పదోరోజు 40 లక్షలు
తెలంగాణలో ఘాట్‌లకు కొనసాగిన భక్తుల తాకిడి
సాక్షి నెట్‌వర్క్: గోదావరి మహా పుష్కరాల్లో పదో రోజు సైతం భక్తుల తాకిడి కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి 9 వరకు దాదాపు 40 లక్షల మందికిపైగా పుష్కర స్నానాలు ఆచరించారు. కరీం నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా లెక్కచేయకుండా ఉదయం నుంచే వేలాది మంది భక్తులు పుష్కర ఘాట్ల వద్ద బారులు తీరారు. పుష్కరాలకు ఇక మిగిలింది రెండు రోజులే కావడంతో శుక్ర, శనివారాల్లో పుష్కర ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ధర్మపురిలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కాళేశ్వరంలో మంత్రి హరీశ్‌రావు కుటుంబసభ్యులతో కలసి పుష్కర స్నానం చేశారు.
గంటలకొద్దీ క్యూ..: ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సుమారు 7 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. జిల్లాలోని సోన్‌ఘాట్ వద్ద సాయంత్రం నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. మణుగూరులోని ఘాట్లను మంత్రి తుమ్మల, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఏపీలోని నర్సారావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబసమేతంగా చిన్నరావిగూడెంలో పుష్కరస్నానం ఆచరించారు. భద్రాచలంలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం పుష్కరస్నానం చేసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సతీసమేతంగా భద్రాచలంలో పుష్కరస్నానం చేశారు.
అప్రమత్తంగా ఉండండి: సీఎం
గోదావరి పుష్కరాలు శుక్ర, శనివారాలతో ముగుస్తున్నందున భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని.. సంబంధిత మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కాగా, పుష్కరాలకు అదనపు పోలీసు బలగాలను దించినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.
పుష్కర స్నానానికి సండ్రకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు పుష్కర స్నానం ఆచరించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సండ్రకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్కర స్నానానికి అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టును సండ్ర ఆశ్రయించారు.
‘పుష్కర’ సిబ్బందికి 27, 28న సెలవు
సాక్షి, హైదరాబాద్: పుష్కరఘాట్ల వద్ద సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రత్యేక సెలవులు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రకటించారు.