మృత్యు మార్గాలు | Increasing road accidents | Sakshi
Sakshi News home page

మృత్యు మార్గాలు

Published Fri, Feb 3 2017 1:05 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

మృత్యు మార్గాలు - Sakshi

మృత్యు మార్గాలు

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఏటా వెయ్యి మంది మృత్యువాత
3 వేల మంది వరకు గాయాల పాలు
రద్దీకి అనుగుణంగా విస్తరించని జిల్లా రోడ్లు
ఐదు మార్గాల్లోనే ఎక్కువ దుర్ఘటనలు


జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సాధారణమై   పోయాయి. రోజుకు సగటున 18 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పది మంది మృత్యువాత పడుతున్నారు. 24 మంది మందికిపైగా ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ గణాంకాలు పోలీసుల రికార్డులు చెబుతున్నవే. జిల్లా ఇతర రాష్ట్రాలకు సరిహద్దు కావడం, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహళస్తి లాంటి పుణ్య క్షేత్రాలు ఉండటంతో ఇక్కడి రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనరద్దీకి అనుగుణంగా రహదారులు మాత్రం విస్తరించలేదు. ఇరుకు రోడ్లపై వేగంగా వాహనాలు పోతుండటంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా చెన్నై–బెంగళూరు బైపాస్‌ (ఎన్‌హెచ్‌4), పూతలపట్టు–తిరుపతి    (ఎన్‌హెచ్‌–40), కలకడ–చిత్తూరు (ఎన్‌హెచ్‌–140), మదనపల్లె–క్రిష్ణగిరి (ఎన్‌హెచ్‌–42), చెన్నై–రేణిగుంట (ఎన్‌హెచ్‌–716) రోడ్లు రక్తంతో తడిసి పోతున్నాయి. తాజాగా గురువారం ఉదయం రేణిగుంట సమీపాన ముగ్గురు మరణించారు.

జిల్లాలోని కొన్ని రహదారుల్లో నిత్యం మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోడ్ల విస్తరణ లేమి.. పెరిగిన వాహన రద్దీ.. మితిమీరిన వేగం.. నిద్రలేమి.. మద్యం మత్తులో వాహనచోదకం.. అర్ధరాత్రి ప్రయాణంతో రహదారులు నిత్యం ప్రమాదాలు జరిగి, రక్తసిక్తం అవుతున్నాయి. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు జరిగిన పలు రోడ్డు ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా ప్రమాద నివారణకు వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రోడ్ల విస్తరణ చేయాల్సి ఉంది.  

తిరుపతి క్రైం: మితిమీరిన వేగం... అర్ధరాత్రి ప్రయాణం..  నిద్రమత్తు.. అలసట.. మద్యపాన సేవనం తరువాత వాహన చోదకం.. ఒకటేమిటి ఇలా పలు మానవ తప్పిదాలతోనే అధికంగా ప్రమాదాలు జరుగున్నాయి. దీంతో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కాగా జిల్లాలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం రాత్రి సమయంలో జరిగినవే. వీటిని నివారించాలంటే అప్రమత్తతతోపాటు ప్రశాంతత అవసరమని వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

రాత్రి సమయంలో అధికం
జిల్లాలో గత ఏడాది సుమారు 1800 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 50 శాతం రాత్రి సమయంలోనే జరిగాయి. అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే ప్రమాదాల తీవ్రత ఎక్కువ ఉండడంతో పాటు మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది. గత ఏడాది రాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 570 పైగా మృతి చెందగా 1272 మందికి పైగా గాయపడ్డారు.  

తెల్లవారు జాము.. జర జాగ్రత్త
తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల వరకు ఎంత నిద్ర ఆపుకుందామన్నా.. ఆపుకోవడం చాలా కష్టం. ఈ సమయంలో నిద్ర ముంచుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన సమయంలో ఎలాఉన్నా ఈ 4 గంటలు డ్రైవర్‌ పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకుంటే కొంత వరకు ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాదాలకు కారణాలివీ...
►దైవదర్శనాలు, విహారయాత్రలకు వెళ్లే వారు సమయాన్ని నిర్ణయించుకుని వెళ్లతారు. ఈ దశలో వాహన డ్రైవర్‌ రాత్రంతా వాహనం నడుపుతారు. సరైన నిద్ర లేక అర్ధరాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు.

►రాత్రి సమయంలో ఎక్కువగా భోజనం తీసుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో హోటల్స్, డాబాల్లో దొరికే మసాలా భోజనాలు తీసుకోవడం వల్ల అధికనిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.

►ప్రతి మనిషికి రోజుకు 6 గంటల నిద్ర అవసరం. అయితే నిద్ర సరిగా లేకపోవడంతో డ్రైవింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేరు.

►రాత్రి సమయంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నిద్రపోతారు. డ్రైవర్‌తో మాట్లాడేదానికి ప్రయత్నించరు. కొద్ది సమయం వాహనం నడిపినా తరువాత మాట్లాడేవారు లేక వాహనచోదకుడికి సైతం నిద్ర ముంచుకొస్తుంది. దీంతో ప్రమాదాలకు గురవుతారు.
ప్రమాద నివారణ మార్గాలివీ..

►దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వాహన చోదకులు అర్ధరాత్రి దాటిన తరువాత ఎక్కడో ఒక చోట వాహనాన్ని ఆపి, నిద్రపోతే ప్రమాదాలు అధిక శాతం నివారించవచ్చు.

►2, 3 గంటలకు ఒకసారి డ్రైవర్‌కు టీ తాగేందుకు అవకాశం ఇవ్వాలి. డ్రైవింగ్‌ సమయంలో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ ఉండాలి.
     
►పోలీస్‌శాఖ పరిధిలో పెట్రోలింగ్‌ వాహనాలు రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తాయి. ఏదో ఒక చోట అర్ధరాత్రి వెళ్లే వాహనాలను తరచూ తనిఖీ చేయడం వాహనంలో ఉన్న వారు అప్రమత్తం అవుతారు. దీని ద్వారా కొంత దూరం నిద్రలోకి వెళ్లకుండా అవకాశం ఉంది. గస్తీ సమయంలో వాహనాలపై వెళ్లేవారు పెద్ద శబ్దాలతో హారన్‌లు మ్రోగించాలి.

►విహారయాత్రకు వెళ్లే కుటుంబసభ్యులు 6 గంటలు నిద్రపోయేలా ప్రణాళిక రూపొందిం చుకోవాలి. డ్రైవర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి నిద్రలేకుండా ప్రయాణం చేయకూడదు.

►ముఖ్యంగా వంతెనలు, లోతట్టు ప్రాంతాల్లో వేగం ఎంత ఉండాలి, రోడ్డు ఉన్న తీరు సైన్‌బోర్డులు ఉంటాయి. వాటిని గమనించి డ్రైవర్‌ వాహనాన్ని నడపాలి.
►వాహనం ముందుసీట్లో కూర్చోనేవారు డ్రైవర్‌తో సహా సీటుబెల్ట్‌ పెట్టుకోవాలి. ప్రమాదం జరిగితే బెలూన్‌లు తెరుచుకుని ప్రమాద తీవ్రత తగ్గుతుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement