హైదరాబాద్ : విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, పిల్లలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ఏర్పాటుచేసిన ‘భరోసా’ కేంద్రం తెలంగాణ మహిళలకు భరోసాను కలిగిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హకాభవన్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన భరోసా కేంద్రాన్ని డీజీపీ అనురాగశర్మతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇప్పటికే మహిళలు, అమ్మాయిలను వేధించే ఈవ్‌టీజర్ల ఆటకట్టించేందుకు షీ టీమ్స్ సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే బాధితులైన, వేధింపులకు గురవుతున్న స్త్రీలు, పిల్లల్లో మనోస్థైర్యం నింపడంతో పాటు వారి జీవితంపై నమ్మకాన్ని కలిగించేందు కోసం నగర పోలీసులు ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మతసామరస్యాన్ని కాపాడుతూ శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులకు దేశస్థాయిలో మంచి పేరు వచ్చిందన్నారు.
ప్రతి ఠాణాకో కౌన్సిలర్, లీగల్ అడ్వైజర్: డీజీపీ
మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కలిగించడంతో పాటు పోలీసు శాఖలోనూ మహిళా సిబ్బందిని పెంచాల్సిన అవసరముందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. షీ టీమ్స్ విజయవంతమైన తర్వాత అటువంటి అధికారుల కోసం వెతికితే సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని సీఎం కేసీఆర్కు వివరించి ప్రతి ఠాణాలో మహిళా సిబ్బంది ఉండాలని కోరితే అందుకనుగుణంగానే 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. మహిళలకు ఆపన్నహస్తం అందించేందుకు ఏర్పాటుచేసిన 'వన్ స్టాప్ సెంటర్' భరోసా తొలి అడుగేనని అన్నారు. నగరంలో ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేగాకుండా ప్రతి ఠాణాలో ఒక కౌన్సిలర్, లీగల్ అడ్వైజర్ ఉండాలనే ఆలోచన చేస్తున్నామని, వీరిని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. ఇలా చేయడం వల్ల మారుమూల గ్రామాల్లోని మహిళలకు త్వరగా న్యాయం జరుగుతుందన్నారు.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది మాట్లాడుతూ.. మహిళల పట్ల మగాళ్ల ఆలోచన విధానంలో మార్పు వస్తే ఇటువంటి సెంటర్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ‘ఈ భరోసా కేంద్రంలో బాధితులకు చట్టం, న్యాయం, వైద్యం, పునరావాస సేవలు అందిస్తాం. భరోసా కేంద్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి బాధితుడికి న్యాయం అందేంత వరకు పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది' అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మహిళ,శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ నగర క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, తరుణి స్వచ్ఛంద సంస్థ స్థాపకురాలు మమతా రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మహిళలకు 'భరోసా'
Published Sat, May 7 2016 3:17 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM
Advertisement
Advertisement