సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ రహదారులుగా ఉండి, వాహనాల రద్దీ తట్టుకోలేకపోతున్న రోడ్లను విస్తరించాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఢిల్లీకి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టింది.
గత ఆర్థిక సంవత్సరంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం అనుమతించడంతో వాటి డీపీఆర్‌ల తయారీ, టెండర్ల పనులు మొదలైన విషయం తెలిసిందే. అవి కొనసాగుతుండగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విస్తరణ పనుల అనుమతుల కోసం అధికారులు శ్రీకారం చుట్టారు.
4 లేన్లుగా సిద్దిపేట–సిరిసిల్ల రోడ్డు
మహబూబ్‌నగర్–జడ్చర్ల రోడ్డును 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు మెరుగ్గానే ఉన్నా భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా విస్తరించాలని జాతీయ రహదారుల విభాగం నిర్ణయించింది. అలాగే సిద్దిపేట–సిరిసిల్ల రోడ్డునూ 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు అత్యంత నాసిరకంగా ఉండటం, పెద్దపెద్ద గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో అత్యవసరంగా బాగు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డును కూడా 4 వరుసలుగా విస్తరించనున్నారు. మెదక్–బోధన్, మెదక్–సిద్దిపేట రోడ్లను 10 మీటర్లకు విస్తరించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన ప్రతిపాద నలు సిద్ధం చేస్తున్నామని, త్వరలో ఢిల్లీ పంపుతామని జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి తెలిపా రు. ఈ ఆర్థిక సంవత్సరమే వీటికి అనుమతులు తీసుకొచ్చి పనులు మొదలయ్యేలా చూస్తామని వెల్లడించారు.
ఉప్పల్, అంబర్‌పేట్‌లలో ఫ్లైఓవర్లు
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.3,500 కోట్లతో పనులు జరుగుతున్నాయి. కోదాడ–ఖమ్మం–మహబూబాబాద్, సిరోంచ–ఆత్మకూ రు, జగిత్యాల–కరీంనగర్–వరంగల్, కోదాడ–ఖమ్మం, నిజామాబాద్–జగదల్పూర్, నకిరేకల్–తానంచెర్ల, హగ్గరి–జడ్చర్ల, తిరుమలగిరి–సూర్యాపేట, జనగామ–తిరుమలగిరి, జడ్చర్ల–కల్వకుర్తి, జడ్చర్ల–మల్లేపల్లి మధ్య పనులు మొదలయ్యాయి.
ఇవి కాకుం డా రూ.8 వేల కోట్లతో జాతీయ రహ దారుల ప్రాధికార సంస్థ పనులు చేపట్టింది. కొన్ని భూ సేకరణ స్థాయిలో ఉండగా మరికొన్నింటి పనులు మొదలయ్యాయి. ఉప్పల్, అంబర్‌పేట, అరాంఘర్ తదితర ప్రాంతాల్లో భారీ ఫ్లైఓవర్లను కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment