చచ్చినవారికీ ‘ఆసరా’ పింఛన్లు!
* 7,540 మంది మరణించినట్లు లైవ్ ఎవిడెన్స్ విచారణలో వెల్లడి
* 60 శాతం పూర్తయిన విచారణ.. నెలాఖరు దాకా గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల పంపిణీ లో రోజుకోరకంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అర్హత లేకున్నా పింఛన్లు పొందుతున్న అక్రమార్కుల బండారం బయటపడగా.. తాజాగా చచ్చిపోయినోళ్ల బ్యాంకు ఖాతాలకు పింఛన్ సొమ్ము జమవుతున్న అంశం వెలుగులోకి వచ్చింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నిర్వహించిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షలమంది ఆసరా పెన్షన ర్లు ఉండగా, ఇందులో బ్యాంకు ఖాతాల ద్వారా 11,12,790 మంది పింఛను సొమ్మును అందుకుంటున్నారు.
బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ సొమ్ము పంపిణీలో పారదర్శకత కోసమని ప్రభుత్వం ఇటీవల లైవ్ ఎవిడెన్స్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఈ తరహా పెన్షనర్లు ఆర్నెల్లకు ఒకమారు సమీప మీసేవా కేంద్రం నుంచి ఆధార్ ఆధారిత వేలిముద్ర (బయోమెట్రిక్) ద్వారా లైవ్ ఎవిడెన్స్‌ను సమర్పించాలి. ఎవిడెన్స్ సమర్పణకు గత నెల 20తో గడువు ముగియగా, ఇప్పటివరకు 1,81,821మంది ఎవిడెన్స్‌ను సమర్పిం చలేకపోయారు. అంతేకాక, లైవ్ ఎవిడెన్స్ సమర్పించడానికి పెన్షనర్లు వచ్చినా సాంకేతిక కారణాలతో మరో 25,502 మందిని మీసేవా కేంద్రం నిర్వాహకులు తిరస్కరించార ని అధికారుల దృష్టికి వచ్చింది.
లైవ్ ఎవిడెన్స్‌ను సకాలంలో సమర్పించలేకపోయిన ఫలితంగా మొత్తం 2,07,323 మందికి ఆసరా పింఛన్లను నిబంధనల ప్రకారం ఈ నెల నుంచి నిలిపివేయాల్సి ఉంది. అయితే వీరు లైవ్ ఎవిడెన్స్‌ను ఎందుకు ఇవ్వలేకపోయారనే అంశంపై సెర్ప్ అధికారులు విచారణ చేపట్టగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణ 60 శాతం పూర్తి
లైవ్ ఎవిడెన్స్ విషయమై సెర్ప్ చేపట్టిన విచారణ ప్రక్రియ ఇప్పటివరకు 60 శాతం పూర్తికాగా, ఈ నెలఖారు వరకు గడువు పెంచే అవకాశం ఉంది. అలాగే, మరణించిన పెన్షనర్ల సంగతి అలా ఉంచితే.. రకరకాల కారణాలతో లైవ్ ఎవిడెన్స్ ఇవ్వలేకపోయిన పెన్షనర్లకు ఈ నెల పింఛన్ ఇస్తారా, నిలిపివేస్తారా అనే అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. మొత్తం 2,07,323 మంది పెన్షనర్ల విషయమై అన్ని జిల్లాల్లో విచారణ చేపట్టగా ఇందులో 1,24,677 మంది పెన్షనర్లను అధికారులు విచారించారు.
ఇందులో 1,336 మందికి ఆధార్ లేకపోవడం, 294 మంది కుష్టువ్యాధి (లెప్రసీ) కారణంగా బయోమెట్రిక్ యం త్రంపై వేలిముద్రలు వేయలేకపోయారని తేలింది. 6,855 మంది అస్వస్థత కారణంగా మంచానపడి ఉన్నారని సమాచారం. 52,916 మంది పెన్షనర్లు లైవ్ ఎవిడెన్స్ ఇచ్చేందుకు మీసేవా కేంద్రాలకు వచ్చినా సాంకేతిక కారణాలతో నిర్వాహకులు వెనక్కి పంపినట్లు తాజా విచారణలో వెల్లడైంది.. అలాగే, 55,736 మంది పెన్షనర్లు లైవ్ ఎవిడెన్స్ ఇవ్వాలని తెలియదని అధికారుల దృష్టికి తెచ్చారు.
బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ పొందుతున్న వారిలో మరో 7,540 మంది మరణించినట్లు తాజా విచారణలో వెలుగులోకి రావడం విశేషం. మరణించిన వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ రూపంలో జమైన సొమ్మును తిరిగి వెనక్కి తెప్పించేందుకు ఆయా బ్యాంకు శాఖలకు లేఖలు రాయాలని సెర్ప్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.