నంద్యాల టౌన్: పట్టణంలో రోడ్ల విస్తరణ, ఆక్రమణ తొలగింపుపై రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. ఆక్రమణదారులకు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుంది. రోడ్ల విస్తరణలో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి లక్ష్యం నెరవేరుతుందా.. మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ ఆక్రమణదారులకు అండగా ఉంటారా? కమిషనర్ రామచంద్రారెడ్డి ధైర్యం చేస్తారా, మొహం చాటేస్తారా.. ఇలా ప్రజల్లో చర్చ సాగుతుంది. నేడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
రోడ్ల విస్తరణే భూమా లక్ష్యం..
పట్టణంలో రోడ్ల విస్తరణే లక్ష్యంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఈ విషయమై అధికారులతో పలుమార్లు చర్చించి ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ నెల 14న ఆయన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డితో చర్చించారు. రోడ్ల విస్తరణ చేపట్టకపోతే 16వ తేదీ నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని భూమా ప్రకటించారు.
దీంతో ఎమ్మెల్యే చర్యలను అడ్డుకునేందుకు చైర్‌పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ వాయిదా మంత్రాన్ని పఠించారు. 2009లో చేసిన తీర్మానానికి కాలా తీతమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి నిధులను సాధించి, రోడ్లను విస్తరిస్తామని ప్రకటించారు. భూమాకు పేరు వస్తుందనే కారణంతో టీడీపీ నేతలు రోడ్ల విస్తరణకు మోకాలడ్డుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆక్రమణల తొలగింపుపై అనుమానాలు
టీడీపీ నేతలు ధ్వందవైఖరి, కమిషనర్ వెనుకగుడుతో ఆక్రమణ కూల్చివేతపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆక్రమణలు తొలగిస్తామని చెప్పిన కమిషనర్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు వెళ్లారు. దీంతో ఆక్రమణల కూల్చివేతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా ఆక్రమణల కూల్చివేతకు గడువు ఇచ్చామన్నారు. అయితే వ్యాపారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉందని చెప్పారు.
రోడ్ల విస్తరణకు టీడీపీ నేతల మోకాలడ్డు
Published Wed, Jul 23 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement