గోదారి.. భక్తజనఝరి
పదకొండో రోజూ ఏపీలో పోటెత్తిన భక్తులు.. 38 లక్షల మంది పుష్కర స్నానాలు
సాక్షి, రాజమండ్రి: పుష్కర పుణ్య స్నానాలకు పదకొండో రోజు వచ్చిన భక్తులతో గోదావరి తీరం పరవళ్లు తొక్కింది. శుక్రవారం ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన ఘాట్‌లకన్నా గ్రామీణ ఘాట్‌లలో భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని కోటిపల్లి, సోంపల్లి, అంతర్వేది ఘాట్లలో భక్తుల తాకిడి కనిపించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే రాజమండ్రిలోని పుష్కర, కోటిలింగాల, కొవ్వూరు, నర్సాపురం ఘాట్‌లలో భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది.
చివరి రెండు రోజులూ కనీసం కోటిమంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసినా ఆ స్థాయిలో భక్తులు రాలేదు. రాజమండ్రి వీఐపీ ఘాట్లో మద్రాసు హైకోర్టు జడ్జిలు జస్టిస్ వి.రమా సుబ్రహ్మణ్యన్, జస్టిస్ కేవీకే వాసుకి, సినీ నటులు జమున, తనికెళ్ల భరణి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పుష్కర స్నానమాచరించారు.
38 లక్షల మంది పుష్కర స్నానాలు: అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయానికి ఉభయ గోదావరి జిల్లాల్లో 38 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 26 లక్షలు పశ్చిమ గోదావరిలో 12 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారని అధికారులు వెల్లడించారు. కాగా మరో నాలుగైదు లక్షల మంది భక్తులు స్నానాల కోసం వేచి ఉన్నారు.
దివంగత నటులకు జమున పిండప్రదానం
వీఐపీ ఘాట్ (రాజమండ్రి): సినీ రంగంలో తన ఉనికికి, ఉన్నతికి కారణమైన దివంగత సహచర నటులకు అలనాటి నటి జమున పిండ ప్రదానం చేసి తమ సినీ బంధాన్ని చాటుకున్నారు. దివంగత నటీ మణులు కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, రాజబాబు, పద్మనాభం తదితరులకు జమున వీఐపీ ఘాట్‌లో శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చనిపోయిన తన సమకాలీన నటులకు పుష్కరాల్లో పిండప్రదానం చేయడం ఎంతో తృప్తిగా ఉందన్నారు. తాను రాజమండ్రి ఎంపీగా ఉన్న సమయంలో 1991 పుష్కరాల పనులకు ఎంపీ నిధుల నుంచి రూ.11 కోట్లు కేటాయించానని చెప్పారు.