
‘13 ఏళ్ల క్రితమే తెహల్కా చెప్పింది’
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటించినా, ప్రకటించకపోయినా తెలుగు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల ప్రకటన అంతా బోగస్ అని కొట్టిపారేశారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ‘తెహల్కా’ 13 ఏళ్ల క్రితమే ప్రకటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆస్తుల ప్రకటన కంటే మరో పెద్ద జోక్ ఇంకోటి ఉండదని, ఆస్తుల ప్రకటన దిగజారుడు రాజకీయమని ఆయన విమర్శించారు. బాబు ఆస్తుల ప్రకటన చూస్తే అంబానీ, అదానీలు పేదవాళ్లం అని చెప్పుకున్నట్లు ఉందని భూమన వ్యాఖ‍్యానించారు. చంద్రబాబు అవినీతి సొమ్మును చూడటానికి ప్రజలకు రెండు కళ్లు చాలవని, ఆయన ఆస్తులు పెరిగితే ఏపీలో పేదరికం పెరిగినట్లేనని అన్నారు.
చంద్రబాబు ఆస్తులు తగ్గినప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారని భూమన అన్నారు. నారా లోకేశ్ చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు కుటుంబం పేదరికాన్ని చూసి రాష్ట్ర ప్రజలంతా జాలిపడి తలా రూ.వంద ఇచ్చి ఆదుకోవాలన్నారు. బాబు ఆస్తులపై ట్రాఫిక్ కానిస్టేబుల్తో విచారణ జరిపించినా వాస్తవాలు తెలిసిపోతాయన్నారు.