హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 107వ జయంతి వేడుకలను గురువారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఘనంగా నిర్వహించింది. ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన బ్రహ్మానంద రెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు ఎన్. తులసిరెడ్డి, మాదాసు గంగాధరంలు సూర్యానాయక్, కిసాన్ సెల్ చైర్మన్ కే రవిచంద్రారెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మానందరెడ్డి, వైయస్ఆర్ లు బతికుంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఉండేది కాదన్నారు.
1946లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాసు.. 1977లో ఏఐసిసి అధ్యక్షులుగా ఎంపికయ్యారని గుర్తుచేశారు. బ్రహ్మానంద రెడ్డి వారసుడిగా కాసు వెంకట కృష్ణారెడ్డి రావాలని కోరుకుంటున్నామని గంగాధరం అన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినపుడు హైదరాబాద్ లో అనేక జాతీయ పరిశ్రమల స్థాపనకు కృషి చేసి అభివృద్ధికి కారణమయ్యారని చెప్పారు. నాగార్జునసాగర్, తుంగభద్ర, పోచెంపాడు పనులు బ్రహ్మానందరెడ్డి హయాంలోనే పూర్తి అయ్యాయని అన్నారు.