
కేన్సర్ నయంకాని జబ్బు కాదు
- దానిని పాజిటివ్ దృక్పథంతో ధైర్యంగా ఎదుర్కోవాలి
- కేన్సర్ సదస్సులో ప్రముఖ సినీనటి మనిషా కొయిరాలా
- కేన్సర్‌తో జర్నీ నొప్పితో కూడింది.. అయినా పాజిటివ్‌గా చూడాలి
- అంతా మరిచిపోయి కుటుంబ సభ్యుల మధ్య హాయిగా గడపాలి
సాక్షి, హైదరాబాద్: ‘కేన్సర్‌తో కూడిన జర్నీ చాలా నొప్పితో కూడింది. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాజిటివ్ దృక్పథంతో, ధైర్యంగా ఎదుర్కోవాలి. కేన్సర్ ఉన్న ట్లు తెలిసిన వెంటనే చాలామంది మానసికంగా కుంగిపోతారు. మనోధైర్యాన్ని కోల్పో యి మృత్యువాత పడుతున్నారు. నిజానికి కేన్సర్ నయం కాని జబ్బేమీ కాదు. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే కేన్సర్ నుంచి బయటపడొచ్చు’అని కేన్సర్ నుంచి విముక్తి పొందిన ప్రముఖ సినీనటి మనిషా కొయిరాలా పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో శనివారం నిర్వహించిన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’సదస్సులో మనీషా పాల్గొన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘కేన్సర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే నేను ఓ సాధారణ రోగిలా ఆందోళన చెందాను. కీమోథెరపీ అంటే భయపడ్డాను. ఎక్కువ కాలం జీవించనేమోనని ఆందోళన చెందాను. వైద్యు ల స్ఫూర్తితో పాజిటివ్‌గా ఆలోచించాను. చికిత్సతో వ్యాధి నుంచి విముక్తి పొందాను. ప్రతి ఒక్కరూ ఇలాగే పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి.. ధైర్యంగా ముందుకు సాగాలి’అని సూచించారు. ఈ సమయంలో ఒంటరిగా కూర్చుని బాధపడే కంటే.. అన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల జీవితకాలాన్ని పెంచుకోవచ్చన్నారు.
జీవనశైలి మార్చుకోవాలి..
అపోలో ఆస్పత్రికి చెందిన ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. 55% కేన్సర్లను నయం చేయవచ్చన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, పరి సరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు తాగడం, మందు, మాంసం వంటి అలవాట్లకు దూరం గా ఉండటం, రోజూ వ్యాయామం చేయడం, వేళకు తినడం, నిద్రపోవడం ద్వారా వ్యాధు లు రాకుండా చూసుకోవచ్చన్నారు. కన్సల్టెం ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ.. విదేశాలతో పోలిస్తే దేశంలోనే అధికంగా కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. మనదేశంలో 40 ఏళ్లు దాటినవారు ఎక్కువగా కేన్సర్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇప్పటికై నా జీవనశైలిని మార్చుకోవాలని, లేదంటే భవిష్యత్తులో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో 60% మంది రోగులు ఫోర్త్ స్టేజ్‌లో వైద్యులను ఆశ్రయిస్తున్నారని, వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రులకు రావడంతో ఏమీ చేయలేక పోతున్నారని తెలిపారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. కేన్సర్ ఉన్నట్లైతే అది ముందే హెచ్చరికలు ఇస్తుందని.. శరీరంపై మచ్చలు ఏర్పడటం, బ్లీడింగ్ వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. సదస్సులో అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా, ఉస్మానియా వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శశికళ, ఫిక్కి ఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్ పద్మ రాజగోపాల్, జుడే ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్ ఎండీ సమంతారెడ్డి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టీపీఎస్ భండారి, హెమ టో ఆంకాలజిస్ట్ డాక్టర్ పద్మజా లక్కిరెడ్డి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.