించనేలేదు. రెండు రాష్ట్రాల్లోనూ మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయలేదు. తదుపరి లోకాయుక్త నియామకం జరపలేదు. తెలంగాణలో పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ ప్రక్రియను పూర్తిచేయడం లేదు.
నిరసన హక్కును కాలరాస్తే.....
పౌరులు నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వాలు నిర్బంధాలతో హరిస్తున్నాయి. ఒకప్పుడు ఫలితాలిచ్చిన చర్చలు, సంప్రదింపుల ప్రక్రియకు పాలకులిప్పుడు తిలోదకాలిచ్చారు. రోజులు, వారాలు, నెలల తరబడి బాధితులు నిరసన ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు చేసినా పట్టించుకునే వారే లేరు. కనీసం వారు నిరసన తెలుపుకునే వేదికలు కూడా లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అవసరమని భావించిన చోట అణచివేతకు ప్రత్యేక చట్టాలు తెస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇందుకోసం ఓ నల్లచట్టం రూపుదిద్దుకుం టోంది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సుదీర్ఘకాలంగా ఉన్న ధర్నాచౌక్‌ను ఎత్తివేశారు. అంతకుముందరి పాలకులు అసెంబ్లీ, సచివాలయం సమీపంలోని బుద్ధపూర్ణిమ దగ్గరనుంచి ఇందిరాపార్కుకు తరలిస్తే ప్రస్తుత పాలకులు ఏకంగా నగర శివార్లకే తరలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటుకు సమీపంలో, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలిచ్చుకునేందుకు సౌకర్యంగా, ఎంతో కాలంగా ఉన్న జంతర్‌మంతర్ ధర్నా చౌక్‌ను ఎత్తివేశారు.
ఎక్కడో దూరంగా రామ్‌లీలా మైదానంలో నిరసన ప్రదర్శనలు జరుపుకోవచ్చని నిర్దేశిస్తున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూనో, నిరసన కార్యక్రమం తేదీకి ఒకరోజు ముందే పౌర–ప్రజా సంఘాల నాయకుల్ని, రాజ కీయ నేతల్ని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. సభలు, సమావేశాలు జరుపుకునేందుకు అనుమతులివ్వడం లేదు. విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యాసంస్థల్లో పలు నిర్బంధాలను అమలు చేస్తున్నారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) కాషాయమయం చేస్తున్నారనే విమర్శ నుంచి, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం పేరులోంచి ‘ముస్లిం’ పదం తొలగింపును ప్రతిపాదిస్తున్నారనే అభియోగం వరకు పాలకపక్షాలు విమర్శలెదుర్కొంటున్నాయి.
న్యాయవ్యవస్థకూ తప్పని సంక్షోభం
కొంత నమ్మకాన్ని నిలుపుతూ వస్తున్న న్యాయ వ్యవస్థ కూడా వివాదాస్పదమౌతోంది. సుప్రీంకోర్టులో కొన్ని వ్యవహారాలు సవ్యంగా లేవంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా మీడియాతో మాట్లాడటం పెను సంచలనమే అయింది. ఆ వ్యవహారమింకా ఓ కొలిక్కి రాలేదు. ప్రధాన న్యాయమూర్తి తన విచక్షణాధికారాల్ని దురుపయోగపరుస్తున్నారనే అభియోగం న్యాయవ్యవస్థకే కళంకం తెచ్చింది. లోగడ న్యాయమంత్రుల జోక్యం మితిమీరిందనే విమర్శలు వచ్చేవి. జడ్జీల నియామక ప్రక్రియ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పదవీ విరమణానంతర ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థలోని కీలక వ్యక్తులు ప్రభుత్వాలకు దన్నుగా నిలుస్తారనే పరోక్ష విమర్శలుండేవి.
న్యాయవ్యవస్థను లొంగదీసుకునేందుకు పెరిగిన రాజకీయ జోక్యాల వల్ల న్యాయవ్యవస్థలోనే లుకలుకలు నెలకొన్నాయి! బెంచ్‌ల ఏర్పాటు, వాటికి కేసుల కేటాయింపు వివాదం కావడం వల్ల మొత్తం న్యాయవ్యవస్థపైనే సామాన్యులకు విశ్వాసం సన్నగిల్లింది. అవినీతికి పాల్పడ్డారనో, వాటిల్లో ప్రమేయం ఉందనో నిర్దిష్ట అభియోగాలున్న చోట సదరు న్యాయమూర్తుల వ్యవహార శైలి వివాదాలకు, విమర్శలకు తావిస్తోంది. ఉన్నత న్యాయమూర్తుల నియామకానికి ఏ పద్ధతి అనుసరించాలనే విషయంలో సుప్రీంకోర్టు–కేంద్రం మధ్య వివాదం ఇంకా ఓ కొలిక్కి రానేలేదు. జాతీయ న్యాయ నిమామకాల కమిషన్ (ఎన్జేయేసీ)ని రద్దుచేసిన తర్వాత నియామకాలకు సుప్రీం కోరుతున్న కొలీజియం పద్ధతే కొనసాగుతున్నా... మార్గదర్శకాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. నియామక ప్రక్రియ నెమ్మదించడం వల్ల పౌరులకు సత్వర న్యాయం లభించడం లేదు. న్యాయం అందించడంలో జరిగే జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క!
రాజకీయ క్రీడల్లో బరితెగింపు
పాలనాపగ్గాలు చేపట్టాక ప్రత్యర్థి రాజకీయ పార్టీలను నిర్మూలించే పద్ధతుల్లో కొత్త పోకడలు పెరిగాయి. ప్రలోభాలతో తాయిలాలిచ్చో, బెదిరించో, భయపెట్టో పార్టీ మార్పిళ్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. సిద్ధాంత రాజకీయాలు, విలువలు సన్నగిల్లిన క్రమంలోనే అవకాశవాద రాజకీయాలూ పెరి గాయి. చట్టసభల స్పీకర్ వ్యవస్థల్ని కూడా పాలకపక్షాలు పలచన చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ ‘బి’ఫామ్‌తో ఎన్నికల్లో గెలిచి పాలకపక్షాల పంచన చేరిన వారు, మంత్రులై ప్రమాణస్వీకారం చేసిన వారు నిక్షేపంగా ఉన్నారు. వారిపై ఫిర్యాదులిచ్చి ఏళ్లు గడుస్తున్నా శిక్షలు లేవు, కానీ, గిట్టని వారి విషయంలో మాత్రం ‘సత్వర చర్యలు’ విస్మయం కలిగించాయి. ఎన్నికల కమిషన్ భుజంపై తుపాకీ పెట్టి, ‘కార్యాలయ ఆర్థిక లబ్ధి’ కారణంతో ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విమర్శలకు తావిచ్చింది. రాజ్యాసభలో అనర్హత వేటుకు నిమిషాల్లో స్పందించిన వారు లోకసభలో ఏళ్ల తరబడి ఎందుకు నాన్చుతున్నారనే ప్రశ్నకు జవాబు లేదు.
భారత రాజ్యాంగ నిర్మాణ సభనుద్దేశించి మాట్లాడుతూ మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ‘‘మన గతమంతా, అయిదువేల ఏళ్ల భారత చరిత్ర చూపులు మనపైనే ఉన్నాయి. వర్తమానంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనే దానికి గతం సాక్షీభూతమై నిలవడమే కాదు, ఇంకా రూపుదిద్దుకోని భవిష్యత్తు కూడా మనవైపే చూస్తూ ఉంటుంది’’ అన్న మాటల్ని మన పాలకులు సదా గుర్తుంచుకోవాలి.
(నేడు గణతంత్ర దినోత్సవం)
- దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment