సాక్షి, హైదరాబాద్: అనుమానించిందే జరుగుతోంది... పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాట ఉదంతంలో ‘ముఖ్య’నేతపై ఎలాంటి మచ్చ రాకుండా ఏపీ మంత్రులు, అధికారులు పావులు కదుపుతున్నారు. పుష్కరాలు ముగింపునకు రావడంతో ఓ పక్క విద్రోహకోణాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు ఈ దుర్ఘటన పూర్వాపరాలను స్పష్టం చేసే ప్రాథమిక ఆధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్‌లు మాయం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 29 మంది మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీఐపీ ఘాట్‌ను వదిలి ఈ ఘాట్‌లో పుష్కరాలను ప్రారంభిస్తూ స్నానం చేయడంతో దాదాపు రెండు గంటల పాటు భక్తుల్ని ఆపాల్సి వచ్చిందనేది ఇప్పటికే స్పష్టమైంది. మరోపక్క నేషనల్ జియోగ్రఫీ చానల్ ద్వారా డాక్యుమెంటరీ రూపకల్పన కోసం జనాలను ఎక్కువసేపు ఆపారనీ ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
తొక్కిసలాట జరిగినప్పుడు సీఎం అక్కడే ఉన్నారంటూ ఓ అధికారి సైతం మీడియాతో ప్రకటించారు. ఈ ఘోర నిర్లక్ష్యంపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మినహా ఉన్నతస్థాయి విచారణ ఇంకా ప్రారంభంకాలేదు. శనివారంతో పుష్కరాలు ముగియనుండటంతో సోమవారం నుంచి దర్యాప్తు ఊపందుకోవడంతో పాటు ఉన్నత స్థాయి విచారణ ప్రారంభానికి సన్నాహాలు చేయడం అనివార్యంగా మారింది. ఈ కీలక సమయంలో అటు ప్రభుత్వం ‘కొత్త కోణాలను’ వెలుగులోకి తెస్తుండగా... ఇటు అధికార యంత్రాంగం వ్యూహాత్మకంగా ‘కొన్ని అంశాలను’ తెరమీదికి తీసుకువస్తోంది.
పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాట వెనుక విద్రోహకోణం ఉందంటూ దాదాపు పది రోజుల తరవాత కొందరు మంత్రులు కొత్త వాదన మొదలెట్టారు. దీనికి కొనసాగింపుగా ఆ ఉదంతానికి, డాక్యుమెంటరీ చిత్రీకరణకు సంబంధం లేదంటున్నారు. తొక్కిసలాటపై ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైతే ఆ రోజు ఏం జరిగిందో తెలియడానికి పుష్కర ఘాట్‌తో పాటు వివిధ చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ ఎంతో కీలకం.
ఈ ఉదంతంలో సాక్షాత్తు చంద్రబాబు పైనే ఆరోపణలు రావడంతో ఈ సీసీ కెమెరా ఫీడ్ యధాతథంగా విచారణాధికారికి చేరితే నిజాలు వెలుగులోకి వచ్చి ఇబ్బందులు తప్పవని యంత్రాంగం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్కరాల ప్రారంభం రోజున ఘాట్లతో సహా పలు చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయిందని, ఆయా చోట్ల ఉన్న సీసీ కెమెరాలు పని చేయలేదని ప్రచారం ప్రారంభించింది. ఈ పేరుతో కొన్ని ‘కీలక ప్రాంతాల్లో’ ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను మాయం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వ్యూహాత్మకంగా ఆధారాలు మాయం!
Published Sat, Jul 25 2015 3:52 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement