చేరా ఇకలేరు
కళ్లు చెమర్చిన సాహితీ లోకం
శోకసంద్రంలో ఆత్మీయులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాషా శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు ఆచార్య చేకూరి రామారావు (79) కన్నుమూశారు. గురువారం సాయంత్రం రాజధాని నగరంలోని హబ్సిగూడ వీధి నెంబర్-8లో గల తన స్వగృహంలో ధ్యానం చేస్తూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందరికీ చేరాగా సుపరిచితుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలూకా ఇల్లిందలపాడులో 1935లో జూలై 1న జన్మించారు. ఉస్మానియాలో ఎంఏ తెలుగుతో పాటు లింగ్విస్టిక్స్ ఎంఎ, పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.
వచన కవిత్వంలో దిట్ట అయిన చేరా వివిధ దినపత్రికల్లో అనేక వ్యాసాలు, చేరాతలు రాశారు. తెలుగు వాక్యం, వచన రచన, తెలుగులో వెలుగులు, ఇంగ్లీషు తెలుగు పత్రికా పదకోశం, ముత్యాల సరాల ముచ్చట్లు, చేరా పీఠికలు తదితర రచనలు చేసి భాషావ్యాప్తికి తనవంతు కృషి చేశారు. ఇటీవల ఆయన రచించిన ‘స్మృతికిణాంకం’కి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. రామారావుకు భార్య రంగనాయకితో పాటు విజయశేఖర్, సంధ్య, క్రిష్టఫర్ అనే ముగ్గురు సంతానం. పిల్లలు అమెరికాలో ఉండటంతో, వారి రాక కోసం భౌతికకాయాన్ని ఎల్.బి నగర్‌లోని కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు.
చంద్రబాబు సంతాపం: చేరా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయనేత కె. నారాయణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ట కార్యదర్శులు కె. రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి, సీపీఐ శాసనసభాపక్ష మాజీ ఉప నేత కూనంనేని సాంబశివరావు, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ప్రముఖ జానపద పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు: జగన్
చేరా మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వాడుక భాషను కొత్త పుంతలు తొక్కించేందుకు చేరా ఎంతగానో కృషి చేశారని, తెలుగు సాహితీ విమర్శకుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. చేరా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
సాహితీ శిఖరం నేలకూలింది
చేకూరి రామారావు(చేరా) మృతితో తెలంగాణ భాషా, సాహితీ శిఖరం నేలకూలిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు భాషలో ఉన్న అతికొద్ది మంది సా హితీవేత్తల్లో చేరా ప్రముఖుడని, గణనీయుడని కొనియాడారు. తెలుగు సాహితీ లోకానికి, భాషా ప్రియులకు చేరా మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.