ఇ–వ్యర్థాలను అరికట్టలేమా? | Nation Celebrates E Waste Day On Plastic Ban | Sakshi
Sakshi News home page

ఇ–వ్యర్థాలను అరికట్టలేమా?

Published Sun, Oct 13 2019 2:25 AM | Last Updated on Sun, Oct 13 2019 2:26 AM

Nation Celebrates E Waste Day On Plastic Ban - Sakshi

ఆదిమ సమాజం నుంచి నేటి అత్యాధునిక సమాజం వరకు ఒక ‘విచ్ఛిన్న ప్రవాహం’లా సాగిన ప్రకృతి మానవీకరణ క్రమంలో వివిధ చారిత్రక దశల్లో ఏర్పడిన నిర్దిష్ట సామాజికార్థిక సంక్షోభాలకు సహజాతంగా పర్యావరణ సంక్షోభాలు కూడా ఉనికిలోకి వచ్చాయి. లాభార్జనే పరమావధిగా సాగే సరకుల ఉత్పత్తి విధానం, కార్పొరేట్‌ శక్తుల అత్యాశకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ విధానాల స్థానంలో ప్రకృతికి సమాజానికి మధ్య లావాదేవీల సమతుల్యతను సాధించే ఉత్పత్తి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వస్తే తప్ప పర్యావరణ సంక్షోభానికి ఒక హేతుబద్ధ పరిష్కారం దొరకదు. పర్యావరణ సంక్షోభంపై వివిధ అంతర్జాతీయ ఒప్పందాల్ని ఆర్థిక విధానంతో సంబంధం లేకుండా వాటికవిగా అమలు చేయడం సాధ్యం కాదు.

ప్రపంచాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఇ–వ్యర్థాల నిర్వ హణ అత్యంత కీలకమైన సమస్యగా అవతరిం చింది. స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీలు, వాషింగ్‌ మెషీ న్‌లు, ఫ్రిజ్‌లు, కంప్యూ టర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి సవాలక్ష ఎలక్ట్రానిక్‌ పరికరాలు వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారి పర్యావరణ, ప్రజారోగ్య విధ్వంసానికి పాల్పడుతున్నాయి. 2019లో 5 కోట్ల టన్నుల ఇ–వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్నాయని అంచనా. ఆ వ్యర్థాల్లో సగభాగం ఆధునిక సంస్కృతికి అద్దం పడుతున్న, వ్యక్తిగ తంగా వినియోగిస్తున్న కంప్యూటర్లు, స్క్రీన్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు, ట్యాబ్లెట్స్, టీవీలు, మిగిలిన వాటిలో వేడి, చల్లబరచే వివిధ రకాల గృహోప కరణాలే. వీటి వినియోగం ద్వారా హానికర వ్యర్థాలు విడుదలవడమే కాకుండా, ఇ–సరుకుల ఉత్పత్తిలో విడుదలయ్యే హరిత గృహ వాయు వులు భూతాపం పెరుగుదలకు, పర్యవసానంగా వాతావరణ మార్పు వైపరీత్యాలకు కారణమవు  తున్నాయి. ఇ–వ్యర్థాల నిర్వహణ భౌగోళిక రాజ కీయ సవాలుగా మారి, ప్రపంచస్థాయిలో ఈ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడిన  నేపథ్యంలో  2002 ఏప్రిల్‌లో ‘వేస్ట్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌ (డబ్ల్యూఈఈఈ) అంతర్జాతీయ వేదిక ఏర్పడింది. అంతర్జాతీయ సమాజంలో ఇ–వ్యర్థాల అనర్థాలు, నియంత్రణ అవసరంపై అవగాహన పెంపొందిం చేందుకు ‘ఇంటర్నేషనల్‌ ఇ–వేస్ట్‌ డే’ను ప్రతి ఏటా అక్టోబర్‌ 14 తేదీన జరుపుకోవాలని డబ్ల్యూఈ ఈఈ వేదిక 2018లో పిలుపునిచ్చింది.

ఏటా 50 శాతం వృద్ధితో ఇ–వ్యర్థాలు పోగవు తున్నప్పటికీ గ్లోబల్‌ వ్యర్థాల్లో 20 శాతం మించి రిసైక్లింగ్‌కు నోచుకోవడం లేదు. మిగిలిన 4 కోట్ల టన్నుల వ్యర్థాలను చెత్త క్షేత్రాల్లో నిలువ చేయ డమో, భస్మం చేయడమో లేదా ప్రధానంగా వెనుక బడిన, వర్ధమాన దేశాలకు చట్టవిరుద్ధంగా ఎగు మతి చేయడమో, లేదా సముద్ర జలాల్లో పారబో యడమో జరుగుతోంది. అత్యధిక స్థాయిలో ఇ– వ్యర్థాలను సృష్టిస్తున్న అభివృద్ధి చెందిన ఉత్తరార్థ గోళ పారిశ్రామిక దేశాలు ఆ వ్యర్థాలను జీవ వైవిధ్యం మెండుగా ఉన్న దక్షిణార్థగోళ వ్యావసా యిక దేశాల్లో అన్యాయంగా పారబోస్తున్నాయి. మన దేశంలో ఏటా 18.5 లక్షల టన్నుల ఇ–వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తరవాత 3వ స్థానంలో తెలుగు రాష్ట్రాలున్నాయి. అశాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్, కంటితుడుపు చట్టాలు, లోపా యికారీ నియంత్రణ కారణంగా ఇ–వ్యర్థాల నుంచి పెద్దఎత్తున విష రసాయనాలు వెలువడుతు న్నాయి. సంపన్న దేశాలు భారత్‌ను ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల కుప్పతొట్టిగా భావిస్తూ ఏటా 50 వేల టన్నులకు పైగా ఇ–వ్యర్థాల్ని భారత్‌లో లేదా ఇక్కడి సముద్ర జలాల్లో కుప్పపోస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచం పునరుద్ధరణ సాధ్యం కాని ‘ఆకస్మిక వాతావరణ మార్పు’ దశకు చేరుకో బోతోంది. ఇ–సరకుల వినియోగం, ఉత్పత్తి విష యంలో వ్యక్తి, సంస్థాగత స్వీయ నియంత్రణలు, ప్రభుత్వ స్థాయిలో నియంత్రణ చర్యలు, అంత ర్జాతీయ ఒప్పందాల ద్వారా ఇ–వ్యర్థాలను నిరో ధించడం అసాధ్యం. ఇ–వ్యర్థాల సమస్య, హరిత గృహ వాయువులు వెలువడుతున్న కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పు ముప్పు, పారిశ్రా మిక, వ్యవసాయ కార్యకలాపాల వల్ల జల, వాయు, శబ్ద, కాంతి కాలుష్యాలు తదితర భూగో ళంపై సాగుతున్న పర్యావరణ వైపరీత్యాలన్నీ విడి విడి అంశాలు కావు. సమాజానికి, ప్రకృతికి మధ్య జరిగే లావాదేవీల సమతుల్యత దెబ్బతిన్నందువల్ల ఏర్పడిన పర్యావరణ సంక్షోభంలో ఈ వైపరీత్యా లన్నీ విడదీయరాని అంతర్భాగాలే.

ఆదిమ సమాజం నుంచి నేటి అత్యాధునిక సమాజం వరకు ఒక ‘విచ్ఛిన్న ప్రవాహం’లా సాగిన ప్రకృతి మానవీకరణ క్రమంలో వివిధ చారి త్రక దశల్లో ఏర్పడిన నిర్దిష్ట సామాజికార్థిక సంక్షోభాలకు సహజాతంగా పర్యావరణ సంక్షో భాలు కూడా ఉనికిలోకి వచ్చాయి. పర్యావరణ సంక్షోభంపై వివిధ అంతర్జాతీయ ఒప్పందాలు, వినిమయ సంస్కృతిని సంస్కరించే ప్రయత్నాలు, ప్రభుత్వాల నిషేధాలు, నిబంధనలన్నీ ఆర్థిక విధా నంతో సంబంధం లేకుండా వాటికవిగా అమలు చేయడం సాధ్యం కాదు. ఐక్యరాజ్యసమితి దేశాధినేతల సమావేశాన్ని ఉద్దేశించి వాతావరణ మార్పును అరికట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రపంచ ఖ్యాతిని గడించిన బాలిక గ్రెటా థెన్‌బర్గ్‌ చేసిన ప్రసంగం... భవిష్యత్‌ చిత్రానికి అద్దం పడుతోంది. లాభార్జనే పరమావధిగా సాగే సరకుల ఉత్పత్తి విధానం, కార్పొరేట్‌ శక్తుల అత్యాశకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ విధానాల స్థానంలో ప్రకృతికి సమాజానికి మధ్య లావాదేవీల సమతుల్యతను సాధించే ఉత్పత్తి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వస్తే తప్ప పర్యావరణ సంక్షోభానికి ఒక హేతుబద్ధ పరిష్కారం దొరకదు.


(అక్టోబర్‌ 14న అంతర్జాతీయ ఇ–వేస్ట్‌ డే సందర్భంగా)
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
వెన్నెలకంటి రామారావు
మొబైల్‌ : 95503 67536

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement