ఆర్టీసీ చేజారనున్న గిన్నిస్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తవు రోడ్డు రవాణా సంస్థగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రికార్డును దూరం చేసుకోబోతోంది. దేశంలో మరే రోడ్డు రవాణా సంస్థకు సాధ్యం కాని ఈ రికార్డు పదిహేనేళ్లపాటు పదిలంగా ఉండి... మరికొద్ది రోజుల్లో చేజారబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బస్సులను సమర్థవంతంగా నడుపుతున్న ఏకైక సంస్థగా ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రపుటల్లో నిలిచింది.
సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ దీన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రభుత్వ సంస్థలకుగాని, ప్రైవేటు సంస్థలకుకాని ఇలా ప్రపంచంలో ఎక్కడా ఏపీఎస్ ఆర్టీసీకి ఉన్నన్ని బస్సులు లేవు. 1999 అక్టోబర్ 31న ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ దీన్ని తన పుస్తకంలో నమోదు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అధికారికంగా ఆహోదాను ఇచ్చింది. ఆ సమయంలో ఏపీఎస్ ఆర్టీసీకి 18397 బస్సులున్నాయి. ఇన్ని బస్సులను ఒకే సంస్థ సమర్థవంతంగా నిర్వహించటం ఓ అరుదైన అంశమని అప్పట్లో ‘గిన్నిస్’ కితాబిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఘనత మన ఆర్టీసీ పేరనే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం 22459 బస్సులతో అది మరింత ఉన్నతంగా ఎదిగింది.
రాష్ట్ర విభజనతో రెండు ముక్కలు...
రాష్ట్ర విభజనతో ఆర్టీసీని రెండు రాష్ట్రాలు పంచుకుంటున్నారుు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు 12 వేల బస్సులు, తెలంగాణకు 10 వేల బస్సులు దక్కనున్నాయి. దీంతో అత్యధిక బస్సులు నడుపుతున్న సంస్థ రెండు ముక్కలు కానుండటంతో గిన్నిస్ రికార్డు చేజారనుంది. కొద్ది రోజుల్లో ఆర్టీసీ విభజన జరిగిన క్షణం గిన్నిస్ రికార్డు చేజారిపోతుంది.
పోటీలో మహారాష్ట్ర...
ప్రస్తుతం దేశంలో ఏపీఎస్ ఆర్టీసీ తర్వాత మహారాష్ట్ర ఆర్టీసీ అత్యధిక బస్సులు నడుపుతోంది. అక్కడ దాదాపు 17 వేల వరకు బస్సులున్నాయి. గిన్నిస్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ పేరు తొలగిపోగానే దాన్ని మహారాష్ట్ర ఆక్రమించే అవకాశం ఉంది.
ఇదీ ఆర్టీసీ స్వరూపం...
* నిజాం స్టేట్ రైల్వే-రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ పేరుతో 1932లో 27 బస్సులు.. 166 మంది సిబ్బందితో మొదలైంది. దేశంలో తొలుత జాతీయమైన రవాణా సంస్థ ఇదే.
* 1958లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుతం 22459 బస్సులు, 1.22 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.
* డిపోలు: 216, స్టేషన్లు 777
* వెన్నెల స్లీపర్ బస్సులు, గరుడ ప్లస్, గరుడ, ఇంద్ర, శీతల్ పేరుతో ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, ఆర్డీనరీ పేరుతో నాన్ ఏసీ బస్సులు నడుపుతోంది.