నిమ్స్ గతి ఇంతే! | bbnagar nims story | Sakshi
Sakshi News home page

నిమ్స్ గతి ఇంతే!

Published Fri, May 23 2014 4:15 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

నిమ్స్ గతి ఇంతే! - Sakshi

నిమ్స్ గతి ఇంతే!

బీబీనగర్ నిమ్స్‌ను అందరూ కలిసి ముంచేశారు. నిధులిచ్చినా సరిగా పనులు చేయలేదని అధికారులు... బకాయిలు ఇవ్వనిదే మిగిలిన పనులు మొదలు పెట్టేది లేదని కాంట్రాక్టరు... వెరసి రోగులకు అందాల్సిన సేవలు మృగ్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం రెండూ కలిసి ఈ ఆస్పత్రిని లోతుల్లోకి నెట్టేశాయి. విస్మయపరిచే అంశాలేమిటంటే పనుల్లో ఎవరు ఎంత తిన్నారు? ఏ అధికారి ఎంత సామగ్రి అమ్ముకున్నారు? అన్నదానిపైనే ఏళ్ల తరబడి విచారణ కొనసాగడం. వ్యవహారం కోర్టు గుమ్మం తొక్కడంతో సేవలు మరింత దూరమయ్యాయి. అధికారుల సస్పెన్షన్‌ల వరకూ వెళ్లిన ఈ బీబీనగర్ నిమ్స్ కథా కమామిషు నిత్య వివాదాల మయం.
- సాక్షి, సిటీబ్యూరో
 
 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో బీబీనగర్‌లో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తుల రంగాపూర్ నిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసింది. చిన్నపాటి వర్షానికే స్లాబుల నుంచి నీరు కారుతుండడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్ అప్పుడే పాడవ్వడంతో నిర్మాణ పనులు, నిధుల మంజూరీలో అనేక అక్రమాలు జరిగినట్లు, విలువైన టైల్స్, ఫర్నిచర్ కూడా మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిర్మాణ పనులు చాలా వరకు లోపభూయిష్ఠంగా ఉన్నట్లు నిర్ధారించిన విజిలెన్స్ కమిషన్ ఆ మేరకు నివేదిక కూడా అందజేసింది.
 
 కాంట్రాక్టర్ కొత్త పేచీ..
 ఇదే సమయంలో బకాయి చెల్లిస్తే కానీ, మిగిలిన పనులు పూర్తి చేయబోమని కాంట్రాక్టర్ పేచీపెట్టారు. పనులను మధ్యలోనే నిలిపేశారు. నిమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ నరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీబీనగర్ నిమ్స్ నిర్మాణ పనులను సమీక్షించారు. తొలి దశలో భాగంగా 200 పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని భావించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ.60 కోట్లు మంజూరు చేసింది.
 
 చేసిన పనికంటే ఎక్కువ చెల్లింపు...
 మధ్యలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని సదరు కాంట్రాక్టర్‌ను డెరైక్టర్ నరేంద్రనాథ్ కోరగా, పెండింగ్ బకాయితో పాటు ముందస్తుగా మరో రూ.6 కోట్లు చెల్లిస్తేనే మిగిలిన పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేయడంతో ఇదే అంశంపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తై పనులు, చేసిన చెల్లింపులపై అధ్యయనం చేయించాలని భావించింది. ఆ మేరకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్‌చీఫ్ కొండలరావు నేతృత్వంలోని ముగ్గురు రిైటె ర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు మాసాలు శ్రమించి నిర్మాణానికి సంబంధించిన పనులను కాంట్రాక్టర్ సమక్షంలోనే పరిశీలించింది. చేసిన పనికంటే కాంట్రాక్టర్‌కు అధికంగా చెల్లించినట్లు స్పష్టంచేసింది. ఈ విషయంపై సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం కొసమెరుపు.
 
 ఆస్పత్రి అందుబాటులోకి వస్తే...
 స్థానికుల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తొలివిడతగా 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి  తీసుకురావాలని భావిం చారు.  ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనర ల్ మెడిసిన్, జనరల్ సర్జరీలాంటి వివిధ   విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్‌ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
 
 6 నెలలు పడుతుంది...
 నిర్మాణ పనుల్లో చాలా లోపాలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా అందజేసింది. గతంలో పని చేసిన కొంత మంది అధికారులు చేసిన పనికంటే అదనంగా కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరితే చేయని పనులకు ముందే డబ్బు చెల్లించాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ పేచీ పెడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే  కాంట్రాక్టర్‌తో చర్చించాం. ఎంత చెప్పినా వినకుండా వారు కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్‌తో మళ్లీ చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం పనులు ప్రారంభిస్తే కానీ మరో ఆరు మాసాల తర్వాత సేవలు అందుబాటులోకి రాని దుస్థితి.                                                                                                                               
 - డాక్టర్ నరేంద్రనాథ్, డెరైక్టర్ నిమ్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement