గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
⇒ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ప్రసంగించేందుకు రావాల్సిందిగా ఆహ్వానం
⇒ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,బడ్జెట్ ప్రాధాన్యాలపై చర్చ!
⇒ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం కానున్నాయి. ఏడో విడత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ప్రసంగానికి గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చే వార్షిక బడ్జెట్ ప్రాధాన్యాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న విభజన వివాదాలపై ఈ నెల 9న గవర్నర్ సమక్షంలో జరిగే ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశంపై కూడా చర్చించినట్లు సమాచారం.
నేడు రాజ్‌భవన్‌లో సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభోత్సవం
రాజ్‌భవన్‌లో కొత్తగా నిర్మించిన సిబ్బంది క్వార్టర్స్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ గృహ సముదాయాన్ని ప్రారంభించే ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులతో పాటు రాజ్‌భవన్ సిబ్బంది పాల్గొననున్నారు. గతేడాది ఫిబ్రవరి 17న రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి గవర్నర్ దంపతులు, సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్ల స్థానంలోనే రూ.97.50 కోట్లతో కొత్త క్వార్టర్లు నిర్మించారు. 185 మంది సిబ్బంది ఉండేలా క్వార్టర్లతో పాటు పాఠశాల, కమ్యూనిటీ హాల్, సెక్యూరిటీ బ్యారెక్‌ను నిర్మించారు.