సాగర్ దారీ.. డేంజరే!
ఇబ్రహీంపట్నం రూరల్: రహదారుల విస్తరణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల ప్రాణాలను బలితీసుకుంటోంది. జిల్లాలోని బెంగళూరు జాతీయ రహదారితోపాటు సాగార్జున సాగర్ రహదారి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ పనుల్లో భాగంగా తవ్వుతున్న గుంతలు, సూచిన బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయకపోవడం, వాహనాల వేగాన్ని నియంత్రించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల బెంగళూరు జాతీయ రహదారిపై దండుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహరణ.
ఇక సాగర్ రోడ్డు విస్తరణ పనులు సైతం అస్తవ్యస్తంగా మారాయి. దండుపల్లి తరహా ప్రమాదాలు ఇక్కడా జరిగే అవకాశాలు లేకపోలేదు. నాగార్జునసాగర్ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. వేలాది ఇంజినీరింగ్ కళాశాలలు సైతం ఇదే రహదారిపై ఉన్న ఇబ్రహీంపట్నం చుట్టూ ఉన్నాయి. ఆయా కళాశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు కాలేజీ బస్సులు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటాయి. అయితే ఈ రహదారిపై రోజూ ఏదో ఓచోట మరమ్మతులు చేస్తుండడం, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటుండడం పరిపాటిగా మారింది.
నాగార్జునసాగర్ రహదారిని విస్తరించాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ రోడ్డు వెడల్పుగా ఉన్నప్పటికీ బొంగ్లూర్ నుంచి మాల్ వరకు చాలా అధ్వాన్నంగా ఉంది. ఈ రహదారిపై చాలా చోట్ల యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయి. ప్రధానంగా చింతపల్లిగూడ గేట్, మంగల్‌పల్లిగేట్, బొంగ్లూర్ ఔటర్ రింగ్ , శ్రీ ఇందు కళాశాల, శేరిగూడ, ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ఇరుకుగా, గుంతలుగా ఉండ డమే ఇందుకు కారణం. నగరం నుంచి బైక్‌లపై వచ్చే వందలాది మంది విద్యార్థులు ప్రమాదాల బారిన పడి దుర్మరణం పాలయ్యారు.
తొలిదశ.. మలిదశ
రోడ్డు విస్తరణలో భాగంగా తొలి దశ బొంగ్లూర్ గేట్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు రూ.39 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. నాలుగు లేన్లుగా విస్తరించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పనులను మార్చిలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో మాల్ వరకు విస్తరణ కోసం మరో రూ.78కోట్లు అవసరం అవుతాయని ఎమ్మెల్యేతోపాటు అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. మాల్ వరకు ఈ రోడ్డును విస్తరిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రాతో అనుసంధానం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటుతో నాగార్జున సాగర్హ్రదారికి వాహనాల తాకిడి ఎక్కువైంది. నగరంలో స్థిరపడిన ఉద్యోగస్తులు, వ్యాపారులు తమ సొంత జిల్లాలకు తరచూ వెళ్లి వస్తుండడంతో ఇబ్రహీంపట్నం రహదారి ఎప్పుడూ రద్దీగా వుంటోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా గుంటూరు పేరు పరిశీలనలో వుండటంతో ఆ ప్రాంతంతో తెలంగాణకు కలిపే ఈ రహదారి భవిష్యత్తులో మరింత రద్దీగా మారనుంది.
విస్తరించిన చోటా ఇబ్బందే..
విస్తరణకు ముందూ.. తర్వాత నాగార్జునసాగర్ రహదారి అధ్వాన్నంగానే ఉంది. గతంలో రోడ్డు వెడల్పుగా లేదని ప్రజలు ఆందోళన చెందారు. ప్రస్తుతం కొంతదూరం రోడ్డు వెడల్పుగా ఉన్నప్పటికీ పనులు సరిగా చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎత్తుపల్లాలు అధికంగా ఉన్నాయని, ఒకే రోడ్డు రెండు అసమాన భాగాలుగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. శ్రీ ఇందు కళాశాల సమీపంలోని మలుపు, చింతపల్లిగూడ గేట్ వద్ద మలుపు, బొంగ్లూర్ కళ్లెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.