గుజరాత్‌ మోడల్‌పై గోడలెందుకు? | Why Narendra Modi Make Walls In Ahmedabad | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ మోడల్‌పై గోడలెందుకు?

Published Sat, Feb 22 2020 3:03 AM | Last Updated on Sat, Feb 22 2020 9:36 AM

Why Narendra Modi Make Walls In Ahmedabad - Sakshi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గుజరాత్‌ సందర్శన సమయంలో అహ్మదాబాద్‌లోని దారిద్య్రాన్ని కనుమరుగు చేయడానికని అక్కడిగుడిసెవాసుల నివాసాల చుట్టూ గోడలు నిర్మిస్తున్నారు. కానీ పేద ప్రజలు నివసించే ప్రాంతాల చుట్టూ గోడలతో దడి గట్టడం అంతర్జాతీయంగా మన ప్రతిష్టను మెరుగుపర్చదు. అది మన బలహీనతనే తప్ప మన బలాన్ని వెల్లడించదు. ప్రభుత్వ దృష్టి నిరుపేద గుడిసెవాసులు, పల్లెప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడంపై లేదు. ట్రంప్‌ వస్తాడు వెళతాడు కానీ గుజరాత్‌ శ్రామిక ప్రజల దారిద్య్రాన్ని దాచి ఉంచడానికి అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్న ఆ గోడలు కూలిపోకుండా అలాగే ఉండిపోవడమే కాకుండా గుజరాత్‌ లోనూ, ఢిల్లీలోనూ మోదీ ప్రభుత్వ వాస్తవ గాధను చాలా కాలంపాటు ప్రపంచానికి తెలుపుతూనే ఉంటాయి.

నమస్తే ట్రంప్‌ సభను ఉద్దేశించి ప్రసంగించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ ఏ హైదరాబాద్‌కో, విశాఖపట్నంకో, బెంగళూరుకో, చెన్నైకో లేక కొచ్చిన్‌కో వస్తున్నాడని ఊహించుకుందాం. విమానాశ్రయం నుంచి తాను బస చేసే హోటల్‌కి లేక సభాప్రాంతానికి ట్రంప్‌ వెళ్లే మార్గంలో ఉన్న గుడిసెల చుట్టూ గోడలు నిర్మించే అవసరం ఈ నగరాలకు ఉండదు. కానీ గుజరాత్‌లోని అçహ్మదాబాద్‌లో మాత్రం మురికివాడల చుట్టూ గోడలు కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మార్గమంతా పూరిగుడిసెల మయమే మరి. పైగా అవి చూడటానికి చాలా ఘోరంగా కనిపిస్తాయి. అందుకే గుజరాత్‌ నమూనా వెనుక మిగిలిపోయి ఉన్న దారిద్య్రాన్ని, మురికివాడల జీవితాన్ని మరుగున ఉంచడానికి వాటి చుట్టూ గోడలు కట్టాలని ప్రధాని నరేంద్రమోదీ కోరుకున్నారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సిని మాలో చూపినట్లుగానే మురికివాడల జీవితం మన అభివృద్ధి కథ గుట్టు విప్పుతుంది మరి.

ఇది మరింత ప్రాథమిక సమస్యను లేవనెత్తుతుంది. 12 ఏళ్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ.. ఆయన తర్వాత తాను ఎంపిక చేసిన ముఖ్యమంత్రులు కలిసి ఎలాంటి అభివృద్ధి నమూనాను నిర్మిం చిపెట్టారు? పేదల జీవన పరిస్థితులను మెరుగుపర్చడంలో దక్షిణ భారతీయ రాష్ట్రాల రాజధాని నగరాలతో అహ్మదాబాద్‌ ఊహా మాత్రంగా కూడా సరిపోలలేదన్నది వాస్తవం. గుజరాత్‌ అభివృద్ధి నమూనాపై ఆరేళ్లుగా జాతీయ ప్రచారం చేస్తున్న తర్వాత కూడా గుజరాత్‌ వాస్తవ పరిస్థితి ఇదే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ మీడియా, ఆరెస్సెస్‌/బీజేపీ చేసిన ప్రచారధాటిని ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారత్‌లో కర్ణాటక కూడా నమ్మి ఆ నమూనాకు ఓటే సాయి. ఆరేళ్లు దాటిన తర్వాత కూడా గుజరాత్‌ మోడల్‌ వాస్తవ పరి స్థితి ఇలాగే ఉందా? ఇది మీడియా కల్పన కథనే తెలుపుతుంది.

నిస్సందేహంగా గుజరాత్‌లో అనేక అగ్రశ్రేణి పరిశ్రమలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందు పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ పట్ల అసంతృప్తితో ఈ పరిశ్రమదారులంతా మోదీ, బీజేపీలను బలపర్చారు. కాంగ్రెస్‌ అవినీతి, కుటుంబ అజమాయిషీ సమస్యల్లో చిక్కుకుపోయింది. ఆ సమయంలో బీజేపీ పాలనలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ పురోగతి చెంది తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు ఊహించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్న వారిలో కొందరు ఇప్పుడు 2014లో ఊహించినదానికంటే అధికంగా సంపదను పొందారు. కానీ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సరిగాలేదు, చాలా పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. కానీ మోదీ ప్రభుత్వం, ఢిల్లీలో పాలకపార్టీ రెండూ కూడా తమ పాలనా కాలంలోనే అటు ట్రంప్‌ దృష్టిలోనూ, ఇటు అంతర్జాతీయ మీడియా దృష్టిలోనూ పడకుండా గుజరాత్‌ దారిద్య్రాన్ని మరుగున ఉంచడానికి మురికివాడల చుట్టూ గోడలు కట్టడాన్ని ఎలా సమర్థించుకుంటాయి? భారత్‌లో కూడా మీడియా ఇప్పుడు తన బాధ్యతను గుర్తిస్తోందన్నది వాస్తవం.

దక్షిణ భారత రాష్ట్రాలు మురికివాడల్లో నివసించేవారికి రెండు పడకగదులను ఇచ్చినట్లుగా గుజరాత్‌ ప్రభుత్వం, మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా.. ఈనాటికీ అహ్మదాబాద్‌ గుడిసెవాసులకు ఇవ్వలేకపోయాయి. కానీ అమెరికా అధ్యక్షుడు అహ్మదాబాద్‌ సందర్శనకు వచ్చినప్పుడు మురికివాడలు కనిపిస్తే తమ ప్రభుత్వానికి, దేశానికి కూడా అవమానకరం అని ఆలోచించాయి. దేశసంపదలో భారీ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అంబానీ, అదానీ వంటి గుజరాత్‌ సంపన్న పారిశ్రామికవేత్తలు ఉండి కూడా దేశంలోనే అత్యంత పారిశ్రామికీకరణ చెందిన భారతీయ రాష్ట్రం తన రాజధాని ప్రాంతంలో పేదరికాన్ని, దారిద్య్రాన్ని పారదోలలేకపోయాయి. అదే సమయంలో అంబానీ, అదానీలు భారతీయ పేదలకు తమ సంపదలో కొంత భాగాన్ని కూడా పంచిపెట్టలేకపోయింది. దేశంలోని పేదల పట్ల కనీస నైతిక నిబద్ధత కూడా వీరికి లేదు. హిందుత్వ నీతి కూడా వారిని అలా చేయాలని డిమాండ్‌ చేయదు.

2018 మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారతీయ రాష్ట్రాల్లో గుజ రాత్‌ 22వ స్థానంలో నిలిచింది. కానీ సరిగ్గా ఆరేళ్ల క్రితం అభివృద్ధి నమూనాగా చూపించబడి దేశవ్యాప్తంగా ప్రచారమైన గుజరాత్‌ ఇప్పుడు అన్ని విధాలుగా తన నిజస్థితిని బయటపెట్టుకుంటోంది. స్వయంగా మోదీని గుజరాత్‌ నమూనా ప్రచారానికి మళ్లించిన ఆరెస్సెస్‌/బీజేపీ సైతం గుజరాత్‌ వృద్ధి నమూనాను దేశం నమ్మడం లేదని గ్రహించాయి కాబట్టే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికతో మతకార్డును తీసుకొచ్చాయి. కానీ ఈ ఎజెండా సైతం విదేశాలనుంచి మరింత విమర్శల పాలయింది. భారతీయ ముస్లింలు రాజ్యరహితులుగా మారవచ్చని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీనే ప్రకటించారు. ఇది ఐక్యరాజ్యసమితి భారత్‌ పట్ల చేసిన తీవ్రమైన అంచనా. ప్రపంచ దేశాల మధ్య భారత్‌ సాధించిన ఈ తరహా ప్రతిష్ట పట్ల జాతి మొత్తంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది.

అయితే ఈనాటి ప్రపంచం అలాంటి మతపరమైన ఎజెండాలను తిరస్కరిస్తోంది. పైగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం, అతి పురాతన ప్రజాస్వామ్యం మతపరమైన కార్డులను ధరించి వ్యవహారాలను చేయలేవు. ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా తన ప్రజాస్వామ్యాన్ని లౌకిక సరిహద్దుల వెలుపలికి నెడుతుండగా భారతదేశం కూడా మతనియంతృత్వ క్రమంలోకి అడుగేస్తోంది. అమెరికా ఫస్ట్, ఇండియా ఫస్ట్‌ నినాదంతో ట్రంప్, మోదీ ఇద్దరూ ఎన్నికల్లో గెలిచినప్పటికీ, అమెరికా మాత్రం తన జాతీయ నిరుద్యోగితా రేటును బాగా తగ్గించివేసింది. ఇప్పుడు అమెరికాలో నిరుద్యోగిత రేటు 50 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోగా మోదీ హయాంలో భారతీయ నిరుద్యోగితా రేటు 40 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.

అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సరిహద్దుల పొడవునా ఇనుప గోడలు నిర్మిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ వాగ్దానం చేసినప్పటికీ, డెమాక్రాట్ల నుంచి బలమైన వ్యతిరేకత కారణంగా అలాంటి గోడలను ట్రంప్‌ వాస్తవంగా నిర్మించలేకపోయాడు. అమెరికాలో ప్రతి పక్షం ప్రస్తుతం ఎంత బలంగా ఉందంటే కాంగ్రెస్‌లో ట్రంప్‌ అభిశంసనకు గురయ్యాడు కానీ కేవలం ఆరు ఓట్ల తేడాతో సెనేట్‌లో గెలవడం ద్వారా అధికారాన్ని వదులుకోవలసిన పరిస్థితి నుంచి బయటపడ్డాడు. అయితే దేశంలో పెరుగుతున్న దారిద్య్రాన్ని ట్రంప్‌ కంట పడకుండా మరుగున పడవేయడానికి మోదీ మురికివాడల చుట్టూ గోడలు కడుతున్నా, దాన్ని ఎదుర్కొనేంత బలమైన ప్రతిపక్షం లేదు. మోదీ ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని విమర్శిస్తున్నవారు ఎంత పెద్దవారైనా సరే వారిపై దేశద్రోహులనే ముద్ర వేస్తున్నారు. ఈ తరహా జాతీయవాదం దేన్ని సూచిస్తోంది?

జాతీయవాద ఉల్లాసస్థితి నడుమన దేశంలోని ప్రజలు గుడిసెల్లో నివసించడం యధాతథంగా ఎలా కొనసాగుతోంది? బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ఉత్తర భారతదేశంలో దారిద్య్రం, దుస్థితి ప్రతిచోటా కనబడుతూ ఉంటుంది. బీజేపీకి అవకాశం కల్పించని దక్షిణ భారతదేశంలో ఇలాంటి పరిస్థితి వాస్తవంగానే లేదు. దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్న ఎవరైనా సరే.. అక్కడ మంచి జీవన పరిస్థితులను, ఆరోగ్య స్థాయిలను, చక్కటి గృహ వసతులను చూడగలుగుతారు. పైగా సామాజిక జీవితంలో వైవిధ్యతకు దక్షిణ భారతదేశం చాలా ఉత్తమంగా వీలు కల్పిస్తూండటం గమనార్హం. జాతీయవాద నైతికత అంటే ఏమిటి? అసమానతలను, దోపిడీని తగ్గించడం జాతీయవాద పార్టీ, దాని నాయకుడి ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. ఉత్పత్తిలో పాల్గొనే ప్రజారాశుల జీవనాన్ని మెరుగుపర్చే అలాంటి ప్రాథమిక సమస్యపట్ల దేశం ఎందుకు దృష్టి సారించడం లేదు. పేదల గుడిసెల చుట్టూ గోడలతో దడి గట్టడం అంతర్జాతీయంగా మన ప్రతిష్టను మెరుగుపర్చదు.

ఒకవైపు ప్రధాని మోదీ భారతదేశాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకుపోవడంపై మాట్లాడుతుంటారు. మరొకవైపున దారిద్య్రాన్ని మరుగుపర్చడానికి గోడలు కడుతున్నారు. కాల్పనిక వనరుల నుంచి సంపదను ఎవరూ సృష్టించలేరు. ప్రజారాసులు పనిచేయాలి, సంపదను సృష్టించాలి. వారు తీసుకుంటున్న తిండి, జీవన పరిస్థితులు, గృహ, విద్యా వసతులు కాస్త మంచిగా ఉండాలి. ప్రభుత్వ దృష్టి మొత్తంగా నిరుపేద గుడిసెవాసులు, పల్లెప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడంపై లేదు. ట్రంప్‌ వస్తాడు వెళతాడు కానీ,  దారిద్య్రాన్ని దాచి ఉంచడానికి అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్న ఆ గోడలు కూలిపోకుండా ఉండిపోవడమే కాకుండా గుజరాత్‌లోనూ, ఢిల్లీలోనూ మోదీ ప్రభుత్వ వంచనాత్మక గాథను చాలా కాలంపాటు ప్రపంచానికి తెలుపుతూనే ఉంటాయి.


వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ 
ప్రొ. కంచ ఐలయ్య
షెపర్డ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement