సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు తొలి రోజు జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 29 మంది మృతి చెందిన సంఘటన మరువకముందే.. ఇంకా పెద్దకర్మలు పూర్తిగాక ముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సన్మానాలు, విందు భోజనాలు, బాణసంచా పేలుళ్లతో వేడుకలు జరుపుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు కారణంగా తొక్కిసలాటకు దారితీసినట్లు తేలినప్పటికీ అదే ముఖ్యమంత్రి సన్మానాలు, ఆర్భాటాలకు నాంది పలకడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది.
పుష్కరాలు చివరి రోజైన శనివారం హారతి కోసం ఏకంగా రూ.25 లక్షలతో సెట్టింగ్.. చిత్రీకరించడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు మసకబారక ముందే ముఖ్యమంత్రే విందు భోజ నాలకు తెరతీయడంపై సాధారణ ప్రజానీకంలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. శనివారం నిర్వహించే హారతితోనూ, ఆదివారం నిర్వహించే సన్మానాలు, బాణసంచా పేలుళ్లతోనూ 29 మంది మృతి చెందారనే విషయం కనుమరుగయ్యేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఒక మంత్రి వ్యాఖ్యానించారంటే ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
26న పెద్ద ఎత్తున బాణసంచా పేలుళ్లకు ఏర్పాట్లు చేశారు. పుష్కర విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సన్మాన, ప్రశంసా పత్రాల్ని సీఎం అందజేయనున్నారు. ఆ తరువాత విందు ఆరగించనున్నారు. ఇందు కు దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయో నిధిని ప్రభుత్వం దారి మళ్లించింది. ఆలయాల పునరుద్ధరణకు వినియోగించాల్సిన రూ.15 కోట్లను పుష్కర ఖర్చులకు సర్కారు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర శుక్రవారం జీవో జారీ చేశారు.
‘తొక్కిసలాట’ మరువక ముందే విందులా..!
Published Sat, Jul 25 2015 3:53 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement