పేదోడికి ఏసీ బోగీ!
- రైళ్లలో కొత్తగా ఫోర్ టైర్ ఏసీ శ్రేణి బోగీలు
- ప్రారంభించనున్న రైల్వే
- స్లీపర్‌కు ఎక్కువ, థర్డ్ ఏసీకి తక్కువ ధర
- ఆదాయం పెంచుకునేందుకు ప్రణాళిక
రైళ్లలో ఏసీ శ్రేణిలో ప్రయాణమంటే దిగువ మధ్య తరగతి, పేద ప్రజలు బాబోయ్ అంటారు. సాధారణ స్లీపర్ బోగీ కంటే ఏసీ తరగతి ప్రయాణం ఖరీదు కావటంతో ఏసీ బోగీల వైపు చూడరు. ఇది రైల్వేకు నష్టం తెచ్చిపెడుతోంది. స్లీపర్, అన్‌రిజర్వుడ్ బోగీల్లో నామమాత్రపు ధరలే ఉండటంతో రైల్వేకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో తక్కువ ధరకే ఏసీ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవటం ద్వారా ఆదాయం పెంచుకోవటంతో పాటు సాధారణ ప్రజలకు ఏసీ ప్రయాణ వసతి కల్పించినట్లవుతుందని చూస్తోంది. ఇందులో భాగంగా నాలుగో రకం ఏసీ శ్రేణిని కొత్తగా ప్రవేశ పెట్టబోతోంది. దీన్ని ఎకానమీ ఏసీ తరగతులుగా పేర్కొంటోంది. సాధారణ స్లీపర్ తరగతి కంటే ఎక్కువ, మూడో తరగతి ఏసీ టికెట్ కంటే తక్కువ ధర ఉండనుంది. దీన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ మందిని ఏసీ తరగతుల్లోకి మళ్లించి ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే భావిస్తోంది. సాధారణ రైళ్లలోనే ఎకానమీ ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలా లేక హమ్‌సఫర్ రైళ్ల తరహాలో పూర్తిగా ఆ కేటగిరీ రైళ్లనే ప్రవేశపెట్టాలా అనే విషయంలో రైల్వే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని ఆ కేటగిరీని అందుబాటులోకి తేవాలని రైల్వే భావిస్తోంది.
–సాక్షి, హైదరాబాద్
థర్డ్ ఏసీకి ఆదరణ పెరగటంతోనే..
రైలు ప్రయాణికుల్లో 80 శాతం మంది స్లీపర్ తరగతుల్లో ప్రయాణానికి మొగ్గు చూపుతు న్నారు. అందుకే రైళ్లలో ఈ బోగీల సంఖ్య ఎక్కువ. కానీ కొంతకాలంగా మూడో తరగతి ఏసీ బోగీలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రజల ఆదాయం పెరగటమే దీనికి కారణమని ఇటీవల సర్వే నిర్వహించి రైల్వే తేల్చింది. ఫలితంగా రైల్వే ఆదాయం కూడా పెరగటంతో క్రమంగా థర్డ్ ఏసీ బోగీల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. వీలైతే కొన్ని రైళ్లలో ఏసీ మొదటి తరగతిని పూర్తిగా ఎత్తేసి, కొన్ని స్లీపర్ బోగీల సంఖ్య తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచాలని నిర్ణయించి త్వరలో అమలుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అసలు, థర్డ్ ఏసీ కంటే కొంత తక్కువ ధరకే ఏసీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తే స్లీపర్ కేటగిరీ ప్రయాణికుల్లో సగం మంది అటు మళ్లుతారని తాజాగా రైల్వే అంచనాకొచ్చింది. దీంతో ఎకానమీ ఏసీ పేరుతో కొత్త కేటగిరీ సృష్టించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
ఏంటీ కేటగిరీ..
ఏసీ శ్రేణి నిర్వహణ రైల్వేకు ఖర్చుతో కూడిన అంశం. సీట్లు మెరుగ్గా ఉంచాలి.. ఏసీ ఏర్పాటు.. రగ్గులు, దిండ్లు, బెడ్‌షీట్లు ఇవ్వాలి. వాటిని రోజూ ఉతికి శుభ్రం చేయాలి.. ప్రత్యేకంగా సిబ్బంది ఉంచాలి. దీంతో వీటి నిర్వహణ ఖర్చు ఎక్కువ. వీటికి అనుగుణంగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఆదాయం ఎక్కువే. కానీ కొత్తగా ప్రవేశపెట్టనున్న ఎకానమీ ఏసీ బోగీల నిర్వహణ అంత ఖర్చు కాదు. ఇందులో ఉష్ణోగ్రత 24–25 డిగ్రీల మేర ఉంటుంది. అంటే ఏసీ ఖర్చు నామమాత్రమే. చలి ఉండనందున దుప్పట్ల ఖర్చు ఉండదు. సాధారణ స్లీపర్ తరహా బోగీలోనే ఏసీ వసతి కల్పిస్తారన్నమాట. గది ఉష్ణోగ్రత కన్నా కాస్త చల్లదనం ఉంటుంది.
ఫలితంగా బయట ఎండ వేడిమి లోనికి రాకుండా చల్లటి వాతావరణం ఉండటంతో ప్రయాణికులు కూడా హాయి అనుభూతి పొందుతారు. చలికాలంలో బయటి చలి కంటే లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి అతి చలి ప్రభావం నుంచీ ఉపశమనం పొందుతారు. హాయినిచ్చే ప్రయాణం, అటు రైల్వేకు టికెట్ ధర పెంపు వల్ల ఆదాయం ఎక్కువ, ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం లేనందున నిర్వహణ వ్యయం తక్కువ.. ఇలా అన్ని రకాలుగా ఇది లాభదాయకంగా ఉంటుందని రైల్వే భావిస్తోంది. త్వరలోనే దీనికి అనువైన బోగీలను సమకూర్చుకునే కసరత్తు మొదలుపెట్టింది. అయితే ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేసినా, మొత్తం అదే కేటగిరీతో ప్రత్యేక రైళ్లను ప్రారం భించినా దక్షిణ మధ్య రైల్వేకు ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెపుతు న్నారు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం మార్గాల్లో వీటిని కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.