‘ఆధార్’ లేకుంటే జప్తే..!
- డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు
- ఆధార్ కార్డు ఉండాల్సిందే లేకుంటే వాహనం జప్తు..
- సైబరాబాద్ పరిధిలో అమలు!
- ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసమే అంటున్న పోలీసులు
- ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి
- 27 నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామన్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్ : వాహనాలు నడపాలంటే కనీసం మన దగ్గర ఉండాల్సినవి డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. అయితే ఈ వాహన పత్రాలతో పాటు ఇకపై ఆధార్ కార్డును కూడా వాహనచోదకులు వెంట ఉంచుకోవాలట. లేకుంటే వాహనం జప్తు చేస్తామని చెబుతున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. డ్రంకన్ డ్రైవర్లు, లెసైన్స్ లేకుండా తిరిగే వ్యక్తుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ను కట్టుదిట్టం చేయడంలో భాగంగా దీనిని తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం సాధారణ తనిఖీలతో పాటు ప్రత్యేక డ్రైవ్‌లను ఈ నెల 27 నుంచి చేపడతామని, ఎవరి వద్దనైనా వాహన డాక్యుమెంట్లతో పాటు ఆధార్ కార్డు లేకపోయినా సదరు వాహనాన్ని జప్తు చేసుకోవడంతో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు.
వ్యక్తి గుర్తింపు కోసమే ‘ఆధార్’
వాహన డాక్యుమెంట్లతో పాటు సదరు వ్యక్తిని గుర్తించడం కోసం ఆధార్ కార్డును తప్పనిసరి చేశామని ట్రాఫిక్ పోలీసులు చెప్తుతున్నారు. దీని ద్వారా తాగి నడిపే డ్రైవర్ల వివరాలను ఆధార్‌తో సేకరించవచ్చంటున్నారు. ఒకవేళ వాహన డాక్యుమెంట్లు ఉండి ఆధార్ లేని వారు ఎవరైనా పట్టుబడితే వారి వాహనాన్ని జప్తు చేస్తామని, తిరిగి ఆధార్ కార్డు వివరాలు ఇచ్చి ఆ వాహనాన్ని తీసుకెళ్లవచ్చని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలకు కారకులై తప్పించుకునే వారిని, నేరం చేసి పారిపోయే వారిని సులభంగా పట్టుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందని చెపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, అనుమానితులను గుర్తించడానికి దీని ద్వారా వీలవుతుందంటున్నారు. స్థానిక చోరులు దొంగతనానికి వెళ్లే సమయాల్లో నంబర్ ప్లేట్ లేని వాహనాలు వినియోగిస్తుంటారని, ఈ డ్రైవ్‌ల ద్వారా వారికి చెక్ పెడతామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనుల కోసమే..
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు ఆధార్ కార్డును వెంటబెట్టుకోవాలని సాధారణ జనాన్ని కోరుతున్నాం. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ చాలా మంది దగ్గర డ్రైవింగ్ లెసైన్స్ ఉండటం లేదు. అలాగే చాలా మంది మైనర్లు దొరుకుతున్నారు. అటువంటి వాళ్ల ఐడెంటిటీ కోసమే ఆధార్ కార్డు వెంటబెట్టుకోవాలని చెప్తుతున్నాం. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలు చేస్తున్నవారు.. నేరాలకు పాల్పడి తప్పించుకుపోయేవాళ్లను నియంత్రించేందుకు.. ప్రజల భద్రత కోసం అందరూ ఆధార్ కార్డు వెంట ఉంచుకుంటే మంచిది. దీనికి ప్రజలంతా సహకరించాలి.
- ఏఆర్ శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ