గగన్‌పహాడ్ ఆయిల్ పరిశ్రమలో ప్రమాదం
ముగ్గురి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
హైదరాబాద్ : వంట నూనె తయారీ పరిశ్రమలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్‌లోని గోవర్ధన్ ఆయిల్ తయారీ పరిశ్రమలో మద్దెల యాదవ్(30), మాధవ్(28), సురేష్ (28), సుజాదుద్దీన్, సంజయ్‌కుమార్ కార్మికులుగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం నూనె తయారీ పైపుల అడుగు భాగంలో ఉన్న హౌజ్‌లోని వ్యర్థాలను తొలగించేందుకు వీరు వెళ్లారు. ఈ సమయంలో అందులోని విషవాయువు కారణంగా స్పృహ కోల్పోయారు. విషయాన్ని గమనించిన ఇతర కార్మికులు వారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా మద్దూరు మండలం చిన్న ఎక్కులారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు యాదవ్, మాధవ్‌లతోపాటు బీహార్‌కు చెందిన సురేష్‌లు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముస్తఫానగర్‌కు చెందిన సుజాదుద్దీన్, బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఏసీపీ సుదర్శన్, సీఐ సుధాకర్‌లు పరిశ్రమలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యం అందుబాటులో లేదు. కార్మికుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కార్మికులు మృతిచెందినా యజమానులెవరూ అక్కడకు రాకపోవడంపై మృతుల కుటుంబసభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.