చికెన్ @ 210 నాటౌట్!
► కోళ్లకూ సన్‌స్ట్రోక్
హైదరాబాద్: పెరుగుతున్న ఎండలతో పాటే చికెన్ ధరలు మండిపోతున్నాయి. మాంసాహారులకు వీటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా కిలో కోడిమాంసం రూ.200 పైకి చేరుకుంది. సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది. ఎండాకాలంలో కోళ్లు నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మేత తక్కువగా తింటాయి. దీనివల్ల అవి బరువు తగ్గిపోతాయి. మరోవైపు దాణా ధరలు భారీగా పెరగడం కూడా చికెన్ ధర ఎగబాకడానికి కారణమని వ్యాపారులు చెప్పుతున్నారు..
మరోవైపు చికెన్ ధర పెరగడంతో అమ్మకాలు బాగా తగ్గాయని.. నష్టాలను తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లోనే వీటి ధరలు పెంచాల్సి వచ్చిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. ఎండలు తగ్గి, వాతావరణం చల్లబడే దాకా చికెన్ ధరలు భారంగానే ఉంటాయని అంటున్నారు. అంటే జూన్ వరకు చికెన్ మధ్య తరగతి వారికి దూరంగానే ఉంటుంది. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో ఆ లిస్ట్లో చికెన్ కూడా చేరిపోయిందని మాంసం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నాన్ వెజ్ తీసుకోపోవడమే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.