Expansion of roads
-
బాట‘సారీ’!
ఆకివీడు: జిల్లాలో జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. విస్తరణ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. గుండుగొలను నుంచి కొవ్వూరు వరకూ జాతీయరహదారి విస్తరణ పనులు మాత్రం జరుగుతున్నాయి. మిగిలిన జాతీయ రహదారుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అవి ప్రతిపాదనలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. గత ఏడాది కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆకివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ పనులకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. జిల్లా ద్వారా వెళ్లే పామర్రు–దిగమర్రు జాతీయరహదారి(నంబర్ 216)తోపాటు దేవరపల్లి–కొయ్యలగూడెం(నంబర్ 516డీ) జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా.. పనులు మొదలు కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత లేదు. ఆకివీడులో పామర్రు–దిగమర్రు రోడ్డుకు వేసిన శిలాఫలకం కూడా మట్టికొట్టుకుపోయింది. ప్రయాణికులకు చుక్కలు.. జాతీయ రహదారులు 216, 516డీలపై ప్రయాణం వాహనచోదకులు, ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ప్రధానంగా దేవరపల్లి– జీలుగుమిల్లి రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. పామర్రు–దిగమర్రు రహదారి కూడా అధ్వానంగా మారింది. కనీసం వీటికి మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. ఈ రహదారులపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఆసక్తి చూపడం లేదు. 216 జాతీయ రహదారి ప్రతిపాదనలు ఇవీ.. 216 జాతీయ రహదారిని పామర్రు నుంచి దిగమర్రు వరకూ 108 కిలోమీటర్ల మేర విస్తరించాల్సి ఉంది. జిల్లాలో దీని విస్తీర్ణం 46 కిలోమీటర్లు. దీనికి తొలిదశలో రూ.500 కోట్లు కేటాయించారు. ఆకివీడు, ఉండి, భీమవరం, కైకలూరు ప్రాంతాల్లో రహదారి విస్తరణలో భాగంగా బైపాస్‌లు నిర్మించాలి. ఆకివీడు వద్ద బైపాస్ రోడ్డుకు ఉప్పుటేరుపై వంతెన, వెంకయ్య వయ్యేరుపై మరో వంతెన నిర్మించాల్సి ఉంది. ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి ఆగస్టు నెలలో మట్టి పరీక్షలు చేశారు. ఇదే రహదారితోపాటు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జిల్లాలో నేషనల్ హైవే నంబర్–5 నుంచి బైపాస్ రహదారిగా ఉన్న దేవరపల్లి–గోపాలపురం–కొయ్యలగూడెం ఎన్‌హెచ్ రహదారి(516డీ) అభివద్ధికి కూడా అప్పట్లో డిజిటల్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి 20 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు, పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.93 కోట్లు విడుదలయ్యాయి. ఈ జాతీయ రహదారులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉన్నంత కాలం ఇవి అభివృద్ధికి నోచుకోవని పెదవి విరుస్తున్నారు. వాహనాలకు దెబ్బే.. 216 జాతీయ రహదారి అధ్వానంగా ఉంది. వాహనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తున్న జాతీయ రహదారుల శాఖ రహదారులను అభివద్ధి చేయడంలేదు. కేంద్రం ప్రభుత్వం, ఏంపీలు పట్టించుకోవాలి. – కురెళ్ల పౌలు, లారీ డ్రైవర్, దుంపగడప నరకం చూస్తున్నాం.. 216 జాతీయరహదారిపై ప్రయాణం నరకం చూపిస్తోంది. ఆకివీడు నుంచి భీమవరం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది. పంచాయతీ రోడ్లను తలపిస్తోంది. ఇరుకురోడ్లు, గతుకు, గుంతలతో ఎన్నాళ్లీ అవస్థలు. – లావేటి త్రిమూర్తులు, ప్రయాణికుడు, చెరుకుమిల్లి ప్రతిపాదనలు వెళ్లాయి.. జాతీయరహదారి నంబర్ 216 విస్తరణ, బైపాస్ రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.500 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. దేవరపల్లి– జీలుగుమిల్లి జాతీయ రహదారి అభివృద్ధికి రూ.93 కోట్లతో టెండర్లు పిలిచాం. టెండర్లు ఖరారైన తరువాత రహదారి పనులు మొదలుపెడతారు. – మునగళ్ల శ్రీనివాసరావు, డీఈఈ, ఎన్‌హెచ్ 216, భీమవరం -
5 జాతీయ రహదారుల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ రహదారులుగా ఉండి, వాహనాల రద్దీ తట్టుకోలేకపోతున్న రోడ్లను విస్తరించాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఢిల్లీకి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం అనుమతించడంతో వాటి డీపీఆర్‌ల తయారీ, టెండర్ల పనులు మొదలైన విషయం తెలిసిందే. అవి కొనసాగుతుండగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విస్తరణ పనుల అనుమతుల కోసం అధికారులు శ్రీకారం చుట్టారు. 4 లేన్లుగా సిద్దిపేట–సిరిసిల్ల రోడ్డు మహబూబ్‌నగర్–జడ్చర్ల రోడ్డును 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు మెరుగ్గానే ఉన్నా భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా విస్తరించాలని జాతీయ రహదారుల విభాగం నిర్ణయించింది. అలాగే సిద్దిపేట–సిరిసిల్ల రోడ్డునూ 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు అత్యంత నాసిరకంగా ఉండటం, పెద్దపెద్ద గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో అత్యవసరంగా బాగు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డును కూడా 4 వరుసలుగా విస్తరించనున్నారు. మెదక్–బోధన్, మెదక్–సిద్దిపేట రోడ్లను 10 మీటర్లకు విస్తరించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన ప్రతిపాద నలు సిద్ధం చేస్తున్నామని, త్వరలో ఢిల్లీ పంపుతామని జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపా రు. ఈ ఆర్థిక సంవత్సరమే వీటికి అనుమతులు తీసుకొచ్చి పనులు మొదలయ్యేలా చూస్తామని వెల్లడించారు. ఉప్పల్, అంబర్‌పేట్‌లలో ఫ్లైఓవర్లు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.3,500 కోట్లతో పనులు జరుగుతున్నాయి. కోదాడ–ఖమ్మం–మహబూబాబాద్, సిరోంచ–ఆత్మకూ రు, జగిత్యాల–కరీంనగర్–వరంగల్, కోదాడ–ఖమ్మం, నిజామాబాద్–జగదల్పూర్, నకిరేకల్–తానంచెర్ల, హగ్గరి–జడ్చర్ల, తిరుమలగిరి–సూర్యాపేట, జనగామ–తిరుమలగిరి, జడ్చర్ల–కల్వకుర్తి, జడ్చర్ల–మల్లేపల్లి మధ్య పనులు మొదలయ్యాయి. ఇవి కాకుం డా రూ.8 వేల కోట్లతో జాతీయ రహ దారుల ప్రాధికార సంస్థ పనులు చేపట్టింది. కొన్ని భూ సేకరణ స్థాయిలో ఉండగా మరికొన్నింటి పనులు మొదలయ్యాయి. ఉప్పల్, అంబర్‌పేట, అరాంఘర్ తదితర ప్రాంతాల్లో భారీ ఫ్లైఓవర్లను కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
బల్దియా బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్ : రహదారుల విస్తరణ.. ఫ్లైఓవర్ల నిర్మాణం.. జంక్షన్ల అభివృద్ధి తదితర పనుల్లో అవసరమైన ఆస్తుల సేకరణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆస్తులిచ్చేవారికి అభివృద్ధి బదలాయింపు హక్కు(టీడీఆర్) ప్రయోజనాల్ని పెంచనున్నారు. బిల్టప్ ఏరియాను 400 శాతానికి పెంచడంతోపాటు అదనంగా రెండంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. ఈ మేరకు ముసాయిదా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆమోదంతో త్వరలో జీవో వెలువడనుంది. ఆస్తులిచ్చేవారికి ప్రయోజనాలు ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా పలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఆయా మార్గాల్లో రహదారుల విస్తరణకూ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 57 మార్గాల్లో రోడ్ల విస్తరణకే దాదాపు 450 ఆస్తుల్ని సేకరించాల్సి ఉంది. నష్టపరిహారం చెల్లించడానికి దాదాపు రూ.1,100 కోట్లు కావాలి. ఎస్సార్డీపీకి అవసరమైన ఆస్తుల సేకరణకూ మరిన్ని నిధులు అవసరమవుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో అంతమొత్తం నిధుల్లేవు. ఈ నేపథ్యంలో ఆస్తులిచ్చేవారికి టీడీఆర్ ప్రయోజనాల్ని పెంచనుంది. ప్రస్తుతం టీడీఆర్‌కు ముందుకొచ్చే వారికి వారు కోల్పోయే ప్లాట్ ఏరియాకు 250 శాతం బిల్టప్ ఏరియాతో వేరే ప్రాంతంలో నిర్మాణం చేసుకోవచ్చు. లేదా వారికున్న ఈ హక్కును ఇతరులకు(బిల్డర్లకు) విక్రయించుకోవచ్చు. దీంతోపాటు రహదారుల వెడల్పును బట్టి నిర్ణీత అంతస్తుల కంటే ఒక అంతస్తు అదనంగా నిర్మించుకోవచ్చు. తాజాగా ఈ టీడీఆర్ హక్కుల్ని భారీగా పెంచుతోంది. బిల్టప్ ఏరియాను 400 శాతానికి పెంచడంతోపాటు అదనంగా రెండంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. అంటే ఎవరైనా 100 గజాల స్థలాన్ని రహదారుల విస్తరణలో కోల్పోతే.. వారికి మరోచోట 400 గజాల బిల్టప్ ఏరియాకు అవకాశమిస్తారు. నిబంధనల కంటే మరో రెండంతస్తులు అదనంగా నిర్మించుకునేందుకు అనుమతిస్తారు. అందుకుగానూ ఎక్కువ సెట్‌బ్యాక్స్ వదలాల్సిన అవసరం ఉండదు. తగ్గనున్న నష్టపరిహారం చెల్లింపుల భారం అదనపు అంతస్తులకు వీలుండటంతో టీడీఆర్‌కు డిమాండ్ పెరుగుతుందని, ఎక్కువ మంది టీడీఆర్‌కు ముందుకు రాగలరని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. తద్వారా నష్టపరిహారాల చెల్లింపుల ఖర్చు ఉండదని అంచనా వేస్తున్నారు. ఒక ప్రాంతంలో టీడీఆర్ హక్కులు పొందిన వారు నగరంలోని వేరే ప్రాంతంలోనూ వాటిని వినియోగించుకోవచ్చు. ఇతరులకు విక్రయించుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాల్లోని స్థలాల విలువను పరిగణనలోకి తీసుకుని ఆ విలువకు అనుగుణంగా టీడీఆర్ అనుమతులిస్తారు. ఇక రోడ్ల విస్తరణతోపాటు చెరువులు, నాలాలు తదితర ప్రాంతాల్లోని బఫర్జోన్లను అభివృద్ధి చేసేందుకు, పచ్చదనం పెంచేందుకు అవసరమైన స్థలాలు సేకరించేందుకు అక్కడ స్థలం కోల్పోయే వారికి 200 శాతం టీడీఆర్‌ను అమలు చేయనున్నారు. ప్రస్తుతమిది వంద శాతంగా ఉంది. అయితే టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులకు అనుమతివ్వడం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతాయని పట్టణ ప్రణాళిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలు పెరుగుతాయి టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులకు అనుమతినివ్వడంతో వచ్చే అదనపు నిర్మాణాల వల్ల వాటిల్లో ఉండే కుటుంబాలు పెరుగుతాయి. తద్వారా రోడ్డు విస్తరించీ ప్రయోజనం ఉండదు. ట్రాఫిక్ పెరుగుతుంది. అంతేకాదు డ్రైనేజీ సమస్యలు వంటివి తీవ్రమవుతాయి. నష్టపరిహార చెల్లింపులకు నిధులు చెల్లించలేక ఇలాంటి ఆఫర్లివ్వడం అసలు లక్ష్యాన్నే నీరుగారుస్తుంది. – పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రస్తుతం రోడ్ల వెడల్పును బట్టి ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, కొత్త టీడీఆర్‌తో అదనంగా ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో వివరాలివీ.. రోడ్డు వెడల్పు సెట్‌బ్యాక్ అంతస్తులు పెరిగే అంతస్తులు 40 అడుగులు 8 మీటర్లు 8 10 60 అడుగులు 10 మీటర్లు 10 12 80 అడుగులు 13 మీటర్లు 15 17 -
‘సిరిసిల్ల’ శిథిలం..!
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం మరమ్మత్తులో మగ్గుతోంది. జిల్లాకేంద్రంగా ఏర్పడటంతో రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల వేగవంతం అనివార్యమైంది. పట్టణంలో మూడువైపులా ప్రధాన రహదారుల విస్తరణ పనులతో ఎక్కడ చూసినా శిథిలావస్థలో ఉన్న భవనాలే దర్శనమిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు కూల్చివేయడంతో ప్రకృతి వైపరీత్యం ఏర్పడిన పరిస్థితులు కనపడుతున్నాయి. నాలుగు నెలల క్రితం ప్ర ధాన రోడ్లపై ఎటుచూసినా అందమైన భవనా లతో కళకళలాడిన పట్టణం వైభవం.. ఇప్పుడు బోసిపోయి, కళాశిహీనంగా కనిపిస్తోంది. అభివృద్ది పథంలో పయనం.. జిల్లా కేంద్రంగా ఏర్పడిన సిరిసిల్ల పట్టణం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్, కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారుల విస్తరణ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. కొత్తచెరువు మొదలుకుని కార్గిల్లేక్ వరకు 100 అడుగులు, అంబేద్కర్‌చౌక్ నుంచి విద్యానగర్ వరకు 80 ఫీట్ల వరకు రోడ్లు విస్తరిస్తున్నారు. ఇందులో మొత్తంగా 368 భవనాలు తొలగించారు. వీటిలో 354 ప్రైవేటువి కాగా.. 14 ప్రభుత్వ కార్యాలయాల బిల్డింగులు, ప్రహరీలు ఉన్నాయి. విస్తరణ కొలతల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు ఇబ్బంది లేకున్నా ప్రైవేటు ఆస్తులు చాలాదెబ్బతిన్నాయి. వీటిలో కొన్నే పూర్తిగా దెబ్బతినగా చాలా భవనాలు పాక్షికంగా కూల్చేయాల్సి వచ్చింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం.. ప్రభుత్వ కార్యాలయాల భవనాల సంగతి పక్కన పెడితే.. ప్రైవేటు ఆస్తులు చాలావరకు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డు విస్తరణకు అనుగుణంగా కొనసాగిన కూల్చివేతలో కొన్ని చోట్లలో పురాతన భవనాలు పూర్తిగా కూల్చివేశారు. దీంతో వ్యాపార సంస్థలు, ప్రైవేటు కార్యాలయాల నిర్వహణ, చిరువ్యాపారాలకు బ్రేక్‌పడింది. కొత్తచెరువు నుంచి కార్గిల్లేక్, అంబేద్కర్‌చౌక్ నుంచి విద్యానరగ్ వరకు దాదాపు 368 భవనాలను కూల్చివేయడం ద్వారా రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. వీటిలో సింహభాగం నిబంధనలకు అతీతంగా చేపట్టినవి ఉన్నట్లు సమాచారం. పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంలో మొత్తంగా 354 ప్రైవేటు నివాసాలు కూల్చివేతకు గురికాగా.. అందులో కేవలం 38 మాత్రమే గ్రామపంచాయతీ, మున్సిపల్ నిబంధనల ప్రకారం ఉండటం గమనార్హం. వ్యాపార కూడళ్లలో శరవేగంగా పనులు.. వ్యాపార లావాదేవీలు అధికంగా సాగే పాతబస్టాండ్, కరీంనగర్ రోడ్డు, అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, కలెక్టర్ ఆఫీసు రోడ్డు వంటి ప్రాంతాల్లో చేపట్టిన విస్తరణ పనుల్లో కూల్చివేసిన భవనాల పునరుద్ధరణ శరవేగంగా సాగుతోంది. గోపాల్‌నగర్, కోర్టుచౌరస్తా, సాయినగర్ తదితర ప్రాంతాల్లో వ్యాపారం సాధారణంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో భవనాల పునరుద్ధరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. భవనాల పునరుద్ధరణ ఆర్థిక వ్యవహారంతో కూడినందున, ఏకమొత్తంలో కూలీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో పనుల్లో జాప్యమవుతోందని స్థానికులు చెబుతున్నారు. తద్వారా సిరిసిల్లకు కొత్తకళ సంతరించుకోవడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మృత్యు మార్గాలు
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఏటా వెయ్యి మంది మృత్యువాత 3 వేల మంది వరకు గాయాల పాలు రద్దీకి అనుగుణంగా విస్తరించని జిల్లా రోడ్లు ఐదు మార్గాల్లోనే ఎక్కువ దుర్ఘటనలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సాధారణమై పోయాయి. రోజుకు సగటున 18 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పది మంది మృత్యువాత పడుతున్నారు. 24 మంది మందికిపైగా ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ గణాంకాలు పోలీసుల రికార్డులు చెబుతున్నవే. జిల్లా ఇతర రాష్ట్రాలకు సరిహద్దు కావడం, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహళస్తి లాంటి పుణ్య క్షేత్రాలు ఉండటంతో ఇక్కడి రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనరద్దీకి అనుగుణంగా రహదారులు మాత్రం విస్తరించలేదు. ఇరుకు రోడ్లపై వేగంగా వాహనాలు పోతుండటంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా చెన్నై–బెంగళూరు బైపాస్ (ఎన్‌హెచ్4), పూతలపట్టు–తిరుపతి (ఎన్‌హెచ్–40), కలకడ–చిత్తూరు (ఎన్‌హెచ్–140), మదనపల్లె–క్రిష్ణగిరి (ఎన్‌హెచ్–42), చెన్నై–రేణిగుంట (ఎన్‌హెచ్–716) రోడ్లు రక్తంతో తడిసి పోతున్నాయి. తాజాగా గురువారం ఉదయం రేణిగుంట సమీపాన ముగ్గురు మరణించారు. జిల్లాలోని కొన్ని రహదారుల్లో నిత్యం మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోడ్ల విస్తరణ లేమి.. పెరిగిన వాహన రద్దీ.. మితిమీరిన వేగం.. నిద్రలేమి.. మద్యం మత్తులో వాహనచోదకం.. అర్ధరాత్రి ప్రయాణంతో రహదారులు నిత్యం ప్రమాదాలు జరిగి, రక్తసిక్తం అవుతున్నాయి. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు జరిగిన పలు రోడ్డు ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా ప్రమాద నివారణకు వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రోడ్ల విస్తరణ చేయాల్సి ఉంది. తిరుపతి క్రైం: మితిమీరిన వేగం... అర్ధరాత్రి ప్రయాణం.. నిద్రమత్తు.. అలసట.. మద్యపాన సేవనం తరువాత వాహన చోదకం.. ఒకటేమిటి ఇలా పలు మానవ తప్పిదాలతోనే అధికంగా ప్రమాదాలు జరుగున్నాయి. దీంతో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కాగా జిల్లాలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం రాత్రి సమయంలో జరిగినవే. వీటిని నివారించాలంటే అప్రమత్తతతోపాటు ప్రశాంతత అవసరమని వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాత్రి సమయంలో అధికం జిల్లాలో గత ఏడాది సుమారు 1800 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 50 శాతం రాత్రి సమయంలోనే జరిగాయి. అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే ప్రమాదాల తీవ్రత ఎక్కువ ఉండడంతో పాటు మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది. గత ఏడాది రాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 570 పైగా మృతి చెందగా 1272 మందికి పైగా గాయపడ్డారు. తెల్లవారు జాము.. జర జాగ్రత్త తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల వరకు ఎంత నిద్ర ఆపుకుందామన్నా.. ఆపుకోవడం చాలా కష్టం. ఈ సమయంలో నిద్ర ముంచుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన సమయంలో ఎలాఉన్నా ఈ 4 గంటలు డ్రైవర్ పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకుంటే కొంత వరకు ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదాలకు కారణాలివీ... ►దైవదర్శనాలు, విహారయాత్రలకు వెళ్లే వారు సమయాన్ని నిర్ణయించుకుని వెళ్లతారు. ఈ దశలో వాహన డ్రైవర్ రాత్రంతా వాహనం నడుపుతారు. సరైన నిద్ర లేక అర్ధరాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ►రాత్రి సమయంలో ఎక్కువగా భోజనం తీసుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో హోటల్స్, డాబాల్లో దొరికే మసాలా భోజనాలు తీసుకోవడం వల్ల అధికనిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ►ప్రతి మనిషికి రోజుకు 6 గంటల నిద్ర అవసరం. అయితే నిద్ర సరిగా లేకపోవడంతో డ్రైవింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేరు. ►రాత్రి సమయంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నిద్రపోతారు. డ్రైవర్‌తో మాట్లాడేదానికి ప్రయత్నించరు. కొద్ది సమయం వాహనం నడిపినా తరువాత మాట్లాడేవారు లేక వాహనచోదకుడికి సైతం నిద్ర ముంచుకొస్తుంది. దీంతో ప్రమాదాలకు గురవుతారు. ప్రమాద నివారణ మార్గాలివీ.. ►దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వాహన చోదకులు అర్ధరాత్రి దాటిన తరువాత ఎక్కడో ఒక చోట వాహనాన్ని ఆపి, నిద్రపోతే ప్రమాదాలు అధిక శాతం నివారించవచ్చు. ►2, 3 గంటలకు ఒకసారి డ్రైవర్‌కు టీ తాగేందుకు అవకాశం ఇవ్వాలి. డ్రైవింగ్ సమయంలో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ ఉండాలి. ►పోలీస్‌శాఖ పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తాయి. ఏదో ఒక చోట అర్ధరాత్రి వెళ్లే వాహనాలను తరచూ తనిఖీ చేయడం వాహనంలో ఉన్న వారు అప్రమత్తం అవుతారు. దీని ద్వారా కొంత దూరం నిద్రలోకి వెళ్లకుండా అవకాశం ఉంది. గస్తీ సమయంలో వాహనాలపై వెళ్లేవారు పెద్ద శబ్దాలతో హారన్లు మ్రోగించాలి. ►విహారయాత్రకు వెళ్లే కుటుంబసభ్యులు 6 గంటలు నిద్రపోయేలా ప్రణాళిక రూపొందిం చుకోవాలి. డ్రైవర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి నిద్రలేకుండా ప్రయాణం చేయకూడదు. ►ముఖ్యంగా వంతెనలు, లోతట్టు ప్రాంతాల్లో వేగం ఎంత ఉండాలి, రోడ్డు ఉన్న తీరు సైన్‌బోర్డులు ఉంటాయి. వాటిని గమనించి డ్రైవర్ వాహనాన్ని నడపాలి. ►వాహనం ముందుసీట్లో కూర్చోనేవారు డ్రైవర్‌తో సహా సీటుబెల్ట్ పెట్టుకోవాలి. ప్రమాదం జరిగితే బెలూన్లు తెరుచుకుని ప్రమాద తీవ్రత తగ్గుతుంది. -
రహదారుల విస్తరణపై దృష్టి
► సచివాలయానికి ప్రత్యేక మార్గాలు ► తాడికొండ శివారు నుంచి తుళ్లూరు రోడ్డుకు బైపాస్ ప్రతిపాదనలు తాడికొండ రూరల్ : సచివాలయానికి రహదారుల ప్రక్షాళనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ, మంగళగిరి ప్రాంతం నుంచి ఇప్పటికే కొంత మేరకు రహదారుల విస్తరణ జరిగిన నేపథ్యంలో ప్రధానంగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలను ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలా మళ్లించాలి అనే అంశాలపైనే దృష్టి సారించారు. ఈ మేరకు ప్రతిపాదనలు గతంలోనే సిద్ధం చేయగా రెండు వారాల్లోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని రెవెన్యూ, ఆర్అండ్బీ విభాగాలకు ఆదేశాలు అందాయి. జూన్‌లో తాత్కాలిక రాజధానిలోకి ఉద్యోగులను పూర్తి స్థాయిలో తరలించనున్నారు. గుంటూరుతో పాటు రాజధాని పరిసర గ్రామాల్లో ఉద్యోగులు నివాసం ఉండే ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, వీఐపీల రాకపోకలు బాగా పెరుగుతాయి. రోజులో వేల మంది ఈ మార్గం నుంచి ఉదయం సాయంత్ర ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం తుళ్లూరు ప్రాంతానికి సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులు వందల సంఖ్యలో గుంటూరు నుంచి వెళుతున్నారు. వీరందరికీ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది. పుష్కరాలకూ రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు నుంచి అమరావతి వరకు రహదారి విస్తరణ చేసేందుకు ఇప్పటికే అమోదం లభించింది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి తుళ్లూరు వెళ్లే రోడ్డులో భారీగా మార్పులు చేయనున్నారు. తాడికొండలో రోడ్లు కుంచించుకుపోయి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గ్రామ శివారు నుంచి బైపాస్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ రహదారిపై ప్రణాళికలు వారంలోగా అందించాలని రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. గతంలో డొక్కా మంత్రిగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గుంటూరు వైపు నుంచి వచ్చే రోడ్డులో తాడికొండ శివారు గొడుగు కంపెనీ వద్ద ఉన్న డొంక నుంచి బడేపురం మీదుగా తుళ్లూరు రోడ్డుకు అనుసంధానం చేసేలా బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. రెండో ప్రత్యామ్నాయ మార్గంగా అదే డొంక నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు మీదుగా కొండ వెనుక నుంచి రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇప్పుడు అవే ప్రతిపాదనలు తిరిగి ఆచరణలోకి తీసుకొనే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న డొంకను ఉన్నట్లుగా తారు రోడ్డుగా మలిచి ట్రాఫిక్‌ను మళ్లించడమా లేక అవసరాన్ని బట్టి 100 లేదా 120 అడుగుల రోడ్డును నిర్మించేందుకు భూమి సేకరించడమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ట్రాఫిక్‌లో మంత్రులు, కలెక్టర్ సీఆర్డీఏ అధికారులు ఇరుక్కొని ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారం రోజుల్లోనే దీనిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది. ఇక తాడికొండ నుంచి తుళ్లూరు రోడ్డును విస్తరించనున్నారు. సచివాలయ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం వెలగపూడి వెళ్లేందుకు గుంటూరు నుంచి దగ్గర మార్గంగా శాఖమూరు, ఐనవోలు మీదుగా రోడ్డు ఉన్న నేపథ్యంలో విస్తరించి నూతన శోభను కల్పించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. దీనిపై వారం రోజుల్లోగా స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది. మరో రెండు నెలల్లో రహదారుల ప్రక్షాళన చేపనున్నారు. -
మెట్రో మార్గాల్లో రోడ్ల విస్తరణ
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు మార్గాల్లో రహదారుల విస్తరణకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ రూ.10 కోట్లతో చర్యలు చేపట్టింది. ఈ నిధులతో బీటీ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త్వరలో మెట్రో పోలిస్ సమావేశాలు జరుగనున్న దృష్ట్యా నగరంలోని మెట్రో రైలు మార్గాల్లో అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్, వివిధ విభాగాల అధికారులు శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మెట్రో మార్గాల్లో రహదారుల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆర్అండ్బీ మార్గాల్లో బీటీ రోడ్ల విస్తరణతో పాటు, జీహెచ్ఎంసీ మార్గాల్లో కూడా రహదారుల విస్తరణ చేపడతారు. మెట్రో పనుల కోసం చేపట్టిన ఫౌండేషన్ పనులు పూర్తయిన జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మార్గాల్లో బారికేడ్లను తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎల్అండ్టీ సంస్థ చర్యలు తీసుకోవాలి. రోడ్ నెంబర్-36లో పౌండేషన్ పూర్తయిన చోట నాలుగైదు రోజుల్లో ముళ్ల కంచెను తొలగించాలని, పనులు పూర్తయిన చోట నుంచి నిర్మాణ సామగ్రిని సైతం తరలించాలని ఇంజినీర్లను హెచ్ఎంఆర్ ఎండీ ఆదేశించారు. అలాగే, ఈ మార్గాల్లో ఉన్న చెత్త, ఇతర భవన నిర్మాణ సామగ్రిని వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ మార్గాల్లో ఉన్న వాటర్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వాటర్ బోర్డు అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో వాటర్ బోర్డు ఎండీ జగదీశ్వర్, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, సైబరాబాద్ డీసీపీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల విస్తరణకు టీడీపీ నేతల మోకాలడ్డు
నంద్యాల టౌన్: పట్టణంలో రోడ్ల విస్తరణ, ఆక్రమణ తొలగింపుపై రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. ఆక్రమణదారులకు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుంది. రోడ్ల విస్తరణలో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి లక్ష్యం నెరవేరుతుందా.. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ ఆక్రమణదారులకు అండగా ఉంటారా? కమిషనర్ రామచంద్రారెడ్డి ధైర్యం చేస్తారా, మొహం చాటేస్తారా.. ఇలా ప్రజల్లో చర్చ సాగుతుంది. నేడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రోడ్ల విస్తరణే భూమా లక్ష్యం.. పట్టణంలో రోడ్ల విస్తరణే లక్ష్యంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఈ విషయమై అధికారులతో పలుమార్లు చర్చించి ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ నెల 14న ఆయన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డితో చర్చించారు. రోడ్ల విస్తరణ చేపట్టకపోతే 16వ తేదీ నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని భూమా ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే చర్యలను అడ్డుకునేందుకు చైర్పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ వాయిదా మంత్రాన్ని పఠించారు. 2009లో చేసిన తీర్మానానికి కాలా తీతమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి నిధులను సాధించి, రోడ్లను విస్తరిస్తామని ప్రకటించారు. భూమాకు పేరు వస్తుందనే కారణంతో టీడీపీ నేతలు రోడ్ల విస్తరణకు మోకాలడ్డుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణల తొలగింపుపై అనుమానాలు టీడీపీ నేతలు ధ్వందవైఖరి, కమిషనర్ వెనుకగుడుతో ఆక్రమణ కూల్చివేతపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆక్రమణలు తొలగిస్తామని చెప్పిన కమిషనర్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు వెళ్లారు. దీంతో ఆక్రమణల కూల్చివేతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా ఆక్రమణల కూల్చివేతకు గడువు ఇచ్చామన్నారు. అయితే వ్యాపారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉందని చెప్పారు. -
సాగర్ దారీ.. డేంజరే!
ఇబ్రహీంపట్నం రూరల్: రహదారుల విస్తరణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల ప్రాణాలను బలితీసుకుంటోంది. జిల్లాలోని బెంగళూరు జాతీయ రహదారితోపాటు సాగార్జున సాగర్ రహదారి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ పనుల్లో భాగంగా తవ్వుతున్న గుంతలు, సూచిన బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయకపోవడం, వాహనాల వేగాన్ని నియంత్రించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల బెంగళూరు జాతీయ రహదారిపై దండుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. ఇక సాగర్ రోడ్డు విస్తరణ పనులు సైతం అస్తవ్యస్తంగా మారాయి. దండుపల్లి తరహా ప్రమాదాలు ఇక్కడా జరిగే అవకాశాలు లేకపోలేదు. నాగార్జునసాగర్ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. వేలాది ఇంజినీరింగ్ కళాశాలలు సైతం ఇదే రహదారిపై ఉన్న ఇబ్రహీంపట్నం చుట్టూ ఉన్నాయి. ఆయా కళాశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు కాలేజీ బస్సులు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటాయి. అయితే ఈ రహదారిపై రోజూ ఏదో ఓచోట మరమ్మతులు చేస్తుండడం, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటుండడం పరిపాటిగా మారింది. నాగార్జునసాగర్ రహదారిని విస్తరించాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ రోడ్డు వెడల్పుగా ఉన్నప్పటికీ బొంగ్లూర్ నుంచి మాల్ వరకు చాలా అధ్వాన్నంగా ఉంది. ఈ రహదారిపై చాలా చోట్ల యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయి. ప్రధానంగా చింతపల్లిగూడ గేట్, మంగల్‌పల్లిగేట్, బొంగ్లూర్ ఔటర్ రింగ్ , శ్రీ ఇందు కళాశాల, శేరిగూడ, ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ఇరుకుగా, గుంతలుగా ఉండ డమే ఇందుకు కారణం. నగరం నుంచి బైక్‌లపై వచ్చే వందలాది మంది విద్యార్థులు ప్రమాదాల బారిన పడి దుర్మరణం పాలయ్యారు. తొలిదశ.. మలిదశ రోడ్డు విస్తరణలో భాగంగా తొలి దశ బొంగ్లూర్ గేట్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు రూ.39 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. నాలుగు లేన్లుగా విస్తరించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పనులను మార్చిలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో మాల్ వరకు విస్తరణ కోసం మరో రూ.78కోట్లు అవసరం అవుతాయని ఎమ్మెల్యేతోపాటు అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. మాల్ వరకు ఈ రోడ్డును విస్తరిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రాతో అనుసంధానం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటుతో నాగార్జున సాగర్హ్రదారికి వాహనాల తాకిడి ఎక్కువైంది. నగరంలో స్థిరపడిన ఉద్యోగస్తులు, వ్యాపారులు తమ సొంత జిల్లాలకు తరచూ వెళ్లి వస్తుండడంతో ఇబ్రహీంపట్నం రహదారి ఎప్పుడూ రద్దీగా వుంటోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా గుంటూరు పేరు పరిశీలనలో వుండటంతో ఆ ప్రాంతంతో తెలంగాణకు కలిపే ఈ రహదారి భవిష్యత్తులో మరింత రద్దీగా మారనుంది. విస్తరించిన చోటా ఇబ్బందే.. విస్తరణకు ముందూ.. తర్వాత నాగార్జునసాగర్ రహదారి అధ్వాన్నంగానే ఉంది. గతంలో రోడ్డు వెడల్పుగా లేదని ప్రజలు ఆందోళన చెందారు. ప్రస్తుతం కొంతదూరం రోడ్డు వెడల్పుగా ఉన్నప్పటికీ పనులు సరిగా చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎత్తుపల్లాలు అధికంగా ఉన్నాయని, ఒకే రోడ్డు రెండు అసమాన భాగాలుగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. శ్రీ ఇందు కళాశాల సమీపంలోని మలుపు, చింతపల్లిగూడ గేట్ వద్ద మలుపు, బొంగ్లూర్ కళ్లెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. -
మాస్టర్‌ప్లాన్ అమలులో జాప్యం
జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణకు ప్రతిపాదించినా అమలు విషయం లో తీవ్ర జాప్యం జరుగుతోంది. టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతి లభించినా అధికారులు పను లు చేపట్టడంలేదు. అయితే రాజకీయ నాయకు లు సైతం ఈ విషయంపై మౌనం వహిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ ఆక్రమణలకు గురి కావడంతో పలు రోడ్లు కుంచించుకు పోయాయి. దీంతో రోడ్లపై రాక పోకలు సాగిం చాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నా యి. గత దశాబ్ద కాలంతో పోల్చి చూస్తే మూ డింతలకంటే ట్రాఫిక్ పెరిగింది. దీంతో రోడ్లపై రాక పోకలు సాగించడం పాదచారులు, వాహ న చోదకులకు కష్టతరంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2011లో టౌన్ ప్లానింగ్ అధికారులు జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిర్రోడ్డు విస్తరణకు మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని టౌ న్ అండ్ కంట్రి ప్లానింగ్ డెరైక్టరేట్‌ను సంప్రదిం చింది. మున్సిపల్ అధికారుల ప్రతిపాదనకు టౌన్ ప్లానింగ్అధికారుల నుంచి అనుమతి లభించింది. ఈ రోడ్డును 50 ఫీట్ల మేర విస్తరించేందుకు వీలుగా అనుమతిచ్చింది. అనుమతి లభించి రెండేళ్లైనా మాస్టర్ ప్లాన్‌ను అమ లు పర్చే విషయంలో మున్సిపల్ అధికారులు సాహసించడం లేదు. ఇప్పటికే రైల్వే స్టేషన్‌కు పడమర వైపున రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ రోడ్డుపై ఇప్పటికే ట్రాఫిక్ పెరిగింది. ఈ బ్రిడ్జి నుంచి 9వ జాతీయ రహదారికి రాక పోకలను సాగించాలంటే భవానీ మందిర్ రోడ్డు నుంచి ప్రయాణించాల్సి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మా స్టర్ ప్లాన్ కోసం ప్రతిపాదించారు. కానీ రోడ్డు వెడల్పు పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. పలు సాకులను చూపుతూ మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను వాయిదా వేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవానీ మందిర్రోడ్డుతో పాటు హనుమాన్మందిర్రోడ్డు, బ్లాక్ రోడు, సుభాష్‌గంజ్ రో డ్డు కుంచించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆయా రోడ్లను కూడా విస్తరించేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం భవానీ మందిర్ రోడ్డు విస్తరణలోనే తీవ్ర జాప్యం జరుగుతున్నా మిగతా రోడ్ల విషయంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా భవానీ మందిర్ రోడ్డును విస్తరించే విషయమై వివిధ రాజకీయ పార్టీల నేతలు మౌనం వహిస్తున్నారు. రోడ్డు విస్తరణ చేపడితే వ్యాపార వర్గాల నుంచి ఎక్కడ వత్తిడి వస్తుందోననే ఉద్దేశంతోనే ఆయా పార్టీల నేతలు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ విషయాన్ని ఆయా పార్టీల నేతలు, అధికారులు మరుగున పడవేశారనే విమర్శలున్నాయి. మా జీ మంత్రి గీతారెడ్డితో పాటు తెలుగుదేశం, టీ ఆర్ఎస్, బీజేపీ నేతలు సైతం రోడ్డు విస్తరణకు గాను మాస్టర్ ప్లాన్‌ను అమలు విషయాన్ని ప్రస్తావించక పోవడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ అమలు పర్చుతారనే ఆశాభావాన్ని పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.