బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ముప్పు! | Aadhaar threat to bank accounts | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ముప్పు!

Published Tue, Aug 22 2017 1:56 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ముప్పు!

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ముప్పు!

సరిగా సీడింగ్‌ జరగక ఖాతాలు బ్లాక్‌ అయ్యే అవకాశం 
- రాష్ట్రంలో సుమారు 3 కోట్ల బ్యాంకు ఖాతాలకు సమస్య
 
సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ముప్పు వచ్చి పడింది.. వాటిని అనుసంధానించే ప్రక్రియ తప్పటడుగులేసింది.. రాష్ట్రంలోని మొత్తం 4.70 కోట్ల బ్యాంకు ఖాతాల్లో దాదాపు మూడు కోట్లకుపైగా ఖాతాలకు సమస్య వచ్చి పడింది. ఈ ఖాతాలకు సరిగా ఆధార్‌ సీడింగ్‌ జరగలేదని.. వాట న్నింటినీ బ్లాక్‌ చేసే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలోని 87 శాతం బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ సీడింగ్‌ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదించగా.. అందులో ఏకంగా 74 శాతం ఖాతాల కు, ఆధార్‌ వివరాలకు పొంతనలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

రెండు రోజుల కిందట రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలను వెల్లడించింది. కేవలం 13 శాతం బ్యాంకు ఖాతాలు, ఆ ఖాతాదారుల ఆధార్‌ సమాచారం సరిపోలిందని పేర్కొంది. ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియ సరిగ్గా జరగని తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఖాతాదారుల పేర్లలో, ఆధార్‌ నంబర్లలో, ఇతర వివరాల్లో తప్పులు ఉన్న నేపథ్యంలో.. భారీగా బోగస్‌ సీడింగ్‌ జరిగినట్లు సందేహం వ్యక్తం చేసింది.
 
బ్యాంకర్ల నిర్లక్ష్యంతో..
బ్యాంకర్లు తూతూమంత్రంగా ఆధార్‌ నంబర్లను ఖాతాలకు జత చేశారని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఆధార్‌ కార్డు సంబంధిత ఖాతాదారుడిదేనా.. ఇచ్చిన పాన్‌ నంబర్‌ సరిగ్గా ఉందా.. వంటి వివరాలను ధ్రువీకరించుకోకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. కేంద్రం వద్ద ఉన్న ఆధార్‌ డేటాబేస్, పాన్‌ నంబర్‌ డేటాబేస్‌లకు బ్యాంకు ఖాతాల్లోని ఆధార్‌ నంబర్లకు పొంతన లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
పక్కాగా పరిశీలన
వివరాల్లో తప్పులుండటంతో సీడింగ్‌ ప్రక్రియను మరింత పక్కాగా నిర్వహించాలని రాష్ట్రంలోని బ్యాంకర్లను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ఖాతాదారులంతా తమ ఆధార్‌ కార్డులను సమర్పించి ఖాతాలోని వివరాలు ఆధార్‌తో సరిపోలినవో, లేదో ధ్రువీకరించుకునేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డులను సమర్పించడంతోపాటు.. ఆ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సరిపోలినవో, లేదో సరిచూసుకోవాలని ఖాతాదా రులకు సూచించింది. ఆధార్‌ సీడింగ్‌ చేయని బ్యాంకు ఖాతాల్లో డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత లావాదేవీలన్నీ స్తంభించిపోతాయని.. నగదు తీసుకోవడం, జమచేయటం కూడా కుదరదని మరోసారి స్పష్టం చేసింది. మిగిలిన నాలుగు నెలల వ్యవధిలోనే ఆధార్‌ కార్డుల సీడింగ్‌ను పక్కాగా పూర్తిచేసేలా బ్యాంకులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది. గడువు తేదీ సమీపిస్తే ఒక్కసారిగా ఖాతాదారుల రద్దీ పెరిగిపోతుందని, అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
 
ధ్రువీకరణ తప్పనిసరి
కేంద్ర ఆర్థిక శాఖ సూచనల ప్రకా రం.. ఇప్పటికే ఆధార్‌ కార్డులు, పాన్‌ కార్డులను సమర్పించిన ఖాతాదారులు సైతం తమ బ్యాంకు ఖాతా వివరాలతో వాటిని ధ్రువీకరించుకోవాలని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆధార్‌ కార్డు తమదేనని ధ్రువీకరించేందుకు మొబైల్‌ ‘వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)’లేదా బయో మెట్రిక్‌ విధానం ద్వారా బ్రాంచికి రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. విధిగా ఖాతాదారులందరూ బ్యాంకు శాఖలను సంప్రదించి ఆధార్‌ సీడింగ్‌ చేసుకోవాలని సూచిస్తున్నాయి.
 
ఎందుకింత నిర్లిప్తత?
ఆధార్‌ సీడింగ్‌పై కేంద్రం హెచ్చరించినా బ్యాంకర్లు నిర్లిప్తంగా వ్యవహరిం చడమే సమస్యకు కారణమనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఆధార్‌ కార్డులు, పాన్‌కార్డుల వివరాలను తమ ఖాతాల్లోని వివరాలతో సరిపోల్చుకునేందుకు బ్యాం కులకు అవకాశమున్నా.. పొరపాట్లు తలె త్తడం గమనార్హం. అయితే బ్యాంకులకు వచ్చే ఖాతాదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని.. ఆన్‌లైన్, డిజిటల్‌ లావా దేవీలు పెరగడంతో పూర్తిస్థాయిలో ఆధార్‌ సీడింగ్‌ చేయలేకపోతున్నట్లు ఇటీవలి వీడియో కాన్ఫరెన్స్‌లో బ్యాంకర్లు వివరణ ఇచ్చారు. కానీ తొలిసారి సీడింగ్‌ చేసినప్పు డే ధ్రువీకరించుకుని (అథెంటికే షన్‌ చేసి) ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యం లోనే ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి, తగిన ప్రచారం చేసి ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement