మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం రాయికోడ్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో కొన్నాళ్లుగా జింకలను వేటాడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వివరాలను ఎస్పీ పి.విశ్వప్రసాద్ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.
రాయికోడ్ గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు కొంతకాలంగా ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి వచ్చి వన్యప్రాణులను వేటాడేవారు. ఈ క్రమంలోనే రహస్య వ్యక్తులు అందించిన సమాచారంతో నర్వ, దేవరకద్ర ఎస్‌ఐలు తమ సిబ్బందితో ఆకస్మికంగా దాడిచేసి నలుగురు హైదరాబాదీలతో పాటు ఇద్దరు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వేట కోసం తీసుకొచ్చిన రివాల్వర్, ఆరురౌండ్ల బుల్లెట్లు, కారు, పదునైన కత్తి, రూ.1.10లక్షలతో పాటు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.