♦ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలపై కేంద్రం అనుమానం
♦ నీతి ఆయోగ్ నమూనాలో వినియోగ పత్రాలు
♦ సమర్పించాలని ఆదేశం.. రూ.1,176.50 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుంగులూ, ఆర్భాటాలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఇప్పటివరకూ తామిచ్చిన నిధులకు లెక్కలు చెబితేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత రెండేళ్లలో కేటాయించిన రూ.700 కోట్లకు నీతి ఆయోగ్ పేర్కొన్న నమూనాలో వినియోగ పత్రాలను సమర్పించాలని స్పష్టంచేసింది. రెవెన్యూ లోటు రాష్ట్రం పేర్కొన్న మేరకు లేదంటూ సగానిపైగా కోత విధించింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ, ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,976.50 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,176.50 కోట్లను వెంటనే విడుదల చేస్తామని తెలిపింది.
వినియోగ పత్రాలను విశ్వసించని నీతి ఆయోగ్ : రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.700 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.1,050 కోట్లను కేంద్రం విడుదల చేసింది. జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులను పూర్తిగా వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వినియోగ పత్రాలను నీతి ఆయోగ్ విశ్వసించలేదు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించారంటూ అనుమానం వ్యక్తం చేసింది.జిల్లాల వారీగా పనుల పురోగతిని వివరించాలని ఆదేశిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
పనులపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామంది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్రం 2014-15లో రూ.500 కోట్లు, 2015-16లో రూ.550 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఈ నిధులను కన్సల్టెంట్లకు, భూములిచ్చిన రైతులకు పరిహారంగా, డిజైన్లు, మాస్టర్‌ప్లాన్లకు వ్యయం చేసినట్లు రాష్ట్రం వినియోగ పత్రాలను సమర్పించింది. దీనిపై కూడా నీతి ఆయోగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజధానిలో ఏయే భవనాలు నిర్మించారో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నివేదికను పంపాలని పేర్కొంది. నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తేనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన రూ.450 కోట్లను విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.