ఆన్‌లైన్‌లోనే ‘ఆసరా’ అప్లికేషన్
ఒంటరి మహిళలకు ఆర్థిక భృతితోనే అమలుకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల మంజూరు ప్రక్రియను ఇకపై ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తు మొదలుకొని, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పింఛన్ మంజూరు వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరిగేలా సెర్ప్ అధికారులు సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు ప్రతినెలా రూ.1,000 వంతున భృతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున, వారి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నుంచే ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు కూడా...
తాజాగా యాసిడ్ దాడులు, రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులను కూడా ఈ కేటగిరీలోకి తీసుకురావాలని భావిస్తోంది. బాధితులు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ పత్రాలను ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడం వీలుకాని వారు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శుల, పట్టణ ప్రాంతాల్లోనైతే మున్సిపల్, హైదరాబాద్ జిల్లాలో మండల రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవచ్చు.