అంబరాన్నంటిన సంబరాలు
సాక్షి, సిటీబ్యూరో:
నగరంలో తెలంగాణ సంబరాలు అంబరాన్నంటాయి. అడుగడుగునా ‘జయహో తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. బిల్లుపై మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చిన తెలంగాణవాదులు బైక్‌ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు టపాసులు కాల్చి, మిఠాయీలు పంచుకున్నారు. గన్‌పార్కు తెలంగాణ ఉద్యమకారులతో పోటెత్తింది. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, తెలంగాణ ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గన్‌పార్కు అమరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, క్లాక్‌టవర్ అమరుల స్తూపం, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో విజయోత్సవ ప్రదర్శనలు నిర్వహించారు. ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కేపీహెచ్‌బీ, ఉప్పల్, కుషాయిగూడ, బాలానగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, టోలీచౌకీ తదితర శివారు ప్రాంతాల్లోనూ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని స్వాగతిస్తూ ప్రదర్శనలు చేశారు. నాంపల్లి టీఎన్జీవోస్ కార్యాలయం, టీజీవో భవన్, గగన్‌విహార్, ఏపీ హౌసింగ్‌బోర్డు తదితర కార్యాలయాల్లోను ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్‌టీయూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇఫ్లూ, నిజాం కాలేజ్ తదితర విద్యాసంస్థల ప్రాంగణాల్లో తెలంగాణ వేడుకలు జరిగాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లో....
నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డు, ఆర్టీసీ, ఆర్టీఏ, రైల్వే, కలెక్టరేట్ తదితర కార్యాలయాల్లో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు తెలంగాణ సంబురాలు జరుపుకున్నారు. మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించిన ఉద్యోగులు తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన అనంతరం కార్యాలయూల ప్రాంగణాల్లోకి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు.
టీడబ్ల్యూజేయూ హర్షం
అంబర్‌పేట, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీడబ్ల్యూజేయూ) హర్షం వ్యక్తం చేసింది. బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు, జర్నలిస్టులకు అభినందనలు తెలియజేసింది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, రాష్ట్రం పునర్‌నిర్మాణంలో జర్నలిస్టులు కూడా భాగస్వాములవుతారని యూనియన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు.
ఉద్యవుకారులకు టీ లోక్‌సత్తా అభినందన
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదంతో తెలంగాణ ప్రజల ఉద్యమానికి ఫలితం దక్కిందని టీ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మున్నారం నాగరాజు పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న లోక్‌సత్తా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఆనంద తాండవం
Published Wed, Feb 19 2014 5:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement