సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలలు రానున్నాయి. ఆయా కాలేజీలకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రభుత్వాల పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కొత్తగా వచ్చేవాటిలో ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఒక కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రెండు కళాశాలలకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, మరో రెండు కళాశాలలకు సంబంధించి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నట్లు వైద్యవిద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కాగా అన్ని కళాశాలల యాజమాన్యాలు 150 ఎంబీబీఎస్ సీట్లకు తక్కువ కాకుండా దరఖాస్తు చేసుకున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కొత్తగా మరో కళాశాలలు ఏర్పాటైతే ఎంసీఐ అనుమతులను బట్టి 350 నుంచి 450 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. తెంగాణలో కూడా మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
‘108’ అంబులెన్స్‌లను నిర్వహిస్తున్న జీవీకే సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది.
హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఒకటి, నెల్లూరు జిల్లాలో మరో కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ‘అపోలో’ యాజమాన్యం చిత్తూరు జిల్లాలో ప్రైవేటు వైద్య కళాశాల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. కళాశాలకు క్లినికల్ అటాచ్‌మెంట్ పేరుతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని మూడేళ్లు లీజుకిచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం విదితమే.
విజయనగరం జిల్లాలో మన్‌సాస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యాజమాన్యం కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ విజయనగరం ప్రభుత్వాసుపత్రిని క్లినికల్ అటాచ్‌మెంట్ కింద తీసుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోతే సొంతంగా ఆస్పత్రిని నిర్మించి, వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కొత్తగా 4 వైద్య కళాశాలలు!
Published Sun, Jul 26 2015 2:36 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
Advertisement
Advertisement