కీలక ప్రాజెక్టులన్నీ హుష్‌కాకి
‘మహా’ గడ్డుకాలం
=కదలిక లేని బస్సు టెర్మినల్, ట్రక్ పార్కు ప్రాజెక్టులు
=రాజకీయ అనిశ్చితీ కారణమే..
=కలిసిరాని హెచ్‌ఎండీఏ ప్రయత్నాలు
=సొంత ఆదాయ మార్గాలకు గండి
సాక్షి, సిటీబ్యూరో: ఆ రెండూ అత్యంత కీలకమైన ప్రాజెక్టులు.. అవి సాకారమైతే నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే రాజధానిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉండేది. ప్రారంభంలో ఆర్భాటంగా ప్రకటించిన ఇవి ప్రస్తుతం కాగితపు ప్రాజెక్టులుగా మిగిలిపోనున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే నగరం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ).. ఇప్పుడు ప్రాజెక్టుల్లో కదలిక తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ కలిసిరావట్లేదు. నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే (ర్యాంపులు) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండగా, కొత్తగా తలపెట్టిన పీపీపీ ప్రాజెక్టులు సైతం ఆగిపోయాయి.
ఎలాగోలా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు హెచ్‌ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుత రాజకీయ అనిశ్చితి గండికొట్టింది. ఫలితంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులన్నీ అటకెక్కాయి. మియాపూర్‌లో భారీ బస్సు టెర్మినల్, ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరువలో లాజిస్టిక్ పార్కులు నిర్మించాలనే యోచన కార్యరూపం దాల్చి ఉంటే హెచ్‌ఎండీఏకు ఆర్థికంగా ఉపశమనం కలిగేది. కానీ రెండేళ్లుగా ఇవి పట్టాలపైకి ఎక్కడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు కొలిక్కి వస్తున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడంతో కాంట్రాక్టు సంస్థలు వెనకడుగు వేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి కూడా ఉలుకుపలుకు లేకపోవడంతో ఈ రెండు ప్రాజెక్టులు నిలిచిపోయినట్లేనని హెచ్‌ఎండీఏ ఓ నిర్ణయానికి వచ్చింది.
బస్సు టెర్మినల్ తుస్
నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రణకు శివారులోని మియాపూర్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో హెచ్‌ఎండీఏ భారీ బస్సు టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక రచించింది. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. సొంతంగా నిధులు వెచ్చించే పని లేకుండా హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే, వివిధ ప్రభుత్వ విభాగాల అనుమతులు రావాల్సి ఉందంటూ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో మొదటికే ఎసరొచ్చింది.
ప్రాజెక్టు విషయమై మొదట్లో ఏపీఐడీఈ నుంచి అనుమతి పొందిన అధికారులు ఆపై న్యాయ, ఆర్థిక శాఖల నుంచీ ఆమోదం పొందారు. అనంతరం మున్సిపల్ పరిపాలన, పట్టణాభి వృద్ధి శాఖల నుంచి తుది అనుమతి మంజూ రులో జాప్యం జరిగింది. దీనిపై హెచ్‌ఎండీఏ కమిషనర్ కూడా ఆసక్తి చూపకపోవడంతో భారీ బస్సు టెర్మినల్ ప్రాజెక్టు ఇక అటకెక్కినట్టుగానే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి ఉంటే.. నగరంపై తీవ్ర ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేది.
అతీగతీ లేని ట్రక్ పార్కు
ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణించే రవాణా వాహనాలను నిలుపుకొనేందుకు వీలుగా బాట సింగారం, మంగళపల్లిలో నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ హబ్స్ (ట్రక్ పార్కులు) ప్రాజెక్టుకూ కాలం చెల్లినట్లు తెలుస్తోంది. పీపీపీ విధానంలో నిర్మించేందుకు వీటికి టెండర్లు ఖరారైనా ఇంతవరకు అతీగతీ లేదు. ఔటర్‌పై తిరిగే వాహనాలకు ఇది అత్యంత ప్రధానమైన ప్రాజె క్టు అయినప్పటికీ రాష్ట్ర విభజన ప్రకంపనలతో కాంట్రాక్టు సంస్థలు నిరాసక్తత చూపుతున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు ఏదోలా కాంట్రాక్టు సంస్థలపై వత్తిడి తెచ్చి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. కానీ ప్రాజెక్టు ఆదాయ వ్యయాలను లెక్కించుకొన్న ఆయా సంస్థలు తాము చెల్లిం చిన ఈఎండీని వదులుకొనేందుకు సైతం సిద్ధపడినట్లు తెలుస్తోంది.