Outer ringroddu
-
కీలక ప్రాజెక్టులన్నీ హుష్‌కాకి
‘మహా’ గడ్డుకాలం =కదలిక లేని బస్సు టెర్మినల్, ట్రక్ పార్కు ప్రాజెక్టులు =రాజకీయ అనిశ్చితీ కారణమే.. =కలిసిరాని హెచ్ఎండీఏ ప్రయత్నాలు =సొంత ఆదాయ మార్గాలకు గండి సాక్షి, సిటీబ్యూరో: ఆ రెండూ అత్యంత కీలకమైన ప్రాజెక్టులు.. అవి సాకారమైతే నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే రాజధానిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉండేది. ప్రారంభంలో ఆర్భాటంగా ప్రకటించిన ఇవి ప్రస్తుతం కాగితపు ప్రాజెక్టులుగా మిగిలిపోనున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే నగరం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ).. ఇప్పుడు ప్రాజెక్టుల్లో కదలిక తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ కలిసిరావట్లేదు. నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే (ర్యాంపులు) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండగా, కొత్తగా తలపెట్టిన పీపీపీ ప్రాజెక్టులు సైతం ఆగిపోయాయి. ఎలాగోలా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుత రాజకీయ అనిశ్చితి గండికొట్టింది. ఫలితంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులన్నీ అటకెక్కాయి. మియాపూర్‌లో భారీ బస్సు టెర్మినల్, ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరువలో లాజిస్టిక్ పార్కులు నిర్మించాలనే యోచన కార్యరూపం దాల్చి ఉంటే హెచ్ఎండీఏకు ఆర్థికంగా ఉపశమనం కలిగేది. కానీ రెండేళ్లుగా ఇవి పట్టాలపైకి ఎక్కడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు కొలిక్కి వస్తున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడంతో కాంట్రాక్టు సంస్థలు వెనకడుగు వేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి కూడా ఉలుకుపలుకు లేకపోవడంతో ఈ రెండు ప్రాజెక్టులు నిలిచిపోయినట్లేనని హెచ్ఎండీఏ ఓ నిర్ణయానికి వచ్చింది. బస్సు టెర్మినల్ తుస్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రణకు శివారులోని మియాపూర్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ భారీ బస్సు టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక రచించింది. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. సొంతంగా నిధులు వెచ్చించే పని లేకుండా హెచ్ఎండీఏ ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే, వివిధ ప్రభుత్వ విభాగాల అనుమతులు రావాల్సి ఉందంటూ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో మొదటికే ఎసరొచ్చింది. ప్రాజెక్టు విషయమై మొదట్లో ఏపీఐడీఈ నుంచి అనుమతి పొందిన అధికారులు ఆపై న్యాయ, ఆర్థిక శాఖల నుంచీ ఆమోదం పొందారు. అనంతరం మున్సిపల్ పరిపాలన, పట్టణాభి వృద్ధి శాఖల నుంచి తుది అనుమతి మంజూ రులో జాప్యం జరిగింది. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్ కూడా ఆసక్తి చూపకపోవడంతో భారీ బస్సు టెర్మినల్ ప్రాజెక్టు ఇక అటకెక్కినట్టుగానే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి ఉంటే.. నగరంపై తీవ్ర ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేది. అతీగతీ లేని ట్రక్ పార్కు ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణించే రవాణా వాహనాలను నిలుపుకొనేందుకు వీలుగా బాట సింగారం, మంగళపల్లిలో నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ హబ్స్ (ట్రక్ పార్కులు) ప్రాజెక్టుకూ కాలం చెల్లినట్లు తెలుస్తోంది. పీపీపీ విధానంలో నిర్మించేందుకు వీటికి టెండర్లు ఖరారైనా ఇంతవరకు అతీగతీ లేదు. ఔటర్‌పై తిరిగే వాహనాలకు ఇది అత్యంత ప్రధానమైన ప్రాజె క్టు అయినప్పటికీ రాష్ట్ర విభజన ప్రకంపనలతో కాంట్రాక్టు సంస్థలు నిరాసక్తత చూపుతున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు ఏదోలా కాంట్రాక్టు సంస్థలపై వత్తిడి తెచ్చి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. కానీ ప్రాజెక్టు ఆదాయ వ్యయాలను లెక్కించుకొన్న ఆయా సంస్థలు తాము చెల్లిం చిన ఈఎండీని వదులుకొనేందుకు సైతం సిద్ధపడినట్లు తెలుస్తోంది. -
‘ల్యాండ్ పూలింగ్’పై డెవలపర్స్ తర్జనభర్జన
సాక్షి, సిటీబ్యూరో : హెచ్ఎండీఏ తాజాగా తలపెట్టిన భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) వల్ల తమకెంత ప్రయోజనం? అన్నదే ప్రస్తుతం భూ యజమానుల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న భూముల్లో తామే స్వయంగా వెంచర్ అభివృద్ధి చేసుకోవచ్చు గదా..! ఎంతో విలువైన ఈ భూములను హెచ్ఎండీఏకు అప్పగించాల్సిన అవసరమేంటి? అని పలువురు డెవలపర్స్ దీర్ఘాలోచనలో పడ్డారు. చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకొంటే అయ్యే ఖర్చు, హెచ్ఎండీఏకు భూములివ్వడం వల్ల వచ్చే లాభం... తదితరాలపై బేరీజు వేసుకొంటున్నారు. అయితే.. ఈ స్కీంపై రెండుసార్లు సమావేశాలు నిర్వహించిన అధికారులు.. అభివృద్ధి చేసిన వెంచర్లో భూ యజమానులకు ఎంత భూమి ఇస్తారన్నది స్పష్టం చేయకపోవడం డెవలపర్స్‌ను ఆలోచనలో పడేసింది. ప్రాంతాన్ని బట్టి అది నిర్ణయిస్తామని చెప్పడం అనుమానాలు రేకెత్తిస్తోంది. హెచ్ఎండీఏ ఆ ప్రాజెక్టును పూర్తిగా తమకు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఏ ప్రాంతంలో వెంచర్ వేస్తే తమకు ప్రయోజనం ఉంటుందన్న దానిపై డెవలపర్స్ తర్జనభర్జన పడుతున్నారు. ఒకవేళ హెచ్ఎండీఏ అందుకు అంగీకరించకపోతే దానికి సమీపంలోనే తాము అభివృద్ధి చేసే వెంచర్లను ఈ స్కీం కింద కన్వర్టు చేసుకొనేలా ప్రతిపాదన పెట్టాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఔటర్ చుట్టూ ఉన్న భూములన్నీ తమ ఆధీనంలో ఉన్నందున ఈ స్కీం వల్ల తమకు లాభం లేకపోతే అడుగు పెట్టరాదని కొందరు డెవలపర్స్ భావిస్తున్నారు. రైతులు, డెవలపర్స్‌లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన హెచ్ఎండీఏ ఆదిలోనే అస్పష్ట విధానాలు ప్రకటించి అయోమయాన్ని మరింత పెంచడంతో ల్యాండ్ పూలింగ్ స్కీంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఈ స్కీం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది వేయి డాలర్ల ప్రశ్న. ఒకేచోట 200 ఎకరాల్లో అభివృద్ధి చేసే వెంచర్‌లోని ప్లాట్లను 6 నెలల్లో అమ్ముకోలేకపోతే తీవ్రంగా నష్టం చవిచూసే ప్రమాదం ఉందన్న వాదనలూ విన్పిస్తున్నాయి. సమగ్రత ఏదీ? మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయడం ద్వారా నగరం నలువైపులా సమగ్రాభివృద్ధిని సాధించాలన్న హెచ్ఎండీఏ ఆలోచనకు తానే అవరోధాలు కల్పిస్తోంది. ల్యాండ్ పూలింగ్ స్కీం వల్ల ఎక్కడ భూమి లభిస్తే అక్కడ కాలనీలు వెలుస్తాయి. అంటే ప్లాన్ ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా అక్కడక్కడా విసిరేసినట్లు అభివృద్ధి జరుగుతుంది. ఇది మాస్టర్‌ప్లాన్ విధానానికే విరుద్ధం. ఈ స్కీం వల్ల కేవలం ఔటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలే తప్ప రేడియల్ రోడ్స్, రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం లేకుండా పోతుంది. పరిహారం ఎలా..? చిన్న, సన్నకారు రైతులు భూములు ఇవ్వకపోతే... చట్టాన్ని అమలు చేసి వారి నుంచి భూములు సేకరిస్తామని హెచ్ఎండీఏ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న భూ సేకరణ చట్టం ప్రకారం మున్సిపాల్టీలకు వెలుపల ఉన్న ప్రాంతాల్లోని భూములకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువకు 4 రెట్లు అధికంగా పరిహారం చెల్లించాలి. ఇప్పటికే ఔటర్ చుట్టూ ఉన్న భూములకు మంచి ధరలున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి సేకరించే భూములకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలన్నది స్పష్టత లేదు. ఆర్థికంగా చితికిపోయిన హెచ్ఎండీఏ కొత్త వెంచర్ బాధ్యతను డెవలపర్స్‌కు అప్పగిస్తే రైతులకు చెల్లించే పరిహారం విషయంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. నిజానికి భూ సేకరణ చట్టం వల్ల భూములివ్వని వారికే లాభం చేకూరనుంది. చట్టంలోని నిబంధనలు గ్రహించినవారు వెంచర్ మధ్యలోని భూములివ్వకుండా మెలికపెట్టే ప్రమాదం ఉంది. అడ్డంకులన్నీ అధిగమించి వెంచర్ అభివృద్ధికి పూనుకొన్నా... చివర్లో తమకు ఆసక్తిలేదని భూ యజమానుల్లో 1/3వంతు మంది అభ్యంతరపెడితే ఈ ప్రాజెక్టుకు నూకలు చెల్లినట్టే. ఇన్ని అవరోధాలున్న ల్యాండ్ పూలింగ్ స్కీంపై హెచ్ఎండీఏ పైపై మెరుగులతో ప్రకటనలు గుప్పించడం విడ్డూరంగా ఉందని పలువురు డెవలపర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.