ఎస్సారెస్సీకి బాబ్లీ నీళ్లు | babli water SRC | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్సీకి బాబ్లీ నీళ్లు

Published Wed, Jun 29 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

babli water SRC

- నేటి అర్ధరాత్రి గేట్ల ఎత్తివేత
-గోదావరిలో పెరగనున్న నీటి ప్రవాహం
-త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో విడుదల

భైంసా

 గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలుకాలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అర్ధరాత్రి తెరవనున్నారు. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి నీటిని వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది నీటి సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రకు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లను పైకి ఎత్తనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి నది ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో అడుగిడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు వరకు ఈ నది ప్రవాహం ఉంటుంది.


గోదావరి నదిలో వర్షపు నీరు..
వర్షాలు లేక గతేడాది ఎస్సారెస్పీలో నీరు చేరలేదు. పుష్కరాల సమయంలో గేట్లు ఎత్తడంతో ఆ నీరు బాసర వరకు చేరింది. వర్షాలు లేక గోదావరి నదిలో తవ్విన ఇసుక గుంతల్లోనే ప్రాజెక్టు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మంజీర ఉపనదితో వచ్చే నీరు బాసర వద్ద నిలిచి ఉంది. జూన్ మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. బాసర గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద వర్షపునీరు చేరింది. రైలు, బస్సు వంతెనల నుంచి నదిలో నీరు కనిపిస్తోంది. గతేడాది నుంచి ఎడారిలా కనిపించిన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది.


ఎస్సారెస్పీకి నీరు..
బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తనున్న నేపథ్యంలో ఎస్సారెస్పీలోకి నీరు చేరుతుందని రైతులు ఆశిస్తున్నారు. పైగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరంతా గోదావరి నదిగుండా ఎస్సారెస్పీకి వస్తుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు 14 గేట్లు పైకి ఎత్తి ఉంచడంతో సహజ నది నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు. గోదావరి నది ప్రవహిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలతో నీరంది పంటలు పండుతాయి. నీరులేక గతేడాది రెండు జిల్లాలోనూ పంటపొలాలన్నీ బీడుభూములుగా మారిపోయాయి. ఈ యేడాది వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వచ్చే నీటితో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల రైతులు వరి పంటలువేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement