సాక్షి, అమరావతి/మదనపల్లె: చిత్తూరు జిల్లా పుంగనూరులో సాగించిన విధ్వంసంపై పోలీసులు నమోదు చేసిన వివిధ కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు)కు హైకోర్టులో పూర్తిస్థాయి ఊరట లభించలేదు. అన్నీ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏడు కేసులకు గాను మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ మూడింటిలో చల్లా బాబు పాత్రపై నిర్దిష్ట ఆరోపణలున్న నేపథ్యంలో అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయట్లేదని స్పష్టం చేసింది.
మిగిలిన నాలుగు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 4 కేసుల్లో చల్లా బాబు పాత్రపై ఎలాంటి నిందారోపణలు లేవని, అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. 10 రోజుల్లోపు పుంగనూరు పట్టణ పోలీసుల ముందు లొంగిపోవాలని ఆయన్ను ఆదేశించింది. రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.
కాగా, బెయిల్‌పై విడుదలైన తరువాత నాలుగు వారాలపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని చల్లా బాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. పుంగనూరు విధ్వంసంపై పోలీసులు తనపై నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చల్లా బాబు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ సురే‹Ùరెడ్డి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. వీటిపై సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు.
అంగళ్లు కేసులో..
చంద్రబాబు యుద్ధభేరి పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆ పార్టీ నేత దేవినేని ఉమా, పీలేరు టీడీపీ ఇన్‌చార్జ్ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నానిలకు హైకోర్టు ఊరటనిచ్చింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 10 రోజుల్లోపు ముదివేడు పోలీసుల ముందు లొంగిపోవాలని ఉమా తదితరులను హైకోర్టు ఆదేశించింది.
రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలంది. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాక 4 వారాలపాటు అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. అలాగే నాలుగు వారాలపాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని తేలి్చచెప్పింది. దర్యాప్తులో జోక్యం చేసుకోవడం గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం గానీ చేయరాదంది. ఈ మేరకు జస్టిస్ సురే‹Ùరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
నిందితులకు బెయిల్ నిరాకరణ
పుంగనూరు, అంగళ్లులో 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లు, పోలీసులపై దాడి కేసులో నిందితుల తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీకి షాక్ తగిలింది. విధ్వంసకాండలో పాల్గొన్న 120 మంది నిందితుల తరఫున దాఖలు చేసిన అన్ని రెగ్యులర్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను మదనపల్లె రెండో ఏడీజే కోర్టు తిరస్కరించింది.
టీడీపీ నాయకులకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా టీడీపీ నేతల తరఫున పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై ఈ నెల 24న మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. టీడీపీ నాయకులు దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment