సాక్షి, సిటీబ్యూరో: వందేళ్ల నాటి వస్తువేదైనా పురాతన వస్తువుల జాబితాలోకి చేరిపోతుంది. జాతి సంపదగా పరిగణించే వీటిని కలిగి ఉండాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా ప్రత్యేక అనుమతులు అవసరం. ఇవేవీ లేకుండా 102 ఏళ్ల నాటి టెలిస్కోప్‌ను విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తుల్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని జ్యోతినగర్‌కు చెందిన షేక్ దస్తగిరి కేటీపీఎస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు.
కేటీపీఎస్‌లో తనతో పాటు పని చేసిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మనీష్ విక్టోరియన్ మెరైన్ టెలిస్కోప్‌ను తీసుకువచ్చాడు. 1915లో లండన్‌కు చెందిన డబ్ల్యూ.ఓట్వే అండ్ కంపెనీ తయారు చేసినట్లు ముద్రించి ఉన్న దీన్ని దస్తగిరి వద్ద తాకట్టు పెట్టిన మనీష్ కొంత మొత్తం తీసుకున్నారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో టెలిస్కోప్ దస్తగిరి వద్దే ఉండిపోయింది. ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతడు ఆ టెలిస్కోప్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించాడు. కమీషన్ తీసుకుని విక్రయించడానికి తన స్నేహితులు కె.అజయ్, మహ్మద్ ఖలీల్‌లను సంప్రదించాడు. మంగళవారం ఈ ముగ్గురూ టెలిస్కోప్‌తో చంద్రాయణగుట్ట ప్రాంతంలో సంచరిస్తూ ఖరీదు చేసే వారి కోసం ప్రయత్నిస్తున్నారని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ముగ్గురినీ అరెస్టు చేసి టెలిస్కోప్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.
వందేళ్లనాటి టెలీస్కోప్..విక్రయానికి యత్నం
Published Tue, Jul 25 2017 7:33 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
Advertisement