తిరిగి వస్తుందనుకుంటే... | creature appeared daughter | Sakshi
Sakshi News home page

తిరిగి వస్తుందనుకుంటే...

Published Thu, Feb 18 2016 8:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

తిరిగి వస్తుందనుకుంటే...

తిరిగి వస్తుందనుకుంటే...

విగతజీవిగా కనిపించిన కుమార్తె
గత నవంబర్‌లో ప్రేమజంట ఆత్మహత్య
అప్పుడే ప్రియుడే మృతి మూడు నెలల తర్వాత {పియురాలి మృతదేహం గుర్తింపు

 
హయత్‌నగర్: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే భయం ఓ ప్రేమజంటను ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ప్రేమ విషయం తెలిస్తే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని భావించిన ప్రేమికులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన ఊపిరితో సంఘటనా స్థలం నుంచి వచ్చిన ప్రియుడు మార్గమధ్యలో మృతి చెందగా.. 3 నెలల తర్వాత ప్రియురాలి మృతదేహం బయటపడింది. ఇన్నాళ్లూ తమ కూతురు బతికే ఉందని భావించిన తల్లిదండ్రులకు విషాదం మిగిల్చిన ఈ ఘటన బుధవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

 

పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్‌పేట నగరపంచాయతీ పరిధిలోని తట్టిఅన్నారంలో నివశించే బురుగు నారాయణ గౌడ్ స్థానికంగా మిర్చి బండి నిర్వహిస్తుంటాడు. ఆయన కూతురు మానస (18) టైలరింగ్ నేర్చుకునేది. అదే గ్రామంలో నివసించే నల్ల నర్సింహ కుమారుడు హరిబాబు (25) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మానస తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను వరంగల్ జిల్లా గీసుకొండలోని తన పెద్దమ్మ వద్దకు పంపించారు. ప్రియురాలిని మరిచిపోలేక హరిబాబు గత ఏడాది నవంబర్ 20న మానసను బైక్‌పై తీసుకొచ్చాడు.

మరునాడు తెల్లవారుజామున తాము ‘ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం.. చనిపోతున్నాం’ అని హరిబాబు ఫోన్ నుంచి ఇరువురి కుటుంబ సభ్యులకు ఎస్‌ఎంఎస్ పంపారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వారిని వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నవంబర్ 21నపెద్ద అంబర్‌పేట సమీపంలోని పాపాయిగూడ చౌరస్తా వద్ద హరిబాబు అపస్మారక స్థితిలో కనిపించాడు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తేల్చారు. మానస ఆచూకీ దొరకకపోవడంతో.. ఆమె బతికే ఉండవచ్చని తల్లిదండ్రులు భావించారు. ఎంత వెతికినా జాడ లేకపోవడంతో అదే నెల 25న గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అక్కడ మిస్సింగ్ కేసు న మోదు చేసుకున్నారు. మానస కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కొంతకాలంగా తట్టి అన్నారంలో ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో గ్రామస్తులు బుధవారం చుట్టు పక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. గ్రామంలోని గద్దగుండి చెలుక వద్ద నిర్జన ప్రదేశంలో బండరాయిపై ఓ మృతదేహం బయటపడింది. మృతదేహానికి ఉన్న చెవి కమ్మలు, పట్టా గొలుసులు, దుస్తుల ఆధారంగా మానసగా గుర్తించారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ‘మేం ప్రేమించుకుంటున్నాం. ఇది వరకే పెళ్లయింది. పెద్దలకు తెలిస్తే గొడవలు అవుతాయన్న ఉద్దేశంతో చనిపోతున్నాం. ఎవరి బలవంతమూ లేదు’ అని ఆ నోట్‌లో రాసి ఉంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement