మెహిదీపట్నం, న్యూస్‌లైన్: అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణంపైకి తెచ్చింది. మరమ్మతుల కోసం తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లోకి ద్విచక్ర వాహనం నిలువునా దిగబడిపోయింది. దానిపై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్ర గాయాలపాలు కాగా, వెనుక కూర్చున్న బాలుడు పక్కకు దూకి బయటపడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్ అసదుద్దీన్ కుమారుడు వసీముద్దీన్ (17) గుడిమల్కాపూర్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం రాత్రి 9 గంటల సమయంలో జయభూషణ్ ఆస్పత్రి నుంచి వివేకానంద కాలనీ లోపలికి వస్తున్నాడు. రోడ్డు మధ్యలో పెద్ద మ్యాన్‌హోల్‌కు సగం మరమ్మతులు చేసి వదిలేశారు. మరమ్మతులో ఉందన్న కనీస సూచికను కూడా జలమండలి అధికారులు ఏర్పాటు చేయలేదు. దీనికితోడు అక్కడున్న వీధి దీపం కూడా వెలగకపోవడంతో వసీముద్దీన్ తన ద్విచక్రవాహనంతో వెళ్తూ మ్యాన్‌హోల్ కనిపించకపోవడంతో అందులో పడి పోయాడు. ద్విచక్రవాహనం పూర్తిగా తలకిందులుగా అందులో పడిపోయింది. అదృష్టవశాత్తు అతను గాయాలతో బయటపడ్డాడు. అతని వెనుక ఉన్న బాలుడు పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది యాదయ్య, శ్రీకాంత్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలకు గురైన వసీముద్దీన్‌ను నానల్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
మూడు రోజులుగా పడుతూనే ఉన్నారు
టఈ మ్యాన్‌హోల్ కొద్ది రోజులుగా శిథిలావస్థలో ఉంది. దీనికి మరమ్మతులు చేయాల్సిందిగా స్థానికులు జలమండలి అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేయడంతో..వారు తీరిగ్గా నాలుగురోజుల క్రితం స్పందించారు. అప్పటి నుంచీ మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. శుక్రవారం కూడా ఈ మ్యాన్‌హోల్‌లో ఇద్దరు యువకులు పడి స్వల్ప గాయాలతో బయటపడినట్లు పక్కనే ఉన్న దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రమాదకరంగా ఉన్న ఈ మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
మ్యాన్‌హోల్‌లోకి బైక్ యువకుడికి తప్పిన ముప్పు
Published Sun, Aug 18 2013 1:22 AM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM
Advertisement